‘మన స్టేటు, మన లాఠీ’

తెలంగాణ తొలి సర్కారు వచ్చి రెండేళ్ళయంది. ఈ లోపుగానే రెండు సార్లు లాఠీ ఝళిపించింది. పరాయి వాళ్ల మీదనుకున్నారా? పొరుగు రాష్ర్టం వారి మీదనుకున్నారా? కాదు. కాదు. ముమ్మాటికీ తెలంగాణ బిడ్డల మీదే..! వారెవరనుకున్నారు?…

తెలంగాణ తొలి సర్కారు వచ్చి రెండేళ్ళయంది. ఈ లోపుగానే రెండు సార్లు లాఠీ ఝళిపించింది. పరాయి వాళ్ల మీదనుకున్నారా? పొరుగు రాష్ర్టం వారి మీదనుకున్నారా? కాదు. కాదు. ముమ్మాటికీ తెలంగాణ బిడ్డల మీదే..! వారెవరనుకున్నారు? తెలంగాణ విద్యార్థులు; తెలంగాణ రైతులు. 

సంఘటనా స్థలాలు కూడా పోరాట క్షేత్రాలే. తెలంగాణ ఉద్యమానికి పురిటి గడ్డలే. ఒకటి: ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్. రెండు:  మెదక్ జిల్లా. ఈ ఉస్మానియా విద్యార్థులే కేసీఆర్ నిరాహార దీక్షను విరమణ దిశనుంచి పోరాట దశకు మరల్చి, ఆయన వెంట నడిచిన వారు. ఆ మాట కొస్తే, తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావానికి అసలు కర్తలు విద్యార్థులే. వారి త్యాగాన్నే అనుక్షణం కేసీఆర్ ఆయన పార్టీ నేతలూ తరచు స్మరిస్తారు. అలాంటి వారి మీద తెలంగాణ సర్కారు తొలి లాఠీ విసిరింది.  ఇక రైతులంటారా? కేసీఆర్ 2001లో కొత్త పార్టీ స్థాపించినప్పుడు ఆయనకు ఊతమిచ్చింది రైతులే. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు మొత్తం దేశాన్నే కలచి వేశాయి. వారిలో ఆశల్ని చిగురింప చేసింది అప్పట్లో టీఆర్‌ఎస్ పార్టీ. అంతే కాదు, వెంటనే జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికలలో ఈ పార్టీ ఖాతా తెరవటానికి కూడా ఈ రైతులే కారణం. అదే రైతుల మీద తెలంగాణ సర్కారు రెండవ లాఠీ విసిరింది. అది కూడా ఎక్కడ? మెదక్ జిల్లాలో. ఈ జిల్లా పోరాటాల ఖిల్లా. కేసీఆర్‌ను ఎన్నికల్లో గెలిపించి పంపించిన జిల్లా. 
    
ప్రత్యేక తెలంగాణ కోసం 1969 నుంచి ఇప్పటి వరకూ మూడు వెల్లువల్లాగా ఉద్యమాలు వచ్చాయి. మూడు సందర్భాల్లో ముందుండిన చోదకశక్తులు ముగ్గురు: ఉద్యోగులు, రైతులు,విద్యార్థులు. వీరిలో రెండు వర్గాల వారు అప్పుడే తెలంగాణ సర్కారు మీద నిరసనలను మొదలు పెట్టారు. అయితే ఇవేవో రాష్ర్టవ్యాపితంగా వచ్చిన ఆందోళనలు కావు. అలాగే వేల, లక్షల సంఖ్యలోనో జనసమీకరణతో సాగిన మార్చ్‌లు కావు. చెదురు మదురు ఘటనలు లాంటి, చిరు అలజడులే. కానీ, అవి పంపే సంకేతాలు మాత్రం చిన్నవి కావు. మరీ ముఖ్యంగా, వారు రోడ్డెక్కడానికి పురికొల్పిన కారణాలు చిన్నవి కావు.

పక్కనే పెట్టేయవచ్చు. పనిగట్టుకుని వీరిని ఎవరో రెచ్చగొడుతున్నారని, పాత ప్రభుత్వాల తరహాలో నెపాన్ని కనిపెట్టనూ వచ్చు. మొదటి లాఠీ విసిరినప్పుడు, ఇలాంటి కారణాలనే, తెలంగాణ సర్కారు వెతకబోయింది. కానీ, రైతులు రోడ్డు మీద కొచ్చినప్పుడు కూడా ఇదే కారణం చెప్పటానికి వీలు పడదు. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ, ఆ పని చెయ్యలేదు. 

ఇంతకీ ఈ తెలంగాణ విద్యార్థులూ, రైతులూ ఏమడిగారు? ఎప్పుడూ అడిగేవే అడిగారు. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ ఇచ్చిన అనేకానేక హామీల్లో, చెరో ఒక్క హామీని గుర్తు చేశారు. విద్యార్థులయితే ఉద్యోగాలడిగారు; రైతులయితే విద్యుత్తు అడిగారు. సర్కారు వచ్చి రెండునెలలే కదా! వేచి వుండవచ్చు కదా! ఓపిక పట్ట వచ్చు కదా! ఈ ఎదురుదాడి విపక్షాల మీద చెయ్యవచ్చు; మీడియా మీద చెయ్యవచ్చు. కానీ వేచి చూడమని కొలువు ల్లేని విద్యార్థుల్నీ, సాగులేని రైతుల్నీ కోరటం కష్టమే. నిజమే కదా! ‘ఆరు దశబ్దాలలో జరగనిది, రెండు నెలలో జరిగిపోతుందా? అత్యాశ కదూ?’ కానీ,ఈ అత్యాశ కలగటానికి కారకులెవ్వరు? తెలంగాణ ఏర్పడగానే భూతల స్వర్గంలా మారిపోతుందనే కలను వీరికి అమ్మజూపిన వారెవ్వరు? టీఆర్‌ఎస్ తో పాటు, తెలంగాణ ఉద్యమం నుంచి రాజకీయ లబ్ధి పొందగోరిన  పార్టీలన్నీ ఇదే పని చేశాయి. వారందరిలో కెల్లా ఎక్కువ ఆశల్ని చూపింది టీఆర్‌ఎస్. 
    
ఒప్పంద ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేస్తే, ఇక తెలంగాణలో ఎన్ని సర్కారీ కొలువులుంటాయో, ఇదమిధ్ధంగా చెప్పే స్థితిలో తెలంగాణ సర్కారు లేదు. కాబట్టి, వారికి పోస్టులు లేకుండా పోతాయని,, విద్యార్థులు అందోళనకు దిగారు. ఇక రైతులంటారా? విద్యుత్తు గురించే అడిగారు. ఈ ‘కోత’ లేమిటి తండ్రీ, అని అడిగారు. ముందు లాఠీ చార్జీ చేసి, తర్వాత వివరణ ఇచ్చారు. ఆంధ్రసర్కారు, ఓవర్‌హాలింగ్ పేరు మీద, రెండు యూనిట్లను మూసివేసిందంటూ, నెపాన్ని సరిహద్దు దాటించారు. నిజమే కావచ్చు. ‘ముందు ముందు మనం కరెంటు విషయంలో ఆంధ్రసర్కారు మీద అధారపడాల్సి వుంటుంది’ అని విభజన ముందు చెప్పి, రైతుల్ని సన్నధ్ధం చేశారా? ‘మూడేళ్ళ వరకూ ఇదే స్థితి వుంటుంది’ అని ఇప్పుడు తెలంగాణ సర్కారు చెబితే, రైతులు ఏ మార్గాన్ని వెతుక్కోవాలి? 
    
ఈ సమస్యలను పరిష్కరించక పోగా, వారి మీద లాఠీలు విసురుతారా? బషీర్ బాగ్ లో తెలుగుదేశం  సర్కారూ, ముదిగొండలో కాంగ్రెస్ సర్కారూ కాల్పులు జరిపేకదా, అపఖ్యాతి మూటగట్టుకున్నాయి. అంతపని చేయక పోయినా, అదే దారిలో పయినిస్తే, టీఆర్‌ఎస్ అంతకు మించి భిన్నంగా ఎలాగుంటుంది? ఫీజు కట్టే విషయంలో, 1956 కు ముందునుంచీ వున్న తెలంగాణ వాసుల బిడ్డల్ని వెతికి పట్టినట్టు, లాఠీ చార్జీ విషయంలో కూడా, తెలంగాణ సొంత బిడ్డల్నే వెతికి పట్టుకున్నారా? ఇదేనా తెలంగాణ సెంటిమెంటు? ఇదేనా పోరాట యోధులకిచ్చే ప్రతిఫలం? 

కుర్చీలో కూర్చున్న నేతకు రెండు నెలల కాలం అతి స్వల్పం కావచ్చు; కానీ కడుపు మండే విద్యార్థికీ,  దిక్కుతోచని రైతుకీ బహుశా, రెండు నెలలూ రెండు యుగాలు కావచ్చు. ‘వండి వార్చినా, ఇంక వడ్డించరే’ అన్న అసహనంలోంచి వస్తున్న ఈ ధర్మాగ్రహాన్ని  చిన్న బుచ్చటం తెలంగాణ సర్కారుకు అంత మంచిది కాదు.

-సతీష్ చందర్