ఎమ్బీయస్‌ : గోల్కొండ వద్ద పతాకవందనం

ఈ సారి ఆగస్టు 15 సందర్భంగా పతాకవందనం చేయడానికి కెసియార్‌ గోల్కొండ కోటను ఎంచుకున్నారు. పెరేడ్‌ చేయడానికి వీళ్లు ఎంచుకున్న స్థలం తమదంటూ మిలటరీ వాళ్లు అడ్డుపడ్డారట. అక్కడ కాకపోతే పక్కన చేయవచ్చు లెండి.…

ఈ సారి ఆగస్టు 15 సందర్భంగా పతాకవందనం చేయడానికి కెసియార్‌ గోల్కొండ కోటను ఎంచుకున్నారు. పెరేడ్‌ చేయడానికి వీళ్లు ఎంచుకున్న స్థలం తమదంటూ మిలటరీ వాళ్లు అడ్డుపడ్డారట. అక్కడ కాకపోతే పక్కన చేయవచ్చు లెండి. ఏదైతేనేం ఇప్పటిదాకా ఎవరూ చేయని గోల్కొండ వద్ద పతాకవందనం అనేది ఖాయం. అన్నిటిపై తెలంగాణ ముద్ర అంటే ఏమో అనుకున్నాను. (రేపు 19 యింటింటి సర్వే అయిన తర్వాత యింటిమీద కూడా తెలంగాణ రాజముద్ర కొడతారట. గతంలో టౌన్లలో మలేరియా వాళ్లు యింటి గోడమీద చార్టులు గీసేవారు. ఇప్పుడు యింటి ఎలివేషన్‌ కోసం బోల్డు ఖర్చు పెడుతున్నాం. వీళ్లూ, వీళ్ల తర్వాత మరోళ్లూ వచ్చి ముద్రలు కొట్టి పోతే ఎలా తయారవుతుందో ఏమో) సమైక్య రాష్ట్రపు సిఎంలు సైనికవందనం స్వీకరించిన చోట అచ్చ తెలంగాణవాది స్వీకరించకూడదని కెసియార్‌ భావించి గోల్కొండ పథకాన్ని అమలు చేస్తున్నారు లాగుంది. అయితే కిషన్‌ రెడ్డి దీనికి అభ్యంతరం చెప్తున్నారు. నవాబులు పాలించిన గోల్కొండ వద్ద యీ ఫంక్షన్‌ చేయడం ముస్లిములను మెప్పించడానికే అని ఆయన అభ్యంతరం. ఒకప్పుడు ముస్లిములు మనలను పాలించారన్న విషయాన్ని గుర్తు చేసుకున్నట్లు అవుతుందని ఆయన బెంగ కాబోలు. ఆ మాటకొస్తే సికింద్రాబాదు పెరేడ్‌ గ్రౌండ్స్‌లో చేస్తే మాత్రం గొప్పేమిటి? సికిందరాబాద్‌ అనే పేరు ఎలా వచ్చింది? దాన్ని ఒక పట్టణంగా డెవలప్‌ చేసిన నిజాం దానికి తన కొడుకు పేరు పెట్టాడు. పెరేడ్‌ గ్రౌండ్స్‌లో ఇంగ్లీషు దళాలు కవాతు చేసేవి.  ఇలా ఎక్కడకు వెళ్లినా గత చరిత్ర పలకరిస్తూనే వుంటుంది. దాన్ని తుడిపేయలేం.

గోల్కొండ పరిసరాల్లో ఫంక్షన్‌ చేస్తే నష్టమేముంది? పెరేడ్‌ గ్రౌండ్స్‌లో ఫంక్షన్‌ చూసిచూసి బోరు కొట్టేసింది. ఇదైతే వెరైటీగా వుంటుంది. పైగా మన చరిత్రను హైలైట్‌ చేసినట్లవుతుంది. రిపబ్లిక్‌ డేకు ఓరుగల్లు కోట దగ్గర ఫంక్షన్‌ చేయవచ్చు. ఢిల్లీ పాలకులు ఎఱ్ఱకోట నుండి ఎగరేయగా లేనిది, మనం మరో కోట బురుజు నుండి ఎగరేయకూడదా? సమ్మక్క, సారక్క జాతరను ఏకంగా జాతీయపండుగ చేస్తానంటే అభ్యంతరం పెట్టనివారు, చరిత్రను ప్రజలకు చేరువ చేసే యీ ప్రయత్నాలకు గండి కొట్టబూనడం బాగా లేదు. అన్ని ఫంక్షన్లూ హైదరాబాదులో పెట్టి తక్కిన ప్రదేశాలన్నీ ఎండగట్టేశారు. సాంస్కృతిక మహాసభలున్నాయనుకోండి హైదరాబాదులో లాల్‌ బహదూర్‌ స్టేడియంలో పెట్టేసి ఒక్కో గేటుకి పోతన, పాల్కురికి సోమనాథుడు, రామదాసు, గుణాఢ్యుడు… అంటూ పేర్లు పెట్టేసి సరిపెట్టేసే ప్రమాదం వుంది. అంతకంటె ఆ యా కవులు పుట్టిన చోట సభలు నిర్వహిస్తే రాష్ట్రమంతా వారి పట్ల, వారు మనకు అందించిన సాంస్కృతిక వారసత్వం పట్ల అవగాహన పెరుగుతుంది. ఇవన్నీ చేయకుండా గోల్కొండ వద్ద ఫంక్షన్‌ చేసి వూరుకుంటే మాత్రం యిదేదో ముస్లిములను చంకనేసుకునే ప్రయత్నంలా తోచడంలో ఆశ్చర్యం లేదు. 

ఎందుకంటే మజ్లిస్‌ను బుజ్జగించడంలో కాంగ్రెసు స్థానంలోకి తెరాస వచ్చినట్లు కనబడుతోంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం అంటూ మొదలుపెట్టిన సర్కారు రథం పాతబస్తీ చేరకుండానే మందగించింది. ఒవైసీ ఆసుపత్రే అక్రమ నిర్మాణం అని ఎవరో నాయకులన్నారు. అవునో కాదో సర్కారు వారే తేల్చాలి. నోటీసులు లేకుండా భవంతులు కూల్చేస్తే ఎలా, మోసపూరితంగా అమ్మినవారిని, అనుమతించిన అధికారులను వదిలేసి, కష్టార్జితంతో కొన్నవారికి శిక్షా? అని అడిగినవారిని 'అక్రమ నిర్మాణాలను సమర్థిస్తారా?' అని దబాయించినప్పుడు, పాతబస్తీలో కూడా కూల్చివేతలు చేపట్టినపుడే సర్కారు నిజాయితీ తేల్తుంది అనుకున్నారు. తేల్చుకునే అవకాశం వాళ్లింకా యివ్వలేదు. ముస్లింలకు 12% రిజర్వేషన్‌ అనేది వాళ్లను ఆకట్టుకోవడానికే అన్నది సుస్పష్టం. మొన్న రంజాన్‌ రోజున రాజేంద్రనగర్‌లో ఒక ఈద్గాలో ప్రార్థనల కోసం రోడ్డు బ్లాక్‌ చేసేయడంతో గంటన్నరపాటు కారులో వేచి వుండాల్సి వచ్చింది. ప్రార్థనల తర్వాత మతగురువు 'ఇది ఉపన్యాసం కాదు' అంటూనే ఉపన్యాసం యిస్తూ 'మనకు 12% రిజర్వేషన్‌ యిచ్చిన తెలంగాణ సర్కారుకు మనం కృతజ్ఞత తెలపాలి' అంటూ భక్తులకు ఉద్బోధిస్తున్నాడు. కెసియార్‌ కోరుకున్నది యిదే. మసీదుల్లో కూడా తన పార్టీకి ప్రచారం సాగాలి. 

సానియాను తెలంగాణకు అంబాసిడర్‌గా నియమించడాన్ని కూడా యిదే కోణంలో చాలామంది చూశారు. ఆమె తెలంగాణలో పుట్టలేదు, తెలంగాణ అధికార భాష అయిన తెలుగు వచ్చినట్లుగా దాఖలాలు లేవు, తెలంగాణవాసిని పెళ్లి చేసుకోలేదు, అయినా ఆమెను తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌ చేశారు. అదేమంటే గుజరాత్‌కు అమితాబ్‌ బచ్చన్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌ చేయలేదా? ఆయన గుజరాత్‌లో పుట్టాడా? గుజరాతీ వచ్చా? గుజరాతీని పెళ్లాడాడా? అని అడుగుతున్నారు. కరక్టే కదా. అయితే స్థానికత గురించి తెలంగాణ ఫక్కీలో గుజరాత్‌ యిస్యూ చేయడం లేదు కదా! ఇక్కడైతే విద్యార్థుల్లో 60% మంది మా వాళ్లు కాదు, 1956కి ముందు నుండి వున్నవాళ్లే మా వాళ్లు, లేనివాళ్లు పరాయివాళ్లు అని తీర్మానించారు. ఈ విషయంలో అంత పట్టుదల వున్నవాళ్లు ఎక్కడో పుట్టిన సానియా మీర్జాను చేసే బదులు పుల్లెల గోపీచంద్‌ను చేయవచ్చు కదా అని అడుగుతున్నారు. దానికి జవాబు యివ్వడం కష్టమే. తెలంగాణ టూరిజంకు సానియా దోహదపడతారట. అంటే గుజరాత్‌ టూరిజం యాడ్‌ ఫిలింస్‌లో అమితాబ్‌ లాగానే గుళ్లూ, గోపురాలు, మసీదులు తిరిగి వాటి గొప్పతనాన్ని చెపుతారన్నమాట. రేపు గోదావరి పుష్కరాలకు అందర్నీ రమ్మనమని ప్రచారం చేస్తారన్నమాట. 

నాకో సందేహం – హిందువులైతే మసీదులకు, గురుద్వారాలకు తలపై ఆచ్ఛాదన వేసుకుని లోపలకు వెళ్లి వాటిని చూసి వస్తారు, ఫోటోలు తీయించుకుని, కాన్వాస్‌ చేస్తారు. చర్చిల్లో అయితే ఆచ్ఛాదన అక్కరలేకుండానే వెళతారు. ఈ మధ్య సాక్షి డైలీ సెలబ్రిటీలను రిపోర్టర్లుగా పంపి కొన్ని వర్గాల వారిని యింటర్వ్యూ చేయిస్తోంది. సినీనటుడు ఆలీని ఫిలిం నగర్‌ గుడికి పంపి అర్చకులను ప్రశ్నలడిగించింది. ఫోటోల ప్రకారం ఆలీ గుళ్లోకి వెళ్లలేదు. మెట్ల మీదే కూర్చుని ప్రశ్నలడిగారు. ఆయన ముస్లిం కాబట్టి లోపలకి వెళ్లడానికి గుడివాళ్లు ఒప్పుకోలేదా? వాళ్లు అనుమతి ఇచ్చినా ముస్లిం మతపెద్దలు ఆగ్రహిస్తారని ఆలీకి భయమా? విగ్రహారాధన ప్రోత్సహిస్తున్నావంటూ, కాఫిర్‌ వంటూ ఫత్వాలు జారీ చేస్తారని దడిశారా? రేపు సానియాకు యిటువంటి సమస్య రాదా? సర్కారు వారి బ్రాండ్‌ అంబాసిడర్‌ కాబట్టి ఆలయనిర్వాహకులు అనుమతి యిచ్చినా ఆమె మతపెద్దలు వూరుకుంటారా? ఇండియాలో ముస్లిం పెద్దలు పోనీలే అనుకున్నా, ఆమె మెట్టినిల్లయిన పాకిస్తాన్‌లో వుదారంగా వుంటారా? ముఖ్యంగా తాలిబన్లు చెలరేగిపోతున్న ఆ సీమలో…? 

అవన్నీ ఖాతరు చేయకుండా ఫిలింనగర్‌ గుడే ఏమిటి, భద్రాచలం, ధర్మపురి, వేములవాడ, కాళేశ్వరం.. యిత్యాది గుళ్లలో  సానియా చీర కట్టుకుని, బొట్టు పెట్టుకుని తిరుగాడుతూ వాటి ప్రాశస్త్యం, మహిమ మనకు ఇంగ్లీషు, ఉర్దూలలో (తెలుగులో వాయిస్‌ ఎవరో డబ్‌ చేస్తారు లెండి) వివరిస్తుందనే ఊహ, పసుపు పూసుకుని గోదావరిలో మూడు మునకలు వేసి సూర్యుడికి అర్ఘ్యం యిచ్చే ఊహ నాకు తమాషాగా తోస్తున్నాయి. మంత్రసానితనం ఒప్పుకున్నాక బిడ్డ వచ్చినా పట్టాలి, బెడ్డ వచ్చినా పట్టాలి అన్నట్లు కోటి రూపాయలు పుచ్చుకున్నాక గుడికీ వెళ్లాలి, చర్చికీ వెళ్లాలి. ఆవిడ వెళుతుంది లెండి. ఇప్పటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజాధనం కోటి రూపాయలంటే మాటలా? వెయ్యి మంది బీదవిద్యార్థుల ఫీజు! పాకిస్తాన్‌ కోడలు కాబట్టి సానియా బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనికిరాదని మరీ విమర్శలు వస్తే కెసియార్‌కు ఒళ్లు మండి '..అయితే తెలంగాణ అల్లుణ్ని నియమిస్తా పట్టండి' అంటూ పాతబస్తీలో చిన్నపిల్లలను నికా చేసుకునే ఏ అరబ్‌ షేక్‌నో నియమిస్తే మరీ ఎబ్బెట్టుగా వుంటుంది. అంతకంటె సానియాయే బెటరు. అయితే దీన్ని ముస్లిం కోణంలో చూడడం వలన చిక్కు వస్తోంది.

కెసియార్‌ ఆ కోణంలో చూసే సానియాను నియమించారా లేదా అన్నది భవిష్యత్తులో ఆయన వేయబోయే అడుగులను చూసి చెప్పగలుగుతాం. ఇప్పుడు వ్యవసాయ యూనివర్శిటీకు ఎన్‌ జి రంగాగారి పేరు మార్చి జయశంకర్‌ గారి పేరు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ ఉద్యమానికి ఊపిరిగా వున్న జయశంకర్‌ పేరు స్మరించి తీరవలసినదే. ఒక జిల్లాకు ఆయన పేరు పెడతామన్నారు. బాగుంది. మధ్యలో పాత యూనివర్శిటీకి ఉన్న పేరు వూడగొట్టి  యీయన పేరు పెట్టడం దేనికి? బంగారు తెలంగాణలో ఎన్నో, ఎన్నో ప్రాజెక్టులు తెస్తామని అంటున్నారు కదా, వాటికి ఫ్రెష్‌గా ఆయన పేరు పెట్టవచ్చు కదా! మరొక పేరుతో ఎంగిలి చేసిన వర్శిటీకి యీయన పేరెందుకు? ఎంగిలి బాధ లేదనుకున్నా వ్యవసాయ యూనివర్శిటీ కెందుకు ఆయన పేరు? ఎన్‌ జి రంగా అయితే ఆయన జీవితమంతా రైతు సంక్షేమానికే ధారపోశారు. జయశంకర్‌ బోధించిన సబ్జక్ట్‌ ఎకనమిక్స్‌. రైతులతో ముడిపడి వున్న కెరియర్‌ కాదాయనది. పేర్లు మార్చాలంటే చాలా సంస్థలున్నాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీల పేర్లు ప్రతీ దానికీ పెట్టేశారు. మచ్చుకు రెండు, మూడు వుంచి మిగతావాటికి మార్చేయవచ్చు. ఆ క్రమంలో యిప్పటిదాకా మరుగున పడిన మహానుభావుల పేర్లు పెట్టవచ్చు. సురవరం, మాడపాటి, రావి నారాయణ రెడ్డి, కాళోజీ, బూర్గుల, స్వామి రామతీర్థ… ఎంతమంది లేరు! ఇలా వాళ్ల పేర్లు పెట్టినపుడు వాళ్లెవరో తెలుసుకోవాలనే ఉత్సుకత పౌరుల్లో, విద్యార్థుల్లో కలుగుతుంది. తమ ప్రాంతపు ఘనత తెలుసుకుంటారు. జయశంకర్‌ గారి పేరు జిల్లాకే పెట్టబోతున్నపుడు మళ్లీ యిప్పుడో యూనివర్శిటీకి పెట్టడం దేనికో తెలియదు. మార్చవలసిన పేర్లు చాలా వున్నాయన్నారు కెసియార్‌. ఆ మార్చడాల్లో ముస్లిం పేర్లు ఎక్కువ వచ్చాయంటే అప్పుడు మళ్లీ అనుమానం వస్తుంది.

అసలు సిసలు యాసిడ్‌ టెస్టు తెలంగాణ విమోచనోద్యమం పేర సెప్టెంబరులో రాబోతోంది. సైనిక చర్య ద్వారా నిజాం ప్రభుత్వాన్ని కూలదోసిన ఘట్టాన్ని బ్రహ్మాండంగా జరపాలని అటు రైటిస్టులు, యిటు లెఫ్టిస్టులు యిద్దరూ కోరుతున్నారు. తెలంగాణ ప్రజలు సాయుధపోరాటం చేయడంలో దిట్టలు, అవసరమైతే ఆయుధాలు పట్టడానికి వెరువరు అంటూ ఎన్నోసార్లు గొప్పగా చెప్పుకున్న కెసియార్‌ విమోచనదినాన్ని సెలబ్రేట్‌ చేయడానికి మామూలుగా అయితే జంకకూడదు. కానీ ఆయన చేసి తీరతామని చెప్పటం లేదు. ఎందుకు? ముస్లిములకు కోపం వస్తుందన్న భయమా? నిజానికి నిజాం పాలనలో హిందువులు మాత్రమే కాదు ముస్లిములతో సహా యావన్మంది ప్రజలూ కష్టాలు పడ్డారు. సాధారణ ప్రజలే కాదు, ముస్లిం జమీందార్లు కూడా వేర్వేరు రకాలుగా అవస్థలు పడ్డారు. నిజాంపై తిరుగుబాటు చేసినవారిలో ముస్లిములు కూడా వున్నారు. 

అందువలన అది ముస్లిం-హిందూ పోరాటం కాదు, నియంతృత్వానికి, స్వేచ్ఛకు జరిగిన పోరాటం. దాన్ని గుర్తించి ఫంక్షన్‌ జరుపుకోవడంలో ఔచిత్యం వుంది. అయితే దాన్ని గుర్తు చేస్తే ముస్లిముల మనోభావాలు దెబ్బ తింటాయేమోనని అప్పటి కాంగ్రెసు ప్రభుత్వం ఫంక్షన్‌ చేయడానికి దడిసింది. అప్పణ్నుంచి అన్ని ప్రభుత్వాలూ అదే పంథాలో నడిచాయి. అన్నిటిపై తెలంగాణ ముద్ర వేస్తున్న కెసియార్‌ యీ విషయంలో కూడా ముద్ర వేసి ఆ వేడుక జరపడమే సబబు. అయితే ఉద్యమసందర్భంగా అనేకమార్లు నిజాంను, నిజాం పాలనను కీర్తించిన కెసియార్‌ ఆ నిజాం గద్దె దిగిన సందర్భాన్ని సెలబ్రేట్‌ చేస్తారా అని అందరికీ సందేహం. తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు చేసుకున్నవారిని అమరవీరులంటూ వారి కుటుంబాలకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. నిజాంను ఎదిరించడానికి రక్తతర్పణాలు అర్పించిన పోరాటవీరులను స్మరించి నివాళి అర్పించడానికి కూడా కుదరదంటే ఎలా? ప్రతీదానికీ ముస్లిం ఓట్లతో లింకు పెడితే కాంగ్రెసుకు, తెరాసకు తేడా లేకుండా పోతుంది. 

బహమనీ సుల్తానుల వైభవానికి గుర్తుగా మిగిలిన గోల్కొండను మళ్లీ జ్ఞప్తిలోకి తెచ్చి హైలైట్‌ చేయడం ఎంత అవసరమో, దుష్ట నిజాం పాలన అంతమైన రోజు గుర్తు చేయడం కూడా అంతే అవసరం. ఒకటి చేసి, మరొకటి మానేస్తే మాత్రం రాజకీయ దురుద్దేశాలున్నాయనే అర్థం తీయవలసి వస్తుంది. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2014)

[email protected]