సినిమా రివ్యూ: కంచె

రివ్యూ: కంచె రేటింగ్‌: 3/5 బ్యానర్‌: ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తారాగణం: వరుణ్‌ తేజ్‌, ప్రగ్యా జైస్వాల్‌, నికితిన్‌ ధీర్‌, అవసరాల శ్రీనివాస్‌, గొల్లపూడి మారుతీరావు, పోసాని కృష్ణమురళి, రాజేష్‌, షావుకారు జానకి తదితరులు…

రివ్యూ: కంచె
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: వరుణ్‌ తేజ్‌, ప్రగ్యా జైస్వాల్‌, నికితిన్‌ ధీర్‌, అవసరాల శ్రీనివాస్‌, గొల్లపూడి మారుతీరావు, పోసాని కృష్ణమురళి, రాజేష్‌, షావుకారు జానకి తదితరులు
సంభాషణలు: సాయిమాధవ్‌ బుర్రా
సంగీతం: చిరంతన్‌ భట్‌
సాహిత్యం: 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి
కూర్పు: సూరజ్‌ జగ్తప్‌, రామకృష్ణ అర్రం
ఛాయాగ్రహణం: వి.ఎస్‌. జ్ఞానశేఖర్‌
నిర్మాతలు: వై. రాజీవ్‌ రెడ్డి, జె. సాయిబాబు
కథ, కథనం, దర్శకత్వం: క్రిష్‌
విడుదల తేదీ: అక్టోబర్‌ 22, 2015

క్రిష్‌ అనగానే గుర్తుకొచ్చే క్యారెక్టర్లు.. 'గమ్యం'లో గాలి శీను, 'వేదం'లో కేబుల్‌ రాజు. చిరస్మరణీయమైన పాత్రల్ని, చూసిన తర్వాత చాలా కాలం వెంటాడే చిత్రాలని అందించిన క్రిష్‌ నుంచి వస్తున్న చిత్రమనగానే 'కంచె'పై సినీ ప్రియులకి, క్రిష్‌ అభిమానులకి ఒక విధమైన అంచనాలు ఏర్పడ్డాయి. ధూపాటి హరిబాబు (వరుణ్‌), సీతగార్ల (ప్రగ్య) ప్రేమకథ మీద ఆసక్తిని ట్రెయిలర్లతోనే కలిగించిన క్రిష్‌ రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యాన్ని ఎంచుకుని కంచెపై అంచనాలని కూడా పెంచాడు. 

క్రిష్‌ సినిమా నుంచి ఆశించే గొప్ప లక్షణాలైతే 'కంచె'లో ఉన్నాయి కానీ తను తీసిన గమ్యం, వేదం సరసన నిలిచేంత గొప్పతనం మాత్రం గోచరించలేదు. కంచె చిత్రంలో క్రిష్‌ ముద్ర ఉన్న సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి సైనికుల ప్రాణాలు రక్షించడానికి తన అభిమానాన్ని అడ్డు పెట్టే జర్మన్‌ యువతి, పసిపాప ప్రాణం కాపాడేందుకు ప్రాణాల్ని లెక్కచేయని కథానాయకుడు, 'లేచిపోవడం' అంటే తమ ప్రేమ చెడిపోవడమే అంటూ ధైర్యంగా ప్రేమించిన అమ్మాయికి తాళి కట్టే దృశ్యం.. ఇలా క్రిష్‌ పలుచోట్ల తనలోని దర్శకుడిని అద్భుతంగా ఆవిష్కరించుకున్న సందర్భాలున్నాయి. కాకపోతే తన సినిమాల్లో కనిపించే బలమైన భావోద్వేగాల్ని మిస్‌ అయ్యాడు. క్యారెక్టర్స్‌ని చిరస్మరణీయం చేసే తన ప్రత్యేకతని చూపెట్టలేదు. 

కంచె చిత్రంలో దర్శకుడిగా క్రిష్‌ చెబుదామనుకున్న దానికంటే, మాటల రచయితగా సాయిమాధవ్‌ బుర్రా ఎక్కువ చెప్పగలిగాడు, చప్పట్లు కొట్టించగలిగాడు. అద్భుతమైన సంభాషణలతో సన్నివేశాల్లో లేని బలాన్ని కూడా తెచ్చి పెట్టాడు. సినిమా అనేది దృశ్య ప్రధానమైనది కనుక సంభాషణలు హైలైట్‌ అయి దృశ్యం బేలగా అనిపించిందంటే దర్శకుడు పూర్తి స్థాయిలో ప్రభావం చూపించనట్టే. కానీ మరోసారి మూస పద్ధతుల జోలికి పోకుండా, ప్రతి సినిమాతో ప్రేక్షకులకి కొత్త అనుభూతిని అందించడం కోసం క్రిష్‌ పడే తపన మాత్రం 'కంచె' చిత్రంలోను కనిపించింది. 

కామెడీతో లేదా మసాలా అంశాలతో వ్యాపారం చేసుకోవడమే తప్ప సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వడం మీద దృష్టి పెట్టని చాలా మంది దర్శకుల మధ్య తను నమ్మిన దార్లో సినిమాలు తీసుకుంటూ పోవడం, వాణిజ్య విలువల పేరిట ఎక్కడా దారి తప్పకపోవడం మామూలు విషయాలు కాదు. నిజానికి క్రిష్‌ రాసుకున్న కథ చాలా ఉన్నతంగా ఉంది. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యాన్ని, ఆ కాలమానంలో మనుషుల మధ్య ఉన్న అంతరాలని అనుసంధానం చేస్తూ ఒక చక్కని కథ, ఆ రెండు నేపథ్యాలని సమాంతరంగా నడిపిస్తూ పొందికైన కథనం 'కంచె'లో కుదిరాయి. అయితే తనకి సంబంధం లేని సైనికుల ప్రాణాల్ని కాపాడ్డానికి ఒక జర్మన్‌ యువతి చేసే సాహసం, దాని వెంట అమ్మతనం డైలాగ్‌.. లాంటి సీన్లు మరిన్ని పడాల్సింది.

శత్రు దేశంలో ఒక మిషన్‌ మీద ఉన్న ఒక గుప్పెడు మంది సైనికులు చేసే సాహస విన్యాసాలు ఆసాంతం ఉత్కంఠ రేపాలి. కానీ 'కంచె'లో ఆ సన్నివేశాలన్నీ చులాగ్గా అయిపోతుంటాయి తప్ప ఎక్కడా టెన్షన్‌ పుట్టించవు. అలాగే కథలో కీలకమైన హరిబాబు, సీత పాత్రలకి ఇచ్చిన కన్‌క్లూజన్‌ కూడా ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. ఎమోషనల్‌గా కదిలించాల్సిన చోట క్రిష్‌ రాబట్టాల్సిన ఎఫెక్ట్‌ రాబట్టలేదు. వేదం పతాక సన్నివేశాలు ఏ స్థాయిలో కదిలిస్తాయో ఆ విధంగా కంచె కూడా ప్రభావం చూపించాల్సింది. ఇలాంటి సినిమాలు థియేటర్‌ దాటి బయటకి వచ్చినా కానీ వెంటాడుతుండాలి. కానీ కంచె చూస్తున్నంతసేపు బాగానే అనిపించినా కానీ గుర్తుండిపోయే విధంగా మాత్రం తెరకెక్కలేదనే చెప్పాలి. 

రెండో సినిమాకే వరుణ్‌తేజ్‌ నటుడిగా పరిణితి చూపించాడు. తన కథల ఎంపిక చూస్తే వరుణ్‌ తేజ్‌పై నమ్మకం పెట్టుకోవచ్చుననిపించింది. ప్రగ్యది మరీ నవ్వు ముఖం కావడం వల్ల ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా నవ్వుని దాచలేకపోయింది. తన వరకు తాను బాగానే చేసింది కానీ మరింత ఎక్స్‌ప్రెసివ్‌ ఫేస్‌ అయితే ఎఫెక్టివ్‌గా ఉండేది. నికితిన్‌ ధీర్‌ పాత్రకి తగ్గ ఠీవి, దర్పంతో కనిపించాడు. అవసరాల శ్రీనివాస్‌ తనకే చెల్లిన చమక్కులతో చక్కిలిగింతలు పెట్టాడు. గొల్లపూడి మారుతీరావుకి కొన్ని మంచి సన్నివేశాలు ఇచ్చారు. ఆయన సహజ నటనతో ఆకట్టుకున్నారు. 

పాటలన్నీ కథలో భాగంగా వచ్చేవే. సిరివెన్నెల రాసిన అద్భుతమైన సాహిత్యంతో పాటలు సాహితీ ప్రియులని ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం యుద్ధ సన్నివేశాల్లో బాగా కుదిరింది. సినిమాటోగ్రఫీ కూడా ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉంది. ఇంత స్పాన్‌ ఉన్న కథని రెండు గంటల మీద కొన్ని నిమిషాల వ్యవధిలో చెప్పడంలో ఎడిటర్స్‌కి క్రెడిట్‌ దక్కుతుంది. ఇలాంటి సినిమాని నిర్మించిన నిర్మాతల అభిరుచిని మెచ్చుకోవాలి. 

ఒక మంచి ప్రయత్నానికీ, ఒక గొప్ప చిత్రానికీ మధ్య ఉండే 'కంచె'ని దాటలేదు కానీ రొటీన్‌ సినిమాల నుంచి కాస్త రిలీఫ్‌ కోరుకునే వారికి మాత్రం ఇది మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది. సినిమాలకి రాజ పోషకులైన మాస్‌ ప్రేక్షకుల మన్ననలు అందుకునే లక్షణాలు లేకపోవడం వల్ల… సక్సెస్‌ తీరం దాటేందుకు అభిరుచిగల ప్రేక్షకుల అండదండల మీదే ఆధారపడాలి. 

బోటమ్‌ లైన్‌: రొటీన్‌ 'కంచె'ని తెంచింది, కానీ!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri