ప‌వ‌న్ ఇంటిపై దాడి చేసింది ఎవ‌రు?

రెండ్రోజుల క్రితం ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటి ముందు గ‌లాభా జ‌రిగిన విష‌యం న్యూస్‌ని బాగా ఫాలో అయ్యేవారికి త‌ప్ప తెలియ‌లేదు. ఆ త‌ర్వాత కూడా దీనికి సంబంధించిన వివ‌రాలేవీ…

రెండ్రోజుల క్రితం ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటి ముందు గ‌లాభా జ‌రిగిన విష‌యం న్యూస్‌ని బాగా ఫాలో అయ్యేవారికి త‌ప్ప తెలియ‌లేదు. ఆ త‌ర్వాత కూడా దీనికి సంబంధించిన వివ‌రాలేవీ వెల్లడి కాలేదు. విశ్వస‌నీయంగా తెలుస్తున్న స‌మాచారం ప్రకారం…

గ‌త 21వ తేదీ గురువారం రాత్రి 11గంట‌ల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్‌నెం.12, ఎమ్మెల్యేకాల‌నీలో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటికి ముగ్గురు యువ‌కులు వ‌చ్చారు. ప‌వ‌న్ నివ‌సిస్తున్న అపార్ట్ మెంట్ ఫ్లాట్ ద‌గ్గర‌కు వ‌చ్చి అక్కడి సెక్యూరిటీ గార్డ్‌ను ప‌వ‌న్ గురించి ఆరా తీశారు. ఈ లోగా ప‌వ‌న్ బాడీగార్డ్ అయిన బౌన్సర్ జ‌హంగీర్ అక్కడికి వ‌చ్చాడు. విష‌యం ఏమిటంటే…  ప‌వ‌న్‌ను క‌ల‌వాల‌నుకుంటున్నట్టు వీళ్లు చెప్పారు. అయితే ఇప్పుడు కుద‌ర‌ద‌ని అక్కడి నుంచి వెళ్లిపోండంటూ బౌన్సర్ వారిని అదిలించేశాడు. 

అయితే ఆ ముగ్గురూ అనూహ్యంగా  లోప‌లికి ప్రవేశించి బౌన్సర్‌పై దాడి చేశారు. అత‌డిని కొట్టి, గాయ‌ప‌రిచి మ‌రికొంద‌రు వ‌చ్చేలోగా ప‌రార‌య్యారు. స‌మాచారం అందుకున్న పోలీసులు రంగ‌ప్రవేశం చేసి వివ‌రాలు న‌మోదు చేసుకున్నారు. బౌన్సర్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్నారు. 

ఈ సంఘ‌ట‌న జ‌రిగి రెండ్రోజులు అవుతోంది.ఈ ఉదంతం దొంగ‌త‌నం చేయాల‌నే త‌లంపుతో జ‌రిగి ఉండ‌వ‌చ్చున‌ని తొలుత మీడియాతో పోలీసులు చెప్పారు. ఆ త‌ర్వాత ఈ ప‌ని చేసిన వారు తాగుబోతుల్లా క‌నిపిస్తోంద‌న్నారు. అయితే తాజాగా పోలీసుల‌ను ఈ విష‌యంపై ప్రశ్నిస్తే… అస‌లు స‌ద‌రు సంఘ‌ట‌న జ‌ర‌గ‌న‌ట్టే స్పందిస్తున్నారు. పైగా స‌ద‌రు సంఘ‌ట‌న‌కు సంబంధించి త‌మ‌కేమీ ఫిర్యాదు రాలేద‌ని స్పష్టం చేస్తున్నారు. 

నిజానికి రాష్ట్రస్థాయి ప్రముఖులు నివ‌సించే ఎమ్మెల్యే కాల‌నీ భ‌ధ్రతా ప‌రంగా మంచి క‌ట్టుదిట్టమైన ఏర్పాట్లతోనే ఉంటుంది. అలాగే ప‌వ‌న్ నివ‌సించే అపార్ట్ మెంట్ కూడా సుర‌క్షిత‌మైన భ‌ధ్రత క‌లిగిందే. మ‌రి అలాంటి చోట ఎవ‌రో అగంత‌కులు వ‌చ్చి గ‌లాభా చేసి యధేఛ్చగా వెళ్లిపోవ‌డం విశేషం. అంత‌క‌న్నా విశేషం వారెవ‌రో ఇంకా తేల‌క‌పోవ‌డం. అపార్ట్‌మెంట్ సిసి కెమెరాల్లో ఉన్న ఫుటేజ్ గురించి కూడా ఏమీ తెలీడం లేదు. ఇది దొంగ‌ల ప‌నే అయితే ఇంత‌గా దాయ‌ల్సిన అవ‌స‌రం ఏముంద‌నే ప్రశ్న కూడా ఉద‌యిస్తోంది. 

రాష్ట్రవ్యాప్తంగా పేరున్న, అభిమానించేవారూ, విభేధించే వారూ ఎంద‌రో ఉన్న వ్యక్తి ఇంటి మీద అర్ధరాత్రి జ‌రిగిన దాడి విష‌యం ఇలా ఇంకా చీక‌ట్లోనే మ‌గ్గిపోతుందా?  లేక వెలుగు చూస్తుందా? ప‌్రస్తుతం పోలీసుల వైఖ‌రి చూస్తుంటే మాత్రం తొలి అనుమాన‌మే నిజ‌మౌతుందేమో అనిపిస్తోంది.