Advertisement

Advertisement


Home > Movies - Reviews

రివ్యూ: 1 నేనొక్కడినే - సైనికుడు 2!

రివ్యూ: 1 నేనొక్కడినే - సైనికుడు 2!

రివ్యూ: 1 నేనొక్కడినే
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
తారాగణం: మహేష్‌బాబు, కృతి సానోన్‌, నాజర్‌, కెల్లీ డార్జ్‌, పోసాని కృష్ణమురళి, ప్రదీప్‌ రావత్‌ తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
కూర్పు: కార్తీక శ్రీనివాస్‌
ఛాయాగ్రహణం: ఆర్‌. రత్నవేలు
నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనిల్‌ సుంకర
రచన, దర్శకత్వం: బి. సుకుమార్‌
విడుదల తేదీ: జనవరి 10, 2014

వరుసగా మూడు విజయాలు అందుకుని వాయువేగంతో దూసుకుపోతున్న మహేష్‌బాబు, దూకుడుతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమని తమవైపుకి తిప్పుకున్న నిర్మాతల త్రయం, ఆర్య, 100% లవ్‌లాంటి వెరైటీ చిత్రాలతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు. వెరసి ‘1 నేనొక్కడినే’ తెలుగు సినిమా మూస పోకడల్ని బ్రేక్‌ చేసే సరికొత్త తరహా చిత్రమవుతుందని అనుకున్నారు. కానీ ఈ చిత్రం అంచనాలని తలకిందులు చేసింది. కొత్తదనం పేరుతో మూడు గంటల పాటు సహనాన్ని పరీక్షించింది. 

కథేంటి?

రాక్‌స్టార్‌ అయిన గౌతమ్‌ని (మహేష్‌) ఏవో పీడకలలు వెంటాడుతుంటాయి. అవి ఎంతగా అతడిని వేధిస్తాయంటే వాటిని నిజమనుకుని నమ్మి, నిజంగానే కలలోని వ్యక్తులని ఊహించుకుని, వారిని చంపేస్తుంటాడు. తన చిన్నతనంలో తల్లిదండ్రుల్ని చంపిన వాళ్లే తననిలా పీడకలలా వెంటాడుతున్నారని అర్థం చేసుకుని, ఎవరు నమ్మినా, నమ్మకున్నా తను నమ్మిన నిజం వైపుగా ప్రయాణం మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతనికి జర్నలిస్ట్‌ సమీర (కృతి) సాయం చేస్తుంది. అసలు గౌతమ్‌ ఎవరు? తన తల్లిదండ్రుల్ని ఎందుకు చంపారు? అన్నది మిగతా కథ.

కళాకారుల పనితీరు!

మహేష్‌బాబు ఇప్పటికే ఎన్నోసార్లు ఉత్తమనటుడిగా నందులు, ఫిలింఫేర్‌లు గెలుచుకున్నాడు. మరోసారి నందిని తీసుకెళ్లడానికి తగ్గ అభినయాన్ని ఇందులో ప్రదర్శించాడు. చాలా క్లిష్టమైన పాత్ర... సంక్లిష్టమైన భావోద్వేగాలు. ఎక్కువ నవ్వకూడదు... అలా అని బిగుసుకుపోకూడదు. ఒక నటుడి పరిణితిని పరీక్షించే పాత్రలో మహేష్‌బాబు జీవించాడు. ఈ సినిమా ఎంత టార్చర్‌ పెట్టినా కానీ కూర్చుని చూడగలిగామంటే అందుకు కారణం మహేష్‌ మాత్రమే. తన శరీరాన్ని పాత్రకి అనుగుణంగా మలచుకున్నాడు. అభిమానుల్ని అలరించడానికి మామూలుగా కంటే ఎక్కువగా డాన్సులు కూడా చేసాడు. ఫిజికల్‌గా, మెంటల్‌గా కూడా తనని కష్టపెట్టిన ఈ పాత్రకి మహేష్‌ నూరు శాతం న్యాయం చేసాడు. 

కృతి సానోన్‌ చూడ్డానికి బాగుంది. ఫర్‌ఫార్మెన్స్‌ కూడా ఫర్వాలేదు కానీ ఆమె క్యారెక్టరైజేషన్‌ ఇరిటేట్‌ చేస్తుంది. గోవాలో ఆడే డ్యూయెల్‌ రోల్‌ డ్రామా అయితే విపరీతంగా విసిగిస్తుంది. విలన్లుగా నటించిన ముగ్గురూ రొటీన్‌గానే చేసారు. పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో ఏదో చేయాలని చూసాడు కానీ అతనికి కూడా అంత స్కోప్‌ ఏమీ లేదు. ప్రధానంగా హీరో తప్ప మిగతా సైడ్‌ క్యారెక్టర్స్‌కి ఎక్కువ స్క్రీన్‌ టైమ్‌ లేదు. 

సాంకేతిక వర్గం పనితీరు:

దేవిశ్రీప్రసాద్‌ సంగీతం బాగుంది. ‘సయోనరా’, ‘యు ఆర్‌ మై లవ్‌’ పాటలు స్క్రీన్‌పై బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా సినిమా మూడ్‌కి దోహదపడింది. రత్నవేలు ఛాయాగ్రహణం హై స్టాండర్డ్స్‌లో ఉంది. సినిమాలో ఒక డార్క్‌ టోన్‌ని మెయింటైన్‌ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్‌ విషయంలో మరీ మొహమాటపడ్డారు. ఇలాంటి డార్క్‌ సినిమాకి ఇంత రన్‌ టైమ్‌ ఉండడం సూయిసైడల్‌. నిర్మాతలు ఈ చిత్రంపై ఇంత ఖర్చు పెట్టేసారంటే వారి గట్స్‌ మెచ్చుకోవాలి. కంటెంట్‌ని నమ్మి ఖర్చు పెట్టినందుకు వారిని అభినందించినా కానీ ఈ కథకి ఈ ఖర్చు అవసరమా, కాదా అనేది కూడా వారు బేరీజు వేసుకుని ఉండాలి.

సుకుమార్‌ ఏదో కొత్తగా చేద్దామనే తపనతో తను కన్‌ఫ్యూజ్‌ అయ్యి, చూసేవాళ్లని కూడా విపరీతంగా కన్‌ఫ్యూజ్‌ చేసాడు. చాలా చోట్ల కథ ముందుకి కదలకుండా స్ట్రక్‌ అయిపోతుంది. ఏవో సాదా సీదా ట్విస్టులు పెట్టుకుని అదే గొప్ప స్క్రీన్‌ప్లే అన్నట్టు వ్యవహరించాడు. మహేష్‌బాబులాంటి స్టార్‌ హీరో ఉన్నప్పుడు, ఈ సినిమాపై ఇంత ఖర్చు పెట్టినప్పుడు తనవంతుగా ఎంటర్‌టైన్‌ చేయడానికి, ఆ ఖర్చుకి జస్టిస్‌ చేయడానికి ప్రయత్నించాలి. కానీ సుకుమార్‌ విషయం లేని కథని అదే పనిగా సాగతీసుకుంటూ పోయి దర్శకుడిగా తనకున్న క్రెడిబులిటీని క్వశ్చన్‌ చేసేట్టు చేసాడు. ఇంటర్వెల్‌కి ముందో పది నిముషాలు తప్పిస్తే అతని ముద్ర మరెక్కడా కనిపించదు.

హైలైట్స్‌:

  • మహేష్‌బాబు

డ్రాబ్యాక్స్‌:

  • సుకుమార్‌

విశ్లేషణ:

సుకుమార్‌ ఇంతకుముందు ఇంత పెద్ద సూపర్‌స్టార్‌ని కానీ, ఇంతటి భారీ బడ్జెట్‌ సినిమాని కానీ డీల్‌ చేయలేదు. సరాసరి తన చేతికి రెండు అతి శక్తివంతమైన అస్త్రాలని ఇచ్చేసారు. ప్రాక్టీస్‌ లేని వ్యక్తి చేతికి అత్యాధునిక అస్త్రాన్నిస్తే ఏమి చేస్తాడు? సుకుమార్‌ ఈ చిత్రాన్ని అచ్చంగా అదే విధంగా డీల్‌ చేసాడు. హాలీవుడ్‌ తరహా యాక్షన్‌ థ్రిల్లర్‌ని రూపొందించాలని అక్కర్లేని ఛేజ్‌లు, ఎందుకూ కొరగాని యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో నింపేసాడు. ఖర్చు దండగ తప్ప వాటి వల్ల వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. 

అన్ని యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఉంటే ఎఫెక్టివ్‌గా ఉన్నది ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఫైట్‌ సీన్‌ ఒక్కటే. అందులో ఏ టెక్నికల్‌ హంగులు, ఛేజ్‌లు, ఆర్భాటాలు లేవు. సరిగ్గా తీయగలిగితే ఇలాంటి హంగులన్నీ లేకుండా ఓ సినిమాని ఎఫెక్టివ్‌గా తెరమీదకి తీసుకురావచ్చు. యాక్షన్‌ యాంగిల్‌ని పక్కనపెడితే, హీరోకి పెట్టిన సైకలాజికల్‌, ఎమోషనల్‌ త్రెడ్‌ని డీల్‌ చేసిన విధానం ఎలాగుంది?

దర్శకుడిగా సుకుమార్‌ వీకెస్ట్‌ సినిమా ఇది. అతని ఫెయిల్యూర్స్‌ జగడం, ఆర్య 2 కూడా దర్శకుడిగా తనకి పేరు తెచ్చి పెట్టాయి కానీ ఇది సుకుమార్‌ హాఫ్‌ బేక్డ్‌ స్క్రిప్ట్‌తో చేసిన ఎటెంప్ట్‌. అందుకు పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ గోవా ఎపిసోడ్‌తో పాటు చివర్లో మెయిన్‌ విలన్‌ రివీల్‌ అయ్యే సీన్స్‌. దర్శకుడికి క్లారిటీ ఉన్నట్టుగా ఎక్కడా కనిపించదు. నిజానికి ఈ హీరో క్యారెక్టర్‌తో వండర్స్‌ చేయవచ్చు. ఇంటర్వెల్‌ సీన్‌లో ఆ క్యారెక్టర్‌ని ఎంత బాగా వాడవచ్చో సుకుమారే చూపించాడు. 

కానీ అంత బుర్ర అతను ఈ సినిమాపై పెట్టలేదు. హీరో, హీరోయిన్ల మధ్య లవ్‌ ఎందుకు పుడుతుంది? సడన్‌గా ఆమె తన సర్వస్వం అని హీరో ఎందుకు అనుకుంటాడు? అంత హాంటింగ్‌ పాస్ట్‌ ఉన్న హీరో స్ట్రాంగ్‌ రీజన్‌ లేకుండా ఒక అమ్మాయిని ప్రేమించేస్తాడా? సినిమా నిడివిని అనవసరంగా పెంచే సన్నివేశాలు కోకొల్లలు. లెంగ్త్‌ కుదించడానికి పాటల్లో చరణాల్ని కత్తిరించారు. ఉన్న ఆ కాస్త వినోదాన్ని కూడా తగ్గించేసి సినిమానో బోర్‌ ఫెస్ట్‌ చేసి పారేసారు. 

లాస్ట్‌ సాంగ్‌ అయిపోయాక దాదాపు గంట సేపు సినిమా నడుస్తుంది. క్లయిమాక్స్‌ పూర్తయిపోయాక కన్‌క్లూజన్‌కి మరో పావుగంట తీసుకుంటుంది. కొత్తగా ప్రయత్నించడంలో తప్పు లేదు కానీ ఆ కొత్తదనాన్ని ఎంతవరకు స్వీకరిస్తారు అనేది కూడా విశ్లేషించుకోవాలి. డైరెక్టుగా సినిమానే వదిలి రిసీవ్‌ చేసుకుంటారో లేదో చూడడానికి ఇదేమీ రెండు, మూడు కోట్ల సినిమా కాదు కదా? అన్ని పదుల కోట్లు ఈ చిత్రంపై ఆధారపడి ఉన్నప్పుడు ఇలాంటి లేజీ మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడం ఫ్లాపుని కొని తెచ్చుకోవడమే. 

బోటమ్‌ లైన్‌:1 నేనొక్కడినే - సైనికుడు 2!

- జి.కె.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?