ముంబయిలో రెండు రకాల ఫ్లాట్ కాంప్లెక్సులు ముఖ్యమంత్రికి చిక్కులు తెచ్చిపెట్టాయి. ఒకటి కాంపాకోలా కాంపౌండు కేసు. మరొకటి ఆదర్శ్. కాంపాకోలాలో 7 బ్లాకులున్నాయి. ఒక్కో బ్లాకులో ఆరేసి అంతస్తులు కట్టుకోవడానికి బృహత్ ముంబయి మునిసిపల్ కార్పోరేషన్ అనుమతి యిచ్చింది. అయితే వాళ్లు యిష్టం వచ్చినట్లు అంతస్తులు కడుతూ పోయారు. కొన్ని బిల్డింగుల్లో ఇరవయ్యేసి అంతస్తులున్నాయి. 2005లో బాంబే హై కోర్టు అనుమతి లేని అంతస్తులను కూల్చేయమంది. సుప్రీం కోర్టు 2013లో ఆ తీర్పును ధృవీకరించింది. నవంబరు 13న కూల్చివేతను అడ్డుకోవడానికి అక్కడ నివసిస్తున్నవారందరూ గేట్లన్నీ మూసేశారు. వంద కార్లు తెచ్చి గేట్లముందు పెట్టేశారు. ముంబయి పోలీసు శాఖ 300-400 పోలీసులను తెచ్చింది. వాళ్లు బుల్‌డోజరు తెచ్చి గేట్లను కూల్చేశారు. అడ్డువచ్చినవాళ్లను లాగి పారేశారు. కాంపౌండులో వున్న యువత యీ దృశ్యాలను సెల్‌ఫోన్లలో, కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాకు అప్‌లోడ్ చేయసాగారు. నిజానికి తమ సమస్య గురించి వాళ్లు 2013 మే నుండి నగరంలో హోర్డింగులు, సినిమా స్లయిడ్లు ప్రదర్శిస్తూనే వున్నారు. దీనివలన సుమారు 2 లక్షలమంది వీరికి మద్దతు పలికారు. ఆ రోజు ట్విట్టర్‌లో కాంపాకోలా కాంపౌండు బాధితుల అంశమే టాప్‌లో వుంది. ఇది సుప్రీం కోర్టుకి చేరి తనంతట తానే 2014 మే 31 వరకు గడువు పొడిగించింది. ఇక ట్విట్టర్‌లో కలకూజితాలు ప్రారంభమయ్యాయి. ''కాంపాకోలా ఉదంతం చెప్పేదేమిటంటే, ఫ్లాట్లు కొనే అమాయకులారా బహుపరాక్! ముంబయి రియల్ ఎస్టేటులో నిజాయితీగా నడిచే వ్యవహారం ఒక్కటీ లేదు'' అని కూశారు సినీదర్శకుడు శేఖర్ కపూర్. ''ప్రభుత్వస్థలాలను అన్యాయంగా ఆక్రమించుకుని గుడిసెలు వేసుకునే మురికివాడలను రాజకీయనాయకులు రెగ్యులరైజ్ చేయిస్తారు – ఓటు బ్యాంకుల కోసం. మధ్యతరగతివారు కష్టార్జితంతో కొనుక్కున్నవి మాత్రం కూల్చివేస్తారు'' అని ట్వీట్ చేశారు రచయిత మిన్‌హాజ్ మర్చంట్.
ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో కూడా అదే జరిగింది. ఆరు అంతస్తులకు అనుమతి తెచ్చుకుని 31 అంతస్తులు కట్టేశారు. ''కాంపాకోలా కాంపౌండులో ఫ్లాట్లు పోగొట్టుకున్నవారికి ఆదర్శ్‌లో ఫ్లాట్లు ఎలాట్ చేయాలి'' అని సలహా యిచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మయాంక్ గాంధీ. ఇలాటివి జరగడానికి కారణం ఫ్లాట్లు కొన్నవారు కాదు, అనుమతులిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కార్పోరేషన్ అధికారులు. వారికి శిక్ష పడదేమని అడుగుతున్నారు బాధితులు. దీనినుండి రాజకీయలబ్ధి పొందుదామని చూస్తున్నారు నాయకులు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్‌కి వ్యతిరేకంగా దీన్ని ఉపయోగించు కుందామనుకున్న కేంద్రమంత్రి మిలింద్ దేవ్‌రా ట్వీట్ చేశాడు – 'ముఖ్యమంత్రికి ఫోను చేసి కూల్చివేతను ఆపడానికి ఏదైనా చేయమని కోరబోయా. కానీ ఆయన ఢిల్లీకి విమానంలో వెళుతూండడం వలన ఫోన్‌లో దొరకలేదు' అని. అది కోర్టు ఆదేశాల ప్రకారం జరుగుతోందన్న విషయం యీయన మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. బాధితులకు న్యాయపరమైన సహాయం అందించాలని కోరుతూ సోనియా గాంధీకి ఓ ఉత్తరం రాశాడు.
దేవ్‌రా 2012 ఏప్రిల్‌లోనే మహారాష్ట్రలో టైముకి నిర్ణయాలు తీసుకోవడం లేదని ప్రకటన చేశాడు. దానిపై అప్పుడు చవాన్ స్పందించలేదు. ఈసారి మాత్రం ఘాటుగానే జవాబిచ్చాడు. మిలింద్ పార్లమెంటరీ నియోజకవర్గమైన దక్షిణ ముంబయిలోనే కాంపాకోలా కాంపౌండు వుంది కాబట్టి ఓట్లకోసం అతను యీ నాటకం ఆడుతున్నాడన్న విషయం ధ్వనించేట్లా 'దక్షిణ ముంబయినుండి పార్లమెంటరీ సీటు ఎలా గెలవాలా అన్నది నా ప్రాధాన్యత కాదు. చట్టానికి లోబడి పని చేయవలసిన బాధ్యత నాపై వుంది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నా ప్రభుత్వం ఏమీ చేయలేదు, చేయదు.' అన్నాడు. చవాన్‌పై ఫిర్యాదు చేసిన మరో కాంగ్రెసు ఎంపీ ఏక్‌నాథ్ గైక్వాద్. అతని కూతురు వర్ష కాబినెట్ మంత్రి. చవాన్ త్వరగా నిర్ణయం తీసుకోకపోవడం వలన ధరావి రీడెవలప్‌మెంట్ ప్రాజక్టు ఆలస్యమవుతోందని గత మార్చిలో ఏక్‌నాథ్ రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశాడు. చవాన్ దానికి సంజాయిషీ యిస్తూ 'స్థానికుల పునరావాసం పూర్తి కాకుండా తొందరపడి ప్రయివేటు కాంట్రాక్టరుకు అప్పగిస్తే వ్యతిరేకత పెల్లుబుకుతుంద'న్నాడు. రాహుల్ నిజమేనన్నాడు. అప్పణ్నుంచి ఏక్‌నాథ్, అతని కూతురు చవాన్‌ను ఇరికించడానికి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. వారికి యిప్పుడు అటవీశాఖ మంత్రి పతంగ్‌రావ్ కదమ్ తోడయ్యాడు. 'నాగపూర్‌లోని గోరేవాడా జూ ప్రాజెక్టు ప్రతిపాదన ఫైళ్లలో మూలుగుతోంది. అధికారులదే యిక్కడ హవా' అన్నాడు. అతనలా అనగానే కాంగ్రెసుతో కలిసి ప్రభుత్వం నడుపుతున్న ఎన్‌సిపి పార్టీకి చెందిన హోం మంత్రి 'అవునవును, 60 వేల మంది పోలీసులకు ఉద్యోగులు యిద్దామంటే నిర్ణయం తీసుకోవటం లేదు' అన్నాడు. పరిశ్రమల మంత్రి నారాయణ రాణే 'తాత్సారం చేయడం చేతనే ఎన్నో ముఖ్యమైన ప్రాజెక్టులు ఆగిపోతున్నాయి.' అన్నాడు.
ఈ గొడవలు యిలా వుండగా ఆదర్శ్ సొసైటీ ఫ్లాట్లపై కమిషన్ రిపోర్టు చిక్కు వచ్చిపడింది. ఆ రిపోర్టును 2013 ఏప్రిల్‌లోనే అసెంబ్లీలో పెడదామని చవాన్ చూశాడు. కానీ కాంగ్రెసు హై కమాండ్ సలహా మేరకు ఆగాడు. ఎందుకంటే తన బంధువులకు ఫ్లాట్లు కేటాయింపు చేయించుకుని దానిలో ప్రధాన నిందితుడిగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పదవి నుండి దిగిపోయినా మరాట్వాడా ప్రాంతంలో బలంగా వున్నాడు. కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీరాలన్న హై కోర్టు ఆదేశాలను మీరలేక అసెంబ్లీ శీతాకాలపు సమావేశాల ఆఖరి రోజు డిసెంబరు 20 న ప్రవేశపెడితే ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. దరిమిలా కాబినెట్‌లో ఆ రిపోర్టును తిరస్కరించింది మహారాష్ట్ర ప్రభుత్వం.
ఆప్ విజయం తర్వాత రాహుల్ గాంధీకి అవినీతి వ్యతిరేక పూనకం పూనింది కాబట్టి మహారాష్ట్ర కాబినెట్ అలా తిరస్కరించడం తప్పని, వాళ్లు పునరాలోచించాలని ప్రకటన చేశాడు. అప్పుడు చవాన్ ఇంకో కాబినెట్ సమావేశం జరిపి సిఫార్సులను పాక్షికంగా అంగీకరించాడు. కమిషన్ రిపోర్టు ప్రకారం ముగ్గురు ముఖ్యమంత్రులు – స్వర్గీయ విలాస్‌రావు దేశ్‌ముఖ్, అశోక్ చవాన్, సుశీల్ కుమార్ షిండే (ప్రస్తుత కేంద్ర హోం మంత్రి), షిండే కాబినెట్‌లో రెవెన్యూ మంత్రిగా వున్న శివాజీరావ్ పాటిల్ దోషులు. సునీల్ తట్కారే, రాజేష్ తోపే అనే మంత్రులను కూడా కమిషన్ తప్పుపట్టింది. అయితే వీళ్లందరిపై చవాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. వారి దృష్టిలో ఆదర్శ్ సొసైటీకి రాజకీయ మద్దతు అందించడం నేరం కాదుట. అశోక్ చవాన్‌పై సిబిఐ చార్జిషీటు దాఖలు చేసి కేసు నడుపుదామనుకుంది కానీ గవర్నరు శంకరనారాయణ దానికి అనుమతి యివ్వలేదు. సిబిఐ హై కోర్టుకి వెళ్లింది. కోర్టు ఎలా చెపితే అలా జరుగుతుంది.
రాజకీయ నాయకులను వదిలిపెట్టేసినా కమిషన్ విమర్శించిన 12 బ్యూరోక్రాట్స్‌పై శాఖాపరమైన విచారణ జరుగుతుంది. అర్హత లేకుండా ఫ్లాట్లు పొందిన 25 మంది నుండి ఫ్లాట్లు వెనక్కి తీసుకోబడతాయి. 22 ఫ్లాట్లు బినామీల పేర్ల మీద వున్నట్టు కమిషన్ గుర్తించింది. వారిలో కొందరు కూరలమ్ముకునేవాళ్లు, కారు డ్రైవర్లు, ప్యూన్లు. ఆ ఒప్పందాలను రద్దు చేయిస్తారు. అందువలన కమిషన్ రిపోర్టును పాక్షికంగా అమలు చేసినట్టు అవుతుంది.
-ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2014)