cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: రభస

సినిమా రివ్యూ: రభస

రివ్యూ: రభస
రేటింగ్‌: 2.75/5

బ్యానర్‌: శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్‌
తారాగణం: ఎన్టీఆర్‌, సమంత, బ్రహ్మానందం, ప్రణీత, జయసుధ, సీత, జయప్రకాష్‌రెడ్డి, సయాజీ షిండే, రఘుబాబు తదితరులు
సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌.
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె. నాయుడు
సమర్పణ: బెల్లంకొండ సురేష్‌
నిర్మాత: బెల్లంకొండ గణేష్‌ బాబు
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: సంతోష్‌ శ్రీనివాస్‌
విడుదల తేదీ: ఆగస్ట్‌ 29, 2014

తన సినిమా ‘ఎంత బాగుంది’ అనే దానికంటే ‘ఎన్ని కోట్లు కలెక్ట్‌ చేస్తుంది’ అనేది పారామీటర్‌ అయిపోవడంతో ఎన్టీఆర్‌లాంటి స్టార్స్‌కి ప్రతి సినిమాకీ ఒత్తిడి మామూలైపోయింది. ఎంత సేఫ్‌ గేమ్‌ ఆడినా కానీ ఎక్కడో ఒక చోట బ్యాలెన్స్‌ తప్పి కొన్ని సినిమాలు పల్టీ కొట్టేస్తుంటాయి. ఒకవేళ రొటీన్‌ స్టఫ్‌తో బోర్‌ కొట్టి వెరైటీ ట్రై చేద్దామంటే... విశ్వాసంగా ప్రతి సినిమాకీ వచ్చి ముడుపులు చెల్లించే మనసులు హర్టవుతుంటాయి. ‘రభస’ దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ మాత్రం సేఫ్‌ రూటే ఎంచుకున్నాడు. కొత్తదనం ఈ సినిమావైపు కన్నెత్తి చూడకుండా జాగ్రత్త పడ్డాడు. రొటీన్‌ గుణం తలెత్తుకు తిరిగేలా సింహాసనం వేసి కూర్చోబెట్టాడు. రాబోయే రోజుల్లో రభస ఎంత కలెక్షన్‌ రాబట్టినా కానీ ‘రొటీన్‌.. రొటీన్‌’ అనే రింగ్‌టోన్‌ మాత్రం ఎక్కడైనా ఠంగు ఠంగున మోగుతూనే ఉంటుంది... మీరు చదవబోయే ఈ సమీక్షలో సైతం!!

కథేంటి?

మేనత్త కూతుర్నే పెళ్లి చేసుకుంటానని అమ్మకి మాటిచ్చి వస్తాడు కార్తీక్‌ (ఎన్టీఆర్‌). అందుకోసం తన మేనమామ ధనుంజయ్‌ (సయాజీ) పీచమణచాలి. తన మరదలు ఇందు (సమంత) మనసు గెలవాలి. కార్తీక్‌ అనుకున్నంత ఈజీగా ఉండవేవీ. తను లక్ష్యంలో చాలా సవాళ్లు ఎదురౌతాయి. చివరకు అమ్మకు ఇచ్చిన మాట కంటే... తనకి ఆశ్రయం ఇచ్చిన వారి ఆనందం ముఖ్యమైపోయేట్టుగా పరిస్థితులు అతడిని పరీక్షిస్తాయి. మరి అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా?

కళాకారుల పనితీరు:

ఇన్ని సినిమాలు చూసిన మనకే కాదు... ఇప్పటికి ఎన్నో సినిమాలు చేయని ఎన్టీఆర్‌కీ ఈ కథ, ఈ క్యారెక్టర్‌ కొత్త కాదు. కుటుంబాల్ని కలపడం, విలన్లతో ఆడుకోవడం, కామెడీతో నవ్వించడం, సెంటిమెంట్‌ సీన్లలో కన్నీళ్లు పెట్టుకోవడం... ఎన్టీఆర్‌ ఇంతకుముందు చేయనిది ఏదీ ఇందులో చేయలేదు. సినిమా ఎలా అయినా ఉండనీ.. ఎక్స్‌క్లూజివ్‌గా తననే చూడ్డానికి వచ్చిన వారిని మాత్రం ఎన్టీఆర్‌ డిజప్పాయింట్‌ చేయడు. తన ప్రెజెన్స్‌ ఈ రొటీన్‌ సినిమాకి అతి పెద్ద బలమైతే... అతని స్క్రీన్‌ ప్రెజెన్స్‌ దీనికి బిగ్గెస్ట్‌ ఎస్సెట్‌. 

బ్రహ్మానందం ద్వితీయార్థం మొదలైన కాసేపటికి కానీ సీన్లోకి ఎంటర్‌ కాడు. లేటుగా ఎంట్రీ ఇచ్చినా కానీ రావడం రావడంతోనే డ్యూటీ ఎక్కేస్తాడు. హోప్‌లెస్‌గా తయారవుతున్న ఈ పాయింట్‌లెస్‌ ఫిలింని తన ట్రేడ్‌ మార్కు కామెడీతో గట్టెక్కించేస్తాడు. మిగతా కమర్షియల్‌ మసాలా దినుసులు సరిగ్గా పడ్డాయో లేదో చూసుకోవడానికి, సినిమాకి ప్రధానాకర్షణగా నిలవడానికి ఎన్టీఆర్‌ స్టార్‌డమ్‌ అండగా ఉంటే... ఏముందిందులో అనే ప్రశ్న తలెత్తనివ్వకుండా చూడ్డానికి, టోటల్‌ డిజప్పాయింట్‌మెంట్‌ అనకుండా అడ్డు పడ్డానికి బ్రహ్మానందం కామెడీ కొమ్ము కాస్తుంది. 

సమంత ఫిల్మోగ్రఫీలో ఇంకో సినిమా పెరిగిందని చెప్పుకోడానికి మినహా ఆమెకి ఈ సినిమా వల్ల నటిగా యాడ్‌ అయ్యేదేమీ లేదు. ప్రణీత చాలా చిన్న క్యారెక్టర్‌ చేసింది. సెకండ్‌ హీరోయిన్‌ అనడం కంటే స్పెషల్‌ అప్పీయరెన్స్‌ అనుకోవచ్చేమో. జయప్రకాష్‌రెడ్డితో సహా విలన్లంతా ఎప్పటిలా అవే క్యారెక్టర్లు, గెటప్పులు వేసుకుని రొటీన్‌గా తమ పని తాము చేసుకుపోయారు. అజయ్‌ క్యారెక్టర్‌ ఊసరవెల్లిలా సీనుకో రకంగా మారిపోతుంటుంది... దర్శకుడి కన్వీనియన్స్‌ని బట్టి.

సాంకేతిక వర్గం పనితీరు:

థమన్‌ సంగీతం సోసోగా ఉంది. రాకాసి రాకాసి, హవా హవా పాటలు వినడానికి, చూడ్డానికీ బాగున్నాయి. నేపథ్య సంగీతం పేలవంగా ఉంది. సంభాషణలు ఫర్వాలేదనిపిస్తాయి. ‘నువ్వు సింహానికి ఈక్వల్‌ అయితే నేను సింహాద్రికి సీక్వెల్‌ రా’ వంటి డైలాగులు నవ్విస్తాయి. చివరి నిముషంలో కత్తెరలు బాగానే పడ్డట్టున్నాయి. అందుకే సీన్ల మధ్య సమన్వయం లోపించి ఎడిటింగ్‌ లోపాలుగా అనిపించింది. సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. ఫైట్స్‌ ఈ చిత్రానికి అతి పెద్ద మైనస్‌గా మారాయి. ఫైట్‌మాస్టర్లు మరీ ఎక్కువగా ఫుట్‌బాల్‌ ఫాలో అయిపోయారో ఏమో... కార్నర్‌ కిక్‌లు, ఫ్రీ కిక్‌లు.. ఒక్కటేంటి ఫైటర్స్‌ని లిటలర్‌గా బంతుల్లా వాడేసుకున్నారు. 

రచయితగా సంతోష్‌ శ్రీనివాస్‌ ఫెయిలయ్యాడు. కందిరీగలో పకడ్బందీ కథనంతో, వినూత్నమైన వినోదంతో అలరించిన సంతోష్‌ శ్రీనివాస్‌ ఇందులో మరీ మూస ధోరణులకి పోయాడు. దారీ తెన్నూ లేని కథనంతో రభసని రసా భాస చేసి... చివరకు కామెడీ సాయంతో ఒడ్డు చేరగలిగాడు. 

హైలైట్స్‌:

  • కామెడీ
  • ఎన్టీఆర్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌

డ్రాబ్యాక్స్‌:

  • ఫైట్స్‌
  • స్క్రీన్‌ప్లే

విశ్లేషణ:

‘‘అనగనగా ఓ రాజుగారు.. వేటకెళ్లాడు.. ఏడు చేపలు తెచ్చాడు.. అందులో ఒకటి ఎండలేదు’’ ఈ కథ ఎంత రొటీనో... ‘అనగనగా ఓ హీరోగారు. మొదట్లో సరదాగా గడిపేస్తూ అమ్మాయితో సరాగాలాడుతూ, రౌడీలతో ఫుట్‌బాల్‌ ఆడుకుంటూ గడిపేస్తుంటాడు. ఏదో కారణమ్మీద విలనింట్లో దూరతాడు. అందర్నీ జోకర్లని చేసి ఆడుకుంటాడు. ప్రధానంగా బ్రహ్మానందంగారిని! చివర్లో నిజం తెలిసి పోతుంది. అప్పటికే మెయిన్‌ విలన్‌కి హీరోగారి మంచితనంపై ఒక మంచి ఇంప్రెషన్‌ పడిపోయి ఉంటుంది. అతని గొప్పతనం తెలుసుకుని మారిపోతాడు. ఎన్నోసార్లు చూసిన కథకి మళ్లీ డబ్బులిచ్చి వచ్చిన ప్రేక్షకులని చూస్తూ మొత్తం స్టార్‌ కాస్ట్‌ అంతా కలిసి ఫక్కున నవ్వుతారు. శుభం కార్డు’.. ఇదీ అంత రొటీన్‌ కథ అయిపోయిందీమధ్య. 

ఉద్ధండులైన రచయితలు ఎందరు కలిసి వండి వార్చినా... సమర్ధులైన దర్శకులు, నటులు ఎవరు వచ్చి వడ్డించినా.. మళ్లీ మళ్లీ అదే పులిహోర! ‘రభస’ సినిమా రొటీన్‌ అనే పదానికి సినానిమ్‌ అన్నట్టుంది. ఇందులో కొత్తదనం ఉంటుందని ఆశ పడితే ఎండమావిని చూసి గ్లాసు పట్టుకెళ్లినట్టే. సినిమాకి బలం కథ, కథనం అని గొప్ప గొప్ప సినిమా రూపకర్తలు ముక్తకంఠంతో చెప్పేస్తుంటారు. కానీ ఈకాలం తెలుగు ప్రేక్షకుడికి వాటితో పని లేదు. సరిగ్గా ఒక పావుగంట నవ్వించి పంపేస్తే ‘ఇంతకంటే ఏం కావాలి?’ అనుకుంటూ తను ఖర్చు పెట్టిన వంద రూపాయలకి సరిపడా గిట్టిపోయిందని అనేస్తున్నాడు. పడిపోతోంది రూపాయి విలువో... లేక సగటు ప్రేక్షకుడి అభిరుచో అర్థం కావడం లేదు. 

‘మీరు చూసినన్నాళ్లు మేమిదే తీస్తాం... అనవసరంగా కొత్తగా ఆలోచించి మా బుర్రలెందుకు పాడు చేసుకోవడం..’ అంటూ సినీ జ్ఞానులు హ్యాపీగా తీసేందే తీస్తూ, తిప్పి తిప్పి తీస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు. ‘రభస’లో కథ మొదలయ్యేది ఒక ఆశయంతో. ఇంటర్వెల్‌ దగ్గర దారి తప్పి మరో కథలో పడతాడు హీరో. అక్కడ్నుంచి అసలు కథ వదిలేసి, అప్పుడు మొదలైన సైడు కథనే మెయిన్‌ స్టోరీని చేసి పారేస్తాడు దర్శకుడు.  మరీ ఈ రేంజులో కంగాళీ చేస్తే జనం ఒప్పుకుంటారా అనే కంగారక్కర్లేదు. ఎందుకంటే... ఎక్కడో ఒక చోట బ్రహ్మానందాన్ని దించి ఒక నాలుగు కామెడీ సీన్లు మొహాన కొడితే మిగతాదంతా ఏం చూపించినా, ఏం చేసినా ఎవరికీ పట్టదు. 

ఎన్టీఆర్‌ రేంజ్‌ టాలెంట్‌ అందుబాటులో ఉన్నా కానీ దర్శకుడు దానిని వాడుకునేందుకు ప్రయత్నించలేదు. రొటీన్‌ వ్యవహారంతో ఎన్టీఆర్‌ చేతులు కట్టేసి ఉంచి... తన సినిమాని కాపాడడానికి బ్రహ్మానందం సాయం కోరాడు. హీరో తర్వాత హీరో అంతటి బిల్డప్‌తో సీన్‌లోకి ఎంటరయ్యే బ్రహ్మానందం తనకి అప్పగించిన పనిని ఇందులో కూడా సమర్ధవంతంగా నిర్వర్తించాడు. 

జనాన్ని థియేటర్‌కి రాబట్టడానికి, చివరి వరకు కూర్చోబెట్టడానికి ఎన్టీఆర్‌... మధ్యలో కొంతసేపు నవ్వించి కాలక్షేపం అయిపోయిందనే ఫీలింగ్‌ తేవడానికి బ్రహ్మానందం.. రభసలో వీరిద్దరికీ మించి ఏం లేదు. ‘ఇది చాలు మాకు’ అనుకునే వాళ్లు శాటిస్‌ఫై అయిపోతారు. కాస్తయినా కొత్తదనం ఆశించే వాళ్లు ‘ఇంకెన్నాళ్లు మాకు’ అనుకుంటూ నిట్టూర్పులు విడుస్తారు.  

బోటమ్‌ లైన్‌:  రొటీన్‌ బాసూ!

-గణేష్‌ రావూరి

https://twitter.com/ganeshravuri

చిరంజీవి వర్గం వారి తెలివితక్కువతనమే

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

 


×