సినిమా రివ్యూ: శౌర్య

రివ్యూ: శౌర్య రేటింగ్‌: 2/5 బ్యానర్‌: సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. తారాగణం: మంచు మనోజ్‌, రెజీనా, ప్రకాష్‌రాజ్‌, ప్రభాస్‌ శ్రీను, బ్రహ్మానందం, సుబ్బరాజు, నాగినీడు, సుధ, బెనర్జీ తదితరులు రచన: గోపీమోహన్‌ కథనం: కిషోర్‌…

రివ్యూ: శౌర్య
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి.
తారాగణం: మంచు మనోజ్‌, రెజీనా, ప్రకాష్‌రాజ్‌, ప్రభాస్‌ శ్రీను, బ్రహ్మానందం, సుబ్బరాజు, నాగినీడు, సుధ, బెనర్జీ తదితరులు
రచన: గోపీమోహన్‌
కథనం: కిషోర్‌ గోపు
మాటలు: దశరథ్‌, కిషోర్‌ గోపు
సంగీతం: కె. వేద
కూర్పు: ఎస్‌.ఆర్‌. శేఖర్‌
ఛాయాగ్రహణం: మల్హర్‌భట్‌ జోషి
నిర్మాత: మల్కాపురం శివకుమార్‌ (శివన్న)
కథ, దర్శకత్వం: దశరథ్‌
విడుదల తేదీ: మార్చి 4, 2016

జరిగిన ప్రతి సంఘటన వెనుక మూడు కథలుంటాయి.. ఒకటి జనాలు ఊహించేది, రెండు చేసినవాడు చెప్పేది, మూడు వాస్తవంగా జరిగిన కథ!

ఈ స్టేట్‌మెంట్‌తో మొదలైన సినిమా చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందని ఎక్స్‌పెక్ట్‌ చేస్తూ ఆ 'రైడ్‌' కోసం బకిల్‌ అప్‌ అయి ప్రిపేరవుతాం. కానీ 'శౌర్య' వేగం పుంజుకోవడానికే కాదు.. కనీసం సెకండ్‌ గేర్‌లోకి వెళ్లడానికి కూడా ఆలోచిస్తూ నిదా…నంగా ముందుకి కదుల్తుంటుంది. సీట్‌ బెల్టులక్కర్లేని స్పీడ్‌లో సాగుతోన్న ఈ జర్నీలో నిద్రలోకి జారుకోకుండా ఉండడానికి, పడుకుంటే తట్టి లేపడానికి తోడుగా ఎవర్నయినా తీసుకెళ్లాలి. 

సోషల్‌ సర్వీసెస్‌ చేసే ఆర్గనైజేషన్‌కి బ్రాండ్‌ అంబాసిడర్ల మాదిరిగా అదే పనిగా సర్వీస్‌ చేసేస్తూ, ఒకర్నొకరు అడ్మయిరింగ్‌గా చూసుకుంటూ మౌనంగా ప్రేమించేసుకుంటోన్న హీరో హీరోయిన్లు ఎంతకీ అసలు కథలోకి రారు. హీరోయిన్‌ గొంతు ఎవరో కోసేస్తే, ఆమె హాస్పిటల్‌లో, హీరో పోలీస్‌ స్టేషన్‌లో పడి ఉన్నప్పుడు మొదలయ్యే ఫ్లాష్‌బ్యాక్‌ ఎంత నీరసంగా ఉంటుందంటే, అంతకుముందు జరిగిన ఆ షాకింగ్‌ ఘటనని కూడా మళ్లీ దర్శకుడే గుర్తు చేసేవరకు గుర్తుకి రానంత! 

హీరోయిన్‌ గొంతు కోసి చంపేసింది 'నేనే' అని హీరో అనే వరకు కాస్తయినా థ్రిల్‌ చేయని ఈ చిత్రంలో ఇంటర్వెల్‌ కార్డుకి బదులు 'థ్రిల్‌ కంటిన్యూస్‌' అని వేసారు. 'బిగిన్స్‌' అని వేయబోయి పొరపాట్న కంటిన్యూస్‌ అని ఉంటారులే, ఇకపై థ్రిల్లింగ్‌గా ఉంటుందని అనుకుంటే, ఫస్ట్‌ హాఫ్‌కి తీసిపోని తీరునే సెకండ్‌ హాఫ్‌ కూడా సాగుతుంటే పొరపడింది మనమేనని అనుకోవాల్సి వస్తుంది. థ్రిల్లర్‌కి కావాల్సిన స్పీడ్‌, థ్రిల్లర్‌లో ఉండాల్సిన టెన్షన్‌ లేకుండా సాఫీగా సాగుతోన్న కథనంలో చాలా లోపాలున్నాయి. తమకి తెలిసిన కథ చెప్తున్నారో, లేక నిజంగా జరిగినదే మనకి చూపించేస్తున్నారో కూడా కొన్ని సందర్భాల్లో అర్థం కాదు. 'పాయింట్‌ ఆఫ్‌ వ్యూ'లో చెబుతున్నప్పుడు వాళ్లకి తెలిసినది మాత్రమే చూపించడం సబబు. కానీ ఈ కథలోకి కామెడీని ఎలా ఇరికించాలో తెలియనట్టు ఎవరు కథ చెబుతున్నా కానీ అవసరం లేని కామెడీ సీన్లని కూడా ఇరికించేసారు. హీరో అక్క కథ చెప్తుంటే ఆమెకి ఏమాత్రం సంబంధం లేని ప్రభాస్‌ శ్రీను క్యారెక్టర్‌పై సీన్‌ ఓపెన్‌ అవుతుంది. హీరో కథ చెప్తుంటే, తనకి కనీసం అవగాహన కూడా లేని హీరోయిన్‌కి సంబంధించిన పర్సనల్‌ సీన్స్‌ కూడా ఫ్లాష్‌బ్యాక్‌లో ప్రత్యక్షమవుతాయి. కథని నమ్ముకున్నప్పుడు అదనంగా ఎలాంటి హంగులు అవసరం లేదు. సీరియస్‌గా సాగుతున్న కథలో ప్రేక్షకుల్ని కనుక లీనం చేయగలిగితే ఇక వారికి హాస్యంతో అవసరం పడదు. బ్రహ్మానందం సీన్‌ ఏమి ఆశించి ఇరికించారో కానీ కనీసం అది నవ్వుకోడానికి కూడా అక్కరకు రాలేదు.

విలన్‌ ఎవరై ఉంటారనే సస్పెన్స్‌ కూడా మెయింటైన్‌ చేయకపోవడంతో ఆ పరంగా వచ్చే ఉత్కంఠకి కూడా తావులేకుండా పోయింది. చివర్లో చిన్న ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చి కాస్త ఎక్సయిట్‌ చేసినప్పటికీ అదేమంత ఊహాతీతమైనది కాకపోవడంతో ఓవరాల్‌గా 'శౌర్య' ప్రామిస్‌ చేసిన థ్రిల్‌ని అందించలేక, రెండు గంటల సమయం గడవడం ఎంత కష్టమనేది తెలియజెప్తుంది.

మనోజ్‌ టాలెంటెడ్‌ యాక్టర్‌ అనేది తెలిసిన విషయమే. పర్‌ఫార్మెన్స్‌ పరంగా వంకలేం లేవు. కాస్త బరువుగా కనిపించాడు కానీ దాని గురించి తనపై తానే జోక్‌ కూడా వేసుకున్నాడు. రెజీనా ఓకే. ప్రకాష్‌రాజ్‌ ఇంతకుముందు చాలా సినిమాల్లో చేసిన ఇన్వెస్టిగేటర్‌ క్యారెక్టర్స్‌ లాంటిదే ఇది కూడా. ఆయన వల్ల యాడ్‌ అయిన వేల్యూ ఏమీ లేదు. కథతో సంబంధం లేకుండా కామెడీ చేసినా ప్రభాస్‌ శ్రీను జోక్స్‌ కొన్ని బాగానే పేలాయి. సుబ్బరాజు, నాగినీడు తదితరులు తమ వంతు సాయమందించారు. పాటలు వినడానికి, చూడ్డానికి కూడా బాలేదు. ఈ తరహా కథల్లో పాటల అవసరం తక్కువ కనుక మరీ అన్ని లేకుండా చూసుకోవాల్సింది. టెక్నికల్‌గా సౌండ్‌గా ఉండాల్సిన సినిమాలో ఏ ఒక్క అంశం కూడా స్ట్రయికింగ్‌గా లేదు. దశరథ్‌ అనుకున్న పాయింట్‌ థ్రిల్లింగ్‌గా ఉంది కానీ అది తీసిన విధానం ఆకట్టుకోలేదు. ఒక ఆసక్తికరమైన థ్రిల్లర్‌గా మలిచే అవకాశమున్న కథకి అలరించే కథనం కుదరకపోవడంతో ఇంట్రెస్టింగ్‌ ప్లాట్‌ వేస్ట్‌ అయిపోయింది. 

బోటమ్‌ లైన్‌: స్లో యా!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri