ఎమ్బీయస్‌: ప్రభుత్వసంస్థ పేరుతో దోపిడీ – మలేసియా మార్గం

మలేసియా ప్రధాని నజీబ్‌ తొలిసారి 2009లో ప్రధాని అయ్యాడు. వస్తూనే ఆర్థిక సంస్కరణలన్నాడు, దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నానన్నాడు. స్థానికుల భాగస్వామ్యం విషయంలో నియమాలు సడలించి విదేశీయులను ఆకర్షించి వారి పెట్టుబడులు ఆహ్వానించాడు,…

మలేసియా ప్రధాని నజీబ్‌ తొలిసారి 2009లో ప్రధాని అయ్యాడు. వస్తూనే ఆర్థిక సంస్కరణలన్నాడు, దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నానన్నాడు. స్థానికుల భాగస్వామ్యం విషయంలో నియమాలు సడలించి విదేశీయులను ఆకర్షించి వారి పెట్టుబడులు ఆహ్వానించాడు, దేశంలో సంక్షేమపథకాల్లో కోత పెట్టాడు. ఒబామాతో వ్యక్తిగత స్నేహం పెంచుకుని మలేసియా విదేశీవిధానాన్ని అమెరికాకు అనుకూలంగా మార్చేశాడు. అమెరికాకు సన్నిహితంగా వుండే సౌదీ అరేబియా నాయకులతో కూడా స్నేహం నెరపి వ్యాపారాలు పెట్టించాడు. విపరీతమైన అవినీతితో డబ్బు సంపాదించి, ఆ డబ్బు సాయంతో 2013లో మళ్లీ ఎన్నికైయ్యాడు. ఆ తర్వాత తన విధానాలను విమర్శిస్తున్న ప్రతిపక్ష నాయకులను దేశద్రోహం నేరంపై జైళ్లలో పెట్టించాడు. కానీ 1ఎండిబి అనే ప్రభుత్వసంస్థ ద్వారా అతను దేశాన్ని దోచేశాడని యిప్పుడు ప్రతిపక్షాలే కాక, అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఎలుగెత్తి చాటుతున్నాయి.

అమెరికాలోని జస్టిస్‌ డిపార్ట్‌మెంటులో భాగంగా ''క్లెప్టోక్రసీ ఇనీషియేటివ్‌'' అనే సంస్థ నైజీరియా, ఈక్విటోరియల్‌ గినీ, దక్షిణ కొరియా, తైవాన్‌లలో పాలకులు అమెరికాతో ప్రత్యేక బంధాలు ఏర్పరచుకుని స్వదేశంలో అధికారదుర్వినియోగం చేసి తమ బంధువుల పేర ఎలా అక్రమాస్తులు కూడగట్టారో వెల్లడించింది. అవన్నీ అమెరికన్‌ మీడియాలో కథనాలుగా వెలువడ్డాయి. అదే సంస్థ నజీబ్‌ చేసిన ఆర్థిక నేరాలను కూడా బయటపెట్టింది. 1ఎండిబి నుండి 700 మిలియన్‌ డాలర్లు అమెరికాలోని బ్యాంకుల్లో నజీబ్‌ పేర వున్న ఖాతాల్లోకి వచ్చాయని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ రాసింది. నజీబ్‌ సవతి కొడుకు రిజా అజీజ్‌, అతని భార్య న్యూయార్క్‌ యితర నగరాలలో  పెనాంగ్‌లో వుండే వ్యాపారస్తుడు, కుటుంబ స్నేహితుడు  ఝో లో ద్వారా సంపాదించిన విలువైన ఆస్తుల వివరాలూ అమెరికన్‌ పేపర్లలో వచ్చేశాయి. లావాదేవీలన్నీ షెల్‌ కంపెనీల ద్వారా జరిగాయి. ఆ షెల్‌ కంపెనీల్లోకి డబ్బు ప్రవహించినది – 1ఎండిబి నుండి! దానికి నిధులు వచ్చినది మలేసియా ప్రభుత్వం నుంచి! బ్రిటన్‌ నుండి వెలువడే ''సండే టైమ్స్‌'' రిజా అజీజ్‌కు ఝో లోకు మధ్య సాగిన ఈ మెయిల్స్‌ బయటపెట్టింది. 1ఎండిబికి, పెట్రోసౌదీ అనే ఆయిల్‌ వెలికితీత కంపెనీకి మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో 700 మిలియన్‌ డాలర్లు వీళ్లు కాజేశారని, బ్యాంకు ఆమోదం లేకుండానే ఝో లోకు నజీబ్‌ 1 బిలియన్‌ డాలర్ల అప్పు జారీ చేశాడని వాటిద్వారా తెలిసింది. ఇంతకీ యీ 1ఎండిబి ఏమిటి?

తెరెంగాను రాష్ట్రం తన ప్రాంతంలో దీర్ఘకాలిక పెట్టుబడులు ఆకర్షించడానికి తెరెంగాను ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ పేర ఒక సంస్థను 2008లో ఏర్పాటు చేసింది. 2009లో నజీబ్‌ ప్రధాని అవుతూనే దాని కార్యకలాపాలు దేశాని కంతటికీ అవసరం అంటూ దాని పేరు మార్చి 1ఎండిబిగా మార్చి తన చైర్మన్‌గిరీలో ప్రభుత్వాధీనంలో వుండే స్ట్రాటజిక్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీగా తీర్చిదిద్దాడు. విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం, విదేశీయులను భాగస్వాములుగా తీసుకుని మలేసియాలో పెద్దపెద్ద ప్రాజెక్టులు చేపట్టడం దాని లక్ష్యం అన్నాడు. తున్‌ రజాక్‌ ఎక్స్‌ఛేంజ్‌, బందర్‌ మలేసియా, భారీ విద్యుత్‌ ప్రాజెక్టులు వంటివి మొదలుపెట్టారు. తున్‌ రజాక్‌ ప్రాజెక్టు మొదలుపెట్టిన ఏడాదిలోగానే వివాదాలు చుట్టుముట్టాయి. ''ఆ కంపెనీకి అడ్రసూ లేదు, ఆడిటరూ లేడు'' అని అన్వర్‌ ఇబ్రహీం అనే ప్రతిపక్ష నాయకుడు ఆరోపించాడు. ఆ కంపెనీకి ఆర్నెల్లలోనే విపరీతంగా లాభం వచ్చిందని ప్రకటించడంతో అందరూ ప్రశ్నించసాగారు. తర్వాత తేలిందేమిటంటే ప్రభుత్వాస్తులను ఆ కంపెనీకి బదిలీ చేసి లాభాలు చూపించారు. తర్వాతి రోజుల్లో నిధులు తోడేశారు. విమర్శలు రావడంతో 2010 నాటి బాలన్స్‌ షీటుపై కెపిఎంజి ఆడిటింగ్‌ సంస్థ చేత సంతకం చేయించారు. 2013 నాటి బాలన్స్‌షీటు దాఖలు చేయడానికి ఆర్నెల్లు ఎక్కువ గడువు అడగడంతో మళ్లీ అనుమానాలు వచ్చాయి. పైగా యీ మధ్యలో ముగ్గురు ఆడిటర్లు మారారు. చివరకు ఆ సంస్థ ద్వారా ప్రభుత్వధనం పిండేసి, చివరకు దాన్నీ పీల్చి పిప్పి చేశాడు నజీబ్‌. ఉదాహరణకి గెంటింగ్‌ అనే కంపెనీకి చెందిన పవర్‌ ప్రాజెక్టులను 1ఎండిబి మార్కెట్‌ కంటె ఎంతో ఎక్కువ ధర పెట్టి కొంది. ఆ విధంగా సంపాదించిన డబ్బును గెంటింగ్‌ కంపెనీ నజీబ్‌ నడిపే ఫౌండేషన్లకు విరాళంగా యిచ్చింది. 2013 ఎన్నికలలో నజీబ్‌ ఎన్నికల ఖర్చును యీ ఫౌండేషనే భరించింది. ప్రస్తుతానికి 1ఎండిబికి 42 బిలియన్ల అప్పుందని, అది జారీ చేసిన బాండ్లకు చిత్తుకాగితం కంటె ఎక్కువ విలువ లేదనీ ఒప్పుకోవలసి వచ్చింది.

నజీబ్‌ అవినీతి వలన, సంస్కరణ ఆర్థికవిధానాల వలన దేశంలో జీవన వ్యయం పెరిగింది. మలేసియా కరెన్సీ విలువ పడిపోయింది. సామాన్యులు గగ్గోలు పెట్టసాగారు. ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. తనపై అవినీతి ఆరోపణలకు నజీబ్‌ ఎలా స్పందించాడంటే – నిష్పక్షపాతమైన విచారణ జరిపిస్తామని హామీ యిచ్చిన ఉపప్రధాని ముహ్యుద్దీన్‌ యాసిన్‌ని మార్చేశాడు. ఆరోపణలు ప్రచురించిన రెండు న్యూస్‌ పేపర్లను మూణ్నెళ్లపాటు మూయించేశాడు. దానికి గాను పార్లమెంటు చేత 'నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ బిల్‌' అనే పేర బిల్లు పాస్‌ చేయించి ఏ పత్రికనైనా మూసేసే అధికారం తనకు కట్టబెట్టుకున్నాడు. వ్యవహారాలను బయటపెట్టిన విజిల్‌బ్లోయర్స్‌ను అరెస్టు చేయించాడు. విచారణ ప్రారంభించిన అటార్నీ జనరల్‌ అబ్దుల్‌ గనీ పటైల్‌ను తీసేసి అతని స్థానంలో మహమ్మద్‌ అపాండీని నియమించాడు. 1ఎండిబి ఫారిన్‌ ఎక్స్‌ఛేంజ్‌ రూల్సును అతిక్రమిస్తోందని, దానిపై కేసు పెట్టాలని మలేసియా సెంట్రల్‌ బ్యాంకు గత ఏడాది ప్రతిపాదిస్తే ఈ అపాండీ ఆ ప్రతిపాదనను బుట్టదాఖలు చేశాడు.   నజీబ్‌పై గబగబా విచారణ ముగించి, క్లీన్‌చిట్‌ యిచ్చేశాడు. తను విచారణ చేసేశాడు కాబట్టి ప్రధానికి నిధులు ఎక్కణ్నుంచి వచ్చాయో తెలుసుకోవడానికి ఏంటీ కరప్షన్‌ కమిషన్‌ వారు చేపట్టిన విచారణ ఆపివేయాలని తీర్పు యిచ్చాడు. నజీబ్‌ వ్యక్తిగత ఖాతాల్లో వున్న 700 మిలియన్‌ డాలర్ల్లలో 681 మిలియన్‌ డాలర్ల్లు సౌదీ రాజకుటుంబం వ్యక్తిగతంగా యిచ్చిన విరాళమని, దానిలో 620 మిలియన్‌ డాలర్లు నజీబ్‌ వెనక్కి యిచ్చేశాడని తనకు నమ్మకం కుదిరిందన్నాడు. (2013 ఎన్నికలలో గెలవడానికి సౌదీ కుటుంబం విరాళం యిచ్చిందనుకున్నా మలేసియా రాజ్యాంగం ప్రకారం అది చట్టవిరుద్ధం) విరాళం ఎందుకిచ్చారో, మళ్లీ దాన్ని వెనక్కి ఎందుకిచ్చారో, పూర్తిగా వెనక్కి యివ్వకుండా కాస్త ఎందుకు మిగుల్చుకున్నారో అపాండీ వివరించలేదు. అంత భూరివిరాళం యిచ్చిన ఉదారుడెవరో పేరు చెప్పలేదు. తలమునకలా అప్పులో కూరుకుపోయిన 1ఎండిబి 10 మిలియన్‌ డాలర్లు నజీబ్‌ ఖాతాలో ఎందుకు వేసిందో అదీ చెప్పలేదు. 

అపాండీ కాండక్ట్‌ సర్టిఫికెట్టు యిచ్చి అమ్మయ్య అనుకుంటూండగానే స్విస్‌ ప్రభుత్వపు అటార్నీ జనరల్‌ ''1ఎండిబి ద్వారా 4 బిలియన్‌ డాలర్ల డబ్బు గోల్‌మాల్‌ జరిగింది. మలేసియా ప్రభుత్వ సంస్థ నిధులు మలేసియన్‌ పౌరుల ఖాతాల్లోకి, యుఎఇ (యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌) పౌరుల ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. మా దేశపు బ్యాంకుల ద్వారా జరిగిన అక్రమ, చట్టవిరుద్ధ లావాదేవీల గురించిన రహస్య సమాచారం మలేసియా ప్రభుత్వానికి పంపుతాం.'' అంది. కానీ అప్పటికే మలేసియా ప్రభుత్వం అపాండీ రిపోర్టు ఆధారంగా 700 మిలియన్‌ డాలర్ల విరాళం గురించిన ఫైలు మూసేయదలచింది. అందువలన స్విస్‌తో సహకరించడానికి ఆసక్తి చూపటం లేదు. డబ్బు పోగొట్టుకున్న మలేసియన్‌ ప్రభుత్వ సంస్థలేవీ ఫిర్యాదు చేయటం లేదు. ఈలోగా సింగపూరు ప్రభుత్వం 1ఎండిబికి, నజీబ్‌కు తమ దేశంలో వున్న ఖాతాలపై విచారణ ప్రారంభించి అనేక అక్రమ లావాదేవీలు కనుగొంది. అపాండీ సర్టిఫికెట్టుతో తమకు పని లేదని, విచారణ కొనసాగిస్తామని అంటోంది. హాంగ్‌కాంగ్‌ కూడా అదే బాటలో వుంది. ఇవి చాలనట్లు సౌదీ అధికారులు 'మా దేశం మలేసియా ప్రభుత్వానికి కాని, వ్యక్తులకు కాని రాజకీయ విరాళాలు కాని, ఋణాలు కానీ యివ్వలేదు' అని ప్రకటించారు. సౌదీ విదేశాంగ మంత్రి 'నజీబ్‌ ఖాతాలోకి వచ్చిందంటున్న డబ్బు ఎవరైనా సౌదీ పౌరుడు వ్యాపారపరమైన పెట్టుబడిగా పెట్టి వుండవచ్చు' అని చెప్పి తప్పించుకున్నాడు. 

వీటన్నిటితో మలేసియా ప్రతిపక్షాలకు నైతికబలం చేకూరింది. వాళ్లు తమ స్వరం మరింత పెంచారు. గతంలో ప్రధానిగా పని చేసిన మహతీర్‌ మొహమ్మద్‌, అతని కుమారుడు కేడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ముఖ్రీజ్‌ మహతీర్‌ ఆందోళన చేపట్టారు. నజీబ్‌ వెంటనే ముఖ్రీజ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి వేశాడు. అటార్నీ జనరల్‌ను అడ్డుపెట్టుకుని నజీబ్‌ ఎలాటి విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాడు. ఈ ఉదంతంద్వారా నేర్చుకోవలసినదేమిటంటే ప్రభుత్వసంస్థ ద్వారా కార్యకలాపాలు జరుగుతున్నాయి కాబట్టి అంతా సవ్యమే అనుకోరాదు. తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి వాటిని అడ్డం పెట్టుకుంటున్నారు పాలకులు. గమనించవలసిన మరొక విషయం ఏమిటంటే – విదేశీ పెట్టుబడులతో త్వరితంగా అభివృద్ధి సాధిస్తాం అనే పాలకులందరిలో అవినీతి అంశ తప్పకుండా కనబడుతోంది. స్వదేశీ వనరులను ఎందుకు ప్రోత్సహించకూడదు అని వాదించేవారిని 'అభివృద్ధికి అడ్డుపడుతున్నారు' అని ముద్ర కొట్టి బద్నామ్‌ చేయడమూ, అవినీతిపై ప్రజలకు అవగాహన పెంచే మీడియాను మూసేయించడానికి ప్రయత్నం చేయడమూ కనబడుతోంది.   

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2016)

[email protected]