సినిమా రివ్యూ: విక్రమసింహా

రివ్యూ: విక్రమసింహా రేటింగ్‌: 2/5 బ్యానర్‌: ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, మీడియా వన్‌ గ్లోబల్‌ తారాగణం: రజనీకాంత్‌, దీపిక పడుకోన్‌, నాజర్‌, ఆది, శోభన, జాకీష్రాఫ్‌ తదితరులు రచన: కె.ఎస్‌. రవికుమార్‌ సంగీతం: ఏ.ఆర్‌. రెహమాన్‌…

రివ్యూ: విక్రమసింహా
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, మీడియా వన్‌ గ్లోబల్‌
తారాగణం: రజనీకాంత్‌, దీపిక పడుకోన్‌, నాజర్‌, ఆది, శోభన, జాకీష్రాఫ్‌ తదితరులు
రచన: కె.ఎస్‌. రవికుమార్‌
సంగీతం: ఏ.ఆర్‌. రెహమాన్‌
కూర్పు: ఆంటోనీ
ఛాయాగ్రహణం: రాజీవ్‌ మీనన్‌
నిర్మాతలు: సునీల్‌ లల్లా, సునంద మురళీ మనోహర్‌, ప్రషీత చౌదరి
దర్శకత్వం: సౌందర్య రజనీకాంత్‌ అశ్విన్‌
విడుదల తేదీ: మే 23, 2014

మోషన్‌ క్యాప్చర్‌ త్రీడీ యానిమేషన్‌ టెక్నాలజీని భారతీయ చిత్ర పరిశ్రమకి పరిచయం చేస్తూ… ప్రయోగాత్మకంగా తీసిన ‘కొచ్చడయ్యాన్‌’కి (విక్రమసింహా) రెగ్యులర్‌ భారీ బడ్జెట్‌ చిత్రాలకి మించిన వ్యయమైంది. ఈ చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేయడానికి రజనీకాంత్‌ అంతటి వాడు కూడా కష్టపడాల్సి వచ్చిందంటే… మనకి ఈ రకం సినిమాలు ఎంత కొత్త… వీటికి ఎంత తక్కువ డిమాండ్‌ ఉందనే సంగతి అర్థమవుతుంది. కొత్తదేదైనా చేయడమే కష్టమనుకుంటే… దానిని ఒప్పించడం, దాంతో మెప్పించడం అంతకు మించిన భారం. రిస్క్‌కి వెరవకుండా ఈ ప్రయత్నం చేసినందుకు విక్రమసింహా టీమ్‌ని అభినందించాలి. ప్రయత్న లోపాలు లేవు కానీ… ప్రయత్నంలో చాలా లోపాలుండడం వల్ల ‘విక్రమసింహా’ తీవ్రంగా నిరాశపరుస్తుంది. ఇకపై ఇలాంటి సినిమాలు రూపొందడానికి బాటలు వేస్తుందనుకున్న ఈ చిత్రం ఇక్కడితో చాలని మిగతావాళ్లు భయపడేట్టు చేస్తుంది.  

కథేంటి?

కోట పట్టణం రాజు ఉగ్రసింహా (నాజర్‌) సైన్యాధిపతి అయిన రాణా (రజనీకాంత్‌) తమ శుత్రుదేశం అయిన కళింగపురికి వెళ్లి… అక్కడ బందీలుగా ఉన్న తమ సైన్యాన్ని చాకచక్యంగా వెనక్కి తీసుకొస్తాడు. రాజు అతడిని మెచ్చినా కానీ రాణా ఆ రాజునే చంపాలని చూస్తాడు. ఉగ్రసింహాని చంపడానికి రాణా ఎందుకు తెగిస్తాడు? తన తండ్రి విక్రమసింహా (రజనీకాంత్‌) చావుకి కారణమైన ఉగ్రసింహాపై రాణా పగబడతాడు. అందుకే ఉగ్రసింహాపై హత్యా ప్రయత్నం చేసి పట్టుబడతాడు. తర్వాతేం జరుగుతుంది? 

త్రీడీ యానిమేషన్‌ ఎలా ఉందంటే…

కార్టూన్‌ క్యారెక్టర్స్‌ని, కల్పిత క్యారెక్టర్లని పెట్టి ఇలాంటి సినిమాలు తీయడం ఈజీ. కానీ పాపులర్‌ స్టార్స్‌ యానిమేషన్‌తో సినిమా తీయడమంటే మాత్రం పర్‌ఫెక్షన్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. ముఖ్యంగా రజనీకాంత్‌ విషయంలో. రజనీ నడక, బాడీ లాంగ్వేజ్‌ కొంతవరకు క్యాప్చర్‌ చేయగలిగారు. ఫేస్‌లో కూడా కొన్ని ట్రేడ్‌ మార్క్‌ ఫీచర్స్‌ని రిక్రియేట్‌ చేసారు. అంతే… అంతకుమించి ఏం చేయలేదు. కనీస హావభావాల్ని కూడా చూపించలేకపోయారు. నవ్వు, కోపం, బాధలాంటి రెగ్యులర్‌ ఎమోషన్స్‌కి కూడా ఇందులో చోటు లేదు. ఇక దీపిక పడుకోన్‌ యానిమేషన్‌ అయితే దారుణమనే చెప్పాలి. ‘అంధ’ రాజ్యానికి యువరాణి అన్నట్టుగా ఆమె.. చూపు దగ్గర్నుంచి, ఆంగీకం వరకు అన్నీ అధ్వాన్నంగా ఉన్నాయి. ఆది, నాజర్‌, శోభన యానిమేషన్‌ ఒకింత ఫర్వాలేదు. ఓవరాల్‌గా చాలా చాలా యావరేజ్‌ వర్క్‌. ఇది మనకి కొత్త టెక్నాలజీయే అయినా కానీ… ఈ స్టార్‌ కాస్ట్‌, ఈ ప్రొడక్షన్‌ రేంజ్‌ని బట్టి ఎక్కువ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. 

సాంకేతిక వర్గం పనితీరు:

తమ బలహీనతల్ని ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతంతో కప్పి పుచ్చుకోవాలని చూసారు. కథాపరంగా ఏమీ చేయలేని ప్రతి చోటా పాటలు పెట్టేసారు. ఒకటి, రెండు వినడానికి బాగానే ఉన్నా కానీ సినిమాని మోయగల సౌండ్‌ ట్రాక్‌ మాత్రం కాదు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. ప్రొడక్షన్‌ డిజైన్‌ బాగుంది. యానిమేషన్‌ యావరేజ్‌గా ఉన్నా కానీ మన చరిత్రని చూపించే రిచ్‌ కల్చర్‌ని, హిస్టారికల్‌ బ్యాక్‌డ్రాప్‌కి అనుగుణంగా అట్మాస్ఫియర్‌ని బాగా చూపించగలిగారు. తెలుగు వెర్షన్‌ ఎడిటింగ్‌ చాలా ఘోరంగా ఉంది. నిడివి తగ్గించడానికి సీన్లకి సీన్లు కట్‌ చేసేయడం వల్ల ఫ్లో పూర్తిగా మిస్‌ అయింది. దీని వల్ల సినిమాకి లాభం చూకూరకపోగా… అసలే నాసి రకంగా ఉన్న స్క్రీన్‌ప్లే ఇంకాస్త వరస్ట్‌గా తయారైంది. 

సౌందర్య రజనీకాంత్‌ ఈ చిత్రంతో భారతీయ చిత్ర పరిశ్రమకి కొత్త టెక్నాలజీని పరిచయం చేసి ట్రెండ్‌ సెట్‌ చేద్దామని అనుకుంది. ఆమె ఎన్నో ఏళ్లుగా కంటోన్న కలని సాకారం చేసుకోగలిగినందుకు అభినందించాలి. అయితే ఇన్నేళ్లలో తన స్వప్నం కోసం ఆమె క్రియేటివ్‌గా చేసిందేమీ లేదు. ఏదో మొదటి ప్రయత్నం కనుక కొందరు ప్రశంసిస్తారేమో కానీ… ఇంతటి గొప్ప ప్లాట్‌ఫామ్‌ దక్కినా కూడా దానిని సద్వినియోగం చేసుకోలేకపోవడం మాత్రం పెద్ద లోపం. ఇలాంటి ఓ సినిమా చేయాలనే కోరిక బలంగా ఉండి, ఇంతటి బడ్జెట్‌, రజనీకాంత్‌ బ్యాకింగ్‌ ఉంటే.. ఎవరైనా ఖచ్చితంగా ఇంతకంటే బెటర్‌ ప్రాజెక్ట్‌ ఇస్తారు. ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిపోవాల్సిన సినిమాని తోలుబొమ్మలాటలా చేసిన తప్పు పూర్తిగా దర్శకురాలిదే. 

హైలైట్స్‌:

  • యుద్ధ సన్నివేశాల్లో యానిమేషన్‌
  • నేపథ్య సంగీతం
  • ప్రొడక్షన్‌ డిజైన్‌

డ్రాబ్యాక్స్‌:

  • కథ
  • కథనం
  • అవసరానికి మించిన పాటలు
  • పూర్‌ మోషన్‌ క్యాప్చర్‌
  • అతుకుల బొంతని తలపించే ఎడిటింగ్‌

విశ్లేషణ:

యానిమేషన్‌ సినిమా అయినా కానీ.. రెగ్యులర్‌ సినిమా అయినా కానీ కథ, కథనాలు ముఖ్యం. హాలీవుడ్‌లో చూస్తే యానిమేషన్‌ సినిమాల్లోనే అద్భుతమైన కథ, కథనాలుంటాయి. ఒక్కసారి చూడడం మొదలు పెడితే చివరి వరకు వదిలిపెట్టకుండా చూసేట్టు కట్టి పడేస్తాయి. అందుకే అక్కడ ఈ చిత్రాలని పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆదరిస్తారు. కథలో విషయం ఉంటే… యానిమేషన్‌ అద్భుతంగా ఉండాల్సిన అవసరం లేదు. మామూలు పెన్సిల్‌ స్కెచ్‌ యానిమేషన్‌తో కూడా ప్రేక్షకుల్ని రంజింపచేయవచ్చు. ‘విక్రమసింహా’ ఈ విషయాన్ని విస్మరించింది. చాలా సాధారణ కథతో పాటు ఏమాత్రం ఆకట్టుకోని కథనం వల్ల ఈ చిత్రం సహనానికి పరీక్ష పెడుతుంది. 

అక్కడక్కడా కొన్ని ట్విస్టులు ఉన్నా కానీ బ్యాడ్‌ స్క్రీన్‌ప్లే కారణంగా ఏవీ పండలేదు. పైగా తెలుగు వెర్షన్‌ని ఇంకాస్త ఎక్కువ ఎడిట్‌ చేసారేమో… పలు సందర్భాల్లో ఫ్లో మిస్‌ అయింది. కొన్ని సీన్లు అమాంతం ఊడి పడినట్టు అనిపిస్తాయి. లెక్కకు మించిన పాటలతో నింపి పారేసారు. ఏదో పౌరాణిక చిత్రాన్ని తలపించేటట్టుగా నిముషానికో పాట వస్తుంటే… స్క్రిప్ట్‌ పరంగా ఈ చిత్రం ఎంత హ్యాండీక్యాప్డ్‌ అనే సంగతి అర్థమవుతుంది. ఇలాంటి బృహత్తర ప్రాజెక్ట్‌ని తలకెత్తుకున్నప్పుడు కథ, కథనాల విషయంలో కనీసపు హోమ్‌ వర్క్‌ లేకపోవడం ఎంతవరకు సమంజసం. అసలే యానిమేషన్‌ థర్డ్‌ గ్రేడ్‌ అనిపిస్తోంటే… ఇక కథనం కూడా చెత్తగా తయారైతే ప్రేక్షకులు ఎందుకోసం ఈ చిత్రాన్ని చివరి వరకు భరించాలి?

తొలి ప్రయత్నం.. భారీ ప్రయోగం కనుక దీనిని విమర్శించడం సబబు కాదని కొందరు అనవచ్చు. కానీ బేసిక్స్‌ కూడా సరిగా పాటించని ఈ చిత్రం జనరంజకం కాబోదు… ఎట్‌లీస్ట్‌ తెలుగు వెర్షన్‌ వరకు. రజనీకాంత్‌పై అభిమానం వెర్రి తలలు వేస్తే తప్ప ఈ చిత్రాన్ని మెచ్చుకోలేం. అధిక భాగం తోలు బొమ్మలాటని తలపించే ఈ చిత్రంలో కొన్ని మాత్రం ప్రశంసనీయంగా ఉన్నాయి. రుద్ర తాండవం, యుద్ధ సన్నివేశాలు… ఏనుగుల యానిమేషన్‌ వగైరా మెచ్చుకోతగ్గ క్వాలిటీతో తెరకెక్కాయి. అయితే వాటి కోసం ఈ చిత్రాన్ని సాంతం భరించడమంటే మాత్రం చాలా చాలా ఓపిక కావాలి. 

బోటమ్‌ లైన్‌:  విక్రమ సింహా ` కొత్త రకం హింస!

జి.కె.