రివ్యూ: ఎర్రబస్సు
రేటింగ్: 2/5
బ్యానర్: తారకప్రభు ఫిలింస్
తారాగణం: దాసరి నారాయణరావు, మంచు విష్ణువర్ధన్ బాబు, కేథరీన్, రఘుబాబు, కృష్ణుడు, బ్రహ్మానందం, సూర్య, సురేఖావాణి తదితరులు
సంగీతం: చక్రి
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: అంజి
నిర్మాత, మాటలు, కథనం, దర్శకత్వం: దాసరి నారాయణరావు
విడుదల తేదీ: నవంబర్ 14, 2014
150 సినిమాలు తీసిన అనుభవమున్న దర్శకరత్న దాసరి నారాయణావు నటుడిగా కూడా కొన్ని మరపురాని పాత్రలకి జీవం పోసారు. ‘పరమవీరచక్ర’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దాసరి ‘మంజపయ్’ అనే తమిళ చిత్రాన్ని ‘ఎర్రబస్సు’ పేరుతో రీమేక్ చేసారు. దాసరి, విష్ణు తాతా మనవళ్లుగా నటించిన ఈ చిత్రం కథాకమామీషు..
కథేంటి?
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాజేష్ (విష్ణు) అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. ఎంతో కాలం వేచి చూసిన తర్వాత రాజేష్‌కి అమెరికా వెళ్లే అవకాశం వస్తుంది. వెళ్లడానికి మరో మూడు నెలల సమయం ఉండడంతో తనని పెంచి పెద్ద చేసిన తాతయ్యతో (దాసరి) ఉండాలని అనుకుంటాడు. అయితే జీవితాంతం పల్లెలోనే గడిపిన తాతయ్య నగరంలోని అపార్ట్‌మెంట్స్ కల్చర్‌కి, అర్బన్ లైఫ్ స్టయిల్‌కి పూర్తి భిన్నంగా ఉంటాడు. ఆయన వల్ల రాజేష్‌కి రకరకాల ఇబ్బందులు వస్తాయి. తన కెరీర్ ప్రమాదంలో పడుతుంది. తను ప్రేమించిన రాజీ (కేథరీన్) కూడా రాజేష్‌కి దూరమవుతుంది.
కళాకారుల పనితీరు:
‘మామగారు’, ‘సూరిగాడు’ తదితర చిత్రాల్లో నటుడిగా చెరిగిపోని ముద్ర వేసిన దాసరి నారాయణరావు ఇందులోని తాతయ్య పాత్రలో లీనమైపోయారు. మనవడిపై అపారమైన ప్రేమాభిమానాలు ఉన్న తాతయ్యగా ఆయన తన పాత్రకి జీవం పోసారు. ఈ చిత్రానికి తన అభినయంతో ప్రధానాకర్షణగా నిలిచారు.
విష్ణు సహజ శైలికి భిన్నంగా తాత చాటు మనవడిగా తన పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. తాతయ్యకి, ప్రేయసికి మధ్య నలిగిపోయే పాత్రలో విష్ణు చాలా సహజంగా నటించాడు. చివర్లో ఎమోషనల్ సీన్స్‌లో కూడా మంచి పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. కేథరీన్ ఓకే అనిపిస్తుంది. రఘుబాబు కామెడీ క్యారెక్టర్‌లో కాకుండా సపోర్టింగ్ రోల్‌లో మెప్పిస్తాడు. మిగిలిన వారంతా తమ తమ పరిధుల మేరకు నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
చక్రి స్వరపరిచిన పాటల్లో ‘ఓం నమశ్శివాయ’ ట్రెండీగా ఉంది. సీమంతం పాట కూడా వినడానికి బాగుంది. టెక్నికల్‌గా స్టాండర్డ్ పద్ధతులే తప్ప చెప్పుకోతగ్గ విశేషాలేమీ లేవు. సినిమా నిడివి మరీ ఎక్కువైంది. ఒక ఇరవై నిముషాల వరకు ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఎమోషనల్ సీన్స్ తీయడంలో తన ప్రత్యేకతని చాటుకున్నారు దాసరి నారాయణరావు. తాతా మనవళ్ల మధ్య సన్నివేశాలని హృద్యంగా చిత్రీకరించారు. పతాక సన్నివేశాలు బాగున్నాయి. వేగవంతమైన కథనం ఉన్న సినిమాలకి అలవాటు పడిన నేటి తరం ప్రేక్షకులు ఈ స్లో స్క్రీన్‌ప్లేని, ఓవర్ మెలోడ్రామాని ఎంజాయ్ చేయడం కష్టం.
హైలైట్స్:
- దాసరి, విష్ణు పర్‌ఫార్మెన్స్
డ్రాబ్యాక్స్:
- బ్రహ్మానందం కామెడీ ట్రాక్
- మందకొడి కథనం
విశ్లేషణ:
మెటీరియలిస్టిక్ మెంటాలిటీ ఉన్న నగర వాసులకీ, సాటి మనుషులకి విలువ ఇచ్చే పల్లెటూరి పెద్దలకి మధ్య ఉండే వ్యత్యాసాన్ని చూపించే చిత్రమిది. పక్కింట్లో ఏం జరుగుతున్నా మనకెందుకులే అని పట్టించుకోని తత్వం ఉన్న నగర వాసులకి మానవత్వ విలువలు బోధించే ప్రయత్నమిది. కాన్సెప్ట్‌లోనే బోలెడంత మెలోడ్రామా ఉండడంతో ‘ఎర్రబస్సు’ ముందుకి కదిలే కొద్దీ ప్రయాణం భారంగా మారిపోతుంది. క్లయిమాక్స్‌కి చేరుకునే సరికి ఎమోషన్స్ తారాస్థాయికి చేరుకుని సెంటిమెంట్ సినిమాలు రుచించని వారికి మరీ కష్టమవుతుంది.
ఆరంభ సన్నివేశాలు చాలా డల్‌గా, అవుట్ డేటెడ్‌గా అనిపిస్తాయి. విష్ణు, కేథరీన్ మధ్య ప్రేమ సన్నివేశాలు… కృష్ణుడు-మేల్కోటే మధ్య కామెడీ దృశ్యాలు ముప్పయ్యేళ్ల క్రితం వచ్చిన సినిమా చూస్తున్న ఫీలింగ్ ఇస్తాయి. తాత పాత్ర తెర మీదకి వచ్చాక కాసేపు సరదాగా సాగుతుంది. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని ఫౌంటేన్‌లో స్నాన్నం చేయడం, అక్కడే బట్టలు ఉతికి ఆరేసుకోవడం లాంటివి కాస్త అతిగా అనిపించినా కానీ కామెడీ అనుకుని సరిపెట్టుకోవాలి. తాతా మనవళ్ల అనుబంధానికి సంబంధించిన సన్నివేశాలు మినహా మిగతావన్నీ ఆర్టిఫిషియల్‌గా, ఫోర్స్‌డ్‌గా అనిపిస్తాయి. ఇండిపెండెంట్ వుమన్ అయిన కేథరీన్ క్యారెక్టర్ అలా ఒక పెద్దాయనని అమితంగా ద్వేషించడం పాత్రోచితంగా అనిపించదు.
ద్వితీయార్థంలో సినిమా మూడ్ పూర్తిగా మారిపోతుంది. డ్రామా పాళ్లు ఎక్కువై రిలీఫ్‌కి ప్లేస్ లేకుండా పోతుంది. దాంతో కామెడీ కోసమని బ్రహ్మానందంపై కాకుల ఎపిసోడ్ ఒకటి తీసారు. అది నవ్వించకపోగా… సినిమాకే అతి పెద్ద తలనొప్పిగా మారింది. సెంటిమెంట్ సీన్లు, ఇతర పాత్రలు తాత గొప్పతనం తెలుసుకునే సన్నివేశాలు అన్నీ గతంలో చూసినవే కావడంతో కొత్తదనం లేకుండా పోయింది. లాస్ట్ సీన్ మాత్రం ఎమోషనల్‌గా చాలా ఎఫెక్టివ్‌గా అనిపిస్తుంది. ఆ లెవల్ ఎమోషన్స్ సినిమాలో ఎక్కువగా ఉండి ఉంటే సెంటిమెంట్ ప్రియులని అయినా ఎర్రబస్సు శాటిస్‌ఫై చేసి ఉండేది. లీడ్ క్యారెక్టర్స్‌తో కనెక్ట్ ఏర్పడకపోవడంతో ఆ పాత్రలు గురయ్యే భావోద్వేగాలతో ప్రేక్షకులకి సంబంధం లేకుండా పోయింది. ఇలాంటి సినిమాలకి లీడ్ క్యారెక్టర్‌తో ఎమోషనల్ బాండ్ చాలా అవసరం. అలా పాత్రల్ని ప్రేక్షకులు ఓన్ చేసుకునేలా చేయడంలో ఎర్రబస్సు విఫలమైంది. పాత కాలం పద్ధతుల్లో సాగే కథనం, రిలీఫ్‌కి చోటివ్వని ద్వితీయార్థం.. ఎర్రబస్సు జర్నీని కష్టతరం చేస్తుంది.
బోటమ్ లైన్:‘ఎర్రబస్సు’లో కుదుపుల ప్రయాణం!
– గణేష్ రావూరి