టైటిల్: సమ్మతమే
రేటింగ్: 2.5/5
తారాగణం: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి, అన్నపూర్ణ, శివనారాయణ
కెమెరా: సతీష్ రెడ్డి
ఎడిటింగ్: విప్లవ్ నైషధం
సంగీతం: శేఖర్ చంద్ర
నిర్మాత: కె ప్రవీణ
దర్శకత్వం: గోపినాథ్ రెడ్డి
విడుదల తేదీ: జూన్ 24 2022
కిరణ్ అబ్బవరం యూత్ కి దగ్గరైన హీరో. చాందిని చౌదరి షార్ట్ ఫిలింస్ ద్వారా అంతే దగ్గరైన హీరోయిన్. ఈ ఇద్దరూ కలిసి “సమ్మతమే” అంటూ ముందుకొచ్చారు. టీనేజ్ ఆడియన్స్ సొంతం చేసుకున్న ఈ జంట తెర మీద ఏం చేసారు, ఎలాంటి కథతో ఆకట్టుకునే ప్రయత్నం చేసారో చూద్దాం.
తండ్రితో పాటూ సదాసీదా జీవితం గడిపే తల్లి లేని ఒక సగటు యువకుడు మన హీరో. ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని తండ్రికి ఇంటి పనుల కష్టాలు తప్పించాలని తన ఆలోచన. ఉద్యోగం నిమిత్తం సిటీకొస్తాడు. ఉన్నంతలో మిడిల్ క్లాస్ జీవితం గడుపుతుంటాడు. టౌన్ బ్యాక్ గ్రౌండ్ కావడం వల్ల సిటీ పోకడలు అంతగా నచ్చవతనికి. అలాగని పూర్తిగా రాముడు మంచిబాలుడు టైప్ కూడా కాదు. ఫ్రెండ్స్ తో ఒక మోతాదులో మందు తాగడం, సిగిరెట్ వెలిగించడం, కుదిరినప్పుడు చిన్నపాటి ఫైట్లు గట్రా చేసే సగటు మాస్ హీరో కూడా. అయితే పెళ్లి మాత్రం చాలా సభ్యతగల, అబద్ధలాడని, చెడు అలావట్లు లేని, సోషల్ మూవింగ్ కి దూరంగా ఉండే అమ్మాయిని మాత్రమే చేసుకోవాలనుకుంటాడు.
కానీ మన హీరోయిన్ ఆ టైపు కాదు. చాలా ఫాస్ట్. దొంగచాటుగా సిగిరెట్, మందు లాంటివి టేస్ట్ చేసే రకం. హాట్ గా రెడీ అయ్యి ఫ్రెండ్స్ తో రిజార్ట్ లో రాత్రంతా ఎంజాయ్ చేసొచ్చే టైపు. అలాగని గీత దాటేయదు. చూసేవాళ్లకి మాత్రం అలా అనిపిస్తుంది.
ఆ అమ్మాయి ఈ అబ్బాయి జీవితంలోకొస్తే ఎలా ఉంటుందనేది కథ. ఆ ప్రోసెస్ లో చివరికి ఇద్దర్లో ఎవరు ఎవర్ని అర్థం చేసుకుని ఒకటౌతారనేది కథనం. ఇందులో సస్పెన్స్ లు, టెన్షన్లు ఏవీ లేవు. ఈ సుఖాంతమయ్యే సినిమా చివర్లో ఒక నీతి వాక్యం చెప్పి ముగుస్తుంది.
కిరణ్ అబ్బవరం చాలా ఈజ్ తో బాగా చేసాడు. సగటు యువకుడి ఇమేజ్ కి దూరంగా పొకుండానే పాత్రని మలచుకుంటూ, ఉన్నంతలో కాస్తంత మాస్ హీరోయిజం కూడా ప్రదర్శించే ప్రయత్నం చేసాడు.
చాందిని చౌదరి తన పాత్రకి సరిపోయింది. బోల్డ్ అమ్మాయిగా యాప్ట్ గా ఉంది.
అన్నపూర్ణ పాత్ర ప్రవేశపెట్టబడిన తీరు చూసి చాలా కామెడీ ఊహిస్తాం. కానీ దర్శకుడు పెద్దగా వాడుకోలేదు. అలాగే ఆమె కొడుకు పాత్రలో శివనారాయణ కూడా. మంచి కామెడీ ఉన్న నటుడిని పెట్టుకుని ఉపయోగించుకోలేదు. సెకండాఫులో ఈ తల్లీ కొడుకుల మధ్య సరైన కామెడీ ట్రాక్ నడిపినా బాగుండేది. తెలంగాణా యాసలో మాట్లాడే తల్లి, కోస్తా యాసలో మాట్లాడే కొడుకు…కాస్త వెరైటీగా కూడా ఉండేది.
మిగిలిన పాత్రధారులంతా ప్యాడింగ్ కి సరిపోయారంతే.
సంగీతాన్ని మెచ్చుకుతీరాలి. పాటలు వినసొంపుగా ఉన్నాయి. 14 శతాబ్దం నాటి శ్రీనాథుడి పద్యం “జిలుగైన చెంగావి జిగి మీరు కుచ్చెళ్ళు..” ని ఒక పాటకి సాకీగా వాడుకుని ప్రాచీన సాహిత్యాన్ని గుర్తించిన తీరు బాగుంది. సెకండాఫులో వచ్చే “నేనూహించలే..” కూడా మనసుకి హత్తుకునేలా ఉంది.
ఇక డయలాగ్స్ విషయానికొస్తే “రోజులు బాలేదంటే మారాల్సినవి రోజులు. అమ్మాయిలు కాదు” అని శివనారాయణ చీప్పే డయలాగ్ ఎఫెక్ట్ పరంగా బాగుంది.
పైన చెప్పుకున్నట్టుగా కిరణ్ అబ్బవరమంటేనే టీనేజ్ మరియు ట్వంటీస్ కి కనెక్టయ్యే హీరో. ఈ ఆడియన్స్ కి హాయిగా నవ్వుకునేలా ఉండాలి సినిమా. ప్రధమార్థంలో అదే జరిగింది. చాలా లైట్ గా, సరదాగా సాగిపోతుంటుంది. హీరో హీరోయిన్ ని తారసపడే సన్నివేశం, పెళ్లి చూపుల కామెడీ ఇలాంటివి సటిల్ గా ఉంటూ వినోదాన్నందించాయి.
కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి త్వరగా కథ కొలిక్కి రాకుండా అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా అనిపించి సాగతీస్తున్నట్టనిపిస్తుంది. దానికి కారణం లైటర్ మొమెంట్స్ లేకపోవడం.
ఇలా అనిపిస్తోందనే కాబోలు..బలవంతంగా సప్తగిరి కామెడీ పెట్టారు. అది అస్సలు పేలకపోగా చిరాకు తెప్పిస్తుంది. ఇలాంటి కామెడీ లేని ఫొర్స్డ్ సీన్స్, కథనంలో సీరియస్ నెస్ వల్ల ప్రేక్షకులకి వాచీలు చూసుకునే పరిస్థితి ఏర్పడింది.
కథలో ముఖ్యంగా అడ్డొచ్చే అంశమేంటంటే హీరోయిన్ కి అనుమానాలున్న హీరో ఎలా నచ్చాడని..! ఒక దశలో “బాబూ నీకో నమస్కారం..” అని అమ్మాయి గుడ్బై చెప్పేయొచ్చుకదా అనిపిస్తుంది. అతనిలో ఆమెని కట్టిపారేసే లక్షణమేముందో దర్శకుడు సరిగ్గా చెప్పలేకపోయాడు.
అలాగే కన్వెన్షనల్ అమ్మాయిల్ని వెతుక్కోకుండా ఈ అమ్మాయినే మార్చుకోవాలనే తపన అతనికెందుకో కూడా తెలీదు. అంతలా ఆ అమ్మాయే కావాలన్న రీజనింగ్ కూడా బలంగా లేదు.
ఫస్టాఫ్ హ్యాండిల్ చేసినట్టే సెకండాఫు కూడా జాగ్రత్తగా మలచుంటే ఇది మంచి ఎంటర్టైనర్ అయ్యుండేది. కానీ బరువెక్కించి చివర్లో మెసేజ్ ఓరియంటెడ్ గా ముగించారు. ఒక స్టేజులో అసలు ఫస్టాఫ్ ఒకళ్లు, సెకండాఫ్ ఇంకొకళ్లు రాసుకుని తీసారా అనే అనుమానమొస్తుంది.
అక్కర్లేని ట్రాకులు చాలానే ఉన్నాయి. పబ్ దగ్గర 50000 కి దొరికే అమ్మాయిలు లాంటి సీన్స్ కథనానికి ఉపయోగపడనప్పుడు పెట్టడం అనవసరం. అలాగే పైన చెప్పుకున్నట్టు సప్తగిరి ట్రాక్ కూడా.
పబ్బులోకి రానిచ్చిన మైనర్స్ ని హీరోయిన్ క్లాస్ పీకడం, పబ్ ఓనర్స్ కి లా బోధించడం ఈ మధ్యన జరిగిన ఒక పబ్ ఉదంతాన్ని గుర్తుచేస్తుంది. కరెంట్ అఫైర్స్ సినిమాలో కనిపించినప్పుడు ప్రేక్షకుల అటెన్షన్ పొందడం సహజం.
చివరిగా చెప్పాల్సింది ఏంటంటే…ప్రేక్షుకులు కోరుకున్నది వినోదాత్మకం. ముగిసిన తీరు సందేశాత్మకం. అందుకే ఫలితం సందేహాత్మాకం. ఆడియన్స్ కి ఫస్టాఫ్ మాత్రమే సమ్మతం.
బాటం లైన్: సగమే సమ్మతం