మొన్నటివరకు కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగా చర్చలు జరిగాయి. కేసీఆర్ కొన్ని రాష్ట్రాలకు వెళ్లి వాళ్ళను, వీళ్ళను కలిశారు. కానీ ఎవరూ పెద్దగా స్పందించలేదు. కేసీఆర్ పెడతారన్న జాతీయ పార్టీ పేరు బీఆర్ఎస్ అని బయటకు వచ్చింది. ఇదంతా జరిగిన తరువాత కేసీఆర్ సైలెంట్ అయిపోయి చాలా కాలం అయింది.
బీజేపీయేతర పార్టీల తరపున రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెట్టిన సమావేశానికి కూడా కేసీఆర్ వెళ్ళలేదు. సంచలనం సృష్టిస్తా అని చెప్పిన గులాబీ పార్టీ అధినేత చివరకు చలనం లేకుండా ఉండిపోయారు.
జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన తర్వాత, అందుకోసం కసరత్తులు మొదలుపెట్టారు. అయితే ఆ కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. మరో రెండు నెలల వరకు జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ సమాలోచనలు జరుపుతారని, ఆ తరువాతనే పార్టీని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన రాష్ట్రపతి ఎన్నికలు, ప్రస్తుతం మహారాష్ట్ర లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కేసీఆర్ తాజా రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. తాను పెట్టబోతున్న జాతీయ పార్టీ జాతీయ రాజకీయాల గమనాన్ని మార్చాలంటే, అందుకు అనుకూలమైన సమయం కావాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇదే సమయంలో ఏ పని చేసినా మంచి రోజు చూసుకొని ప్రారంభించే సీఎం కేసీఆర్, ఈనెల 30వ తేదీ నుంచి ఆషాడ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఆషాడ మాసం లో ఎటువంటి పనులు చేయరని సమాచారం. అంటే వచ్చే నెలలో జాతీయ పార్టీ ప్రకటన ఉండబోదని తెలుస్తుంది. దేశ రాజకీయ పరిణామాల కన్నా కేసీఆర్ కు మంచి రోజులే ప్రధానం.
ఇక జాతీయ పార్టీని ప్రకటన చేయాలంటే అందుకు ముందుగా టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం పెట్టి తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఢిల్లీ వేదికగా జాతీయ పార్టీని ప్రకటించాల్సి ఉంటుంది. కానీ సీఎం కేసీఆర్ తీరు చూస్తే జాతీయ పార్టీ ఏర్పాటు విషయంలో ఇంకా తాత్సారం చేస్తున్నట్లు గానే కనిపిస్తోంది.
జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రశాంత్ కిషోర్, ప్రకాష్ రాజ్, రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులతో సీఎం కేసీఆర్ మంతనాలు జరిపినప్పటికీ జాతీయ పార్టీకి సంబంధించి ఓ స్పష్టత కేసీఆర్ కు రాలేదని సమాచారం. ఇంకా బిఆర్ఎస్, టిఆర్ఎస్ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఉన్న సందిగ్ధత ఇంకా తొలగిపోలేదు.
జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ను ప్రకటించి టిఆర్ఎస్ ను అందులో విలీనం చేయడమా? లేక టిఆర్ఎస్ పార్టీనే జాతీయ పార్టీ గా మార్చడమా అన్నదానిపై కేసీఆర్ తర్జన భర్జన పడుతున్నట్లుగా సమాచారం.
ఏది ఏమైనా తెలంగాణ సీఎం కేసీఆర్ అదును చూసి జాతీయ పార్టీని ప్రకటిస్తారనేది సుస్పష్టమే అయినప్పటికీ మారుతున్న రాజకీయ పరిణామాలతో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన మరింత ఆలస్యం అవుతుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.