నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నిక జరిగినట్టు కూడా లేదు. అదేదో వైసీపీ వ్యక్తిగత వ్యవహారం అన్నట్టుగా నడిచింది. బరిలో బీజేపీ వుండడం వల్ల కనీసం ఈ మాత్రమైనా ఆత్మకూరు ఉప ఎన్నిక మీడియా దృష్టిని ఆకర్షించింది.
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డిని వైసీపీ బరిలో నిలిపింది. లక్ష మెజార్టీ సాధించడమే లక్ష్యమని వైసీపీ ప్రకటించింది.
ప్రతి మండలానికి ఇద్దరేసి మంత్రుల్ని ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. మొత్తానికి ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కేవలం 64.14 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో 83శాతానికి పైమాట. అలాంటిది ఏకంగా 19 శాతం ఓటింగ్ తగ్గడంతో మెజార్టీపై వైసీపీ ఒక్కో మెట్టు తగ్గుతోంది.
లక్ష ఓట్ల దగ్గరి నుంచి ఏకంగా 70 వేలకు తగ్గడం గమనార్హం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆత్మకూరులో 70 వేల నుంచి లక్ష మెజార్టీతో తమ అభ్యర్థి గెలుస్తారన్నారు. కౌలు రైతులకు తమ ప్రభుత్వం చేసినట్టుగా మరో ప్రభుత్వం లబ్ధి చేయలేదన్నారు.
ఇదిలా వుండగా ప్రధాన ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన ఎన్నికలకు పూర్తిగా దూరంగా వున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్లు వేయడానికి జనం ఆసక్తి చూపకపోవడానికి కారణం ఏమై వుంటుందని అధికార పార్టీ ఆలోచిస్తోంది. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ప్రభుత్వం అందిస్తోంది. అయినప్పటికీ అధికార పార్టీకి అండగా నిలబడేందుకు జనం ఎందుకు ఆసక్తి చూపలేదనేది ప్రశ్న.
మాజీ మంత్రి బాలినేని చెబుతున్న ప్రకారం ….70 వేల మెజార్టీపై అధికార పార్టీ నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది. లక్ష టార్గెట్ పెట్టుకుంటే, కనీసం 70 వేల వరకైనా సాధించొచ్చనేది అధికార వ్యూహంగా కనిపిస్తోంది.