ఆత్మకూరులో ఉప ఎన్నిక పూర్తయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 83.32 శాతం పోలింగ్ నమోదైతే.. మూడేళ్ల తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం 64.14 శాతం ఓటింగ్ నమోదైంది. సహజంగానే ఉప ఎన్నికలంటే ప్రజలకు ఆసక్తి తక్కువ. అందులోనూ ఇక్కడ టీడీపీ పోటీలో లేదు. దీంతో సహజంగానే ఆ పార్టీ అభిమానులు పోలింగ్ కి దూరంగా ఉన్నారు.
కొన్ని క్షేత్రస్థాయి కారణాలు కూడా పోలింగ్ తగ్గడానికి కారణాలయ్యాయి. అయితే అధికార పార్టీ కూడా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు చేర్చడంలో వెనకబడిందనే చెప్పాలి. మరీ 80శాతం పోలింగ్ జరుగుతుంని ఎవరూ ఊహించలేదు కానీ 70 శాతం అనే మార్క్ అయినా చేరుతుందనుకున్నారు. అది కూడా సాధ్యం కాలేదు.
పోలింగ్ శాతం తక్కువైతే వైసీపీకి వచ్చే నష్టమేం లేదు కానీ, వాళ్లు పెట్టుకున్న లక్ష మెజారిటీ టార్గెట్ మాత్రం మిస్ అవుతుంది. అందుకే ఇక్కడ పోలింగ్ పెంచేందుకు వైసీపీ తీవ్రంగా కృషి చేసింది. మండలానికో మంత్రి, ఎమ్మెల్యేను ఇన్ చార్జిగా పెట్టారు. ఆ లెక్కన చూస్తే ఆత్మకూరు టౌన్ లో పోలింగ్ శాతం బాగా తక్కువగా నమోదైంది. మున్సిపాల్టీ పరిధిలో కేవలం 59 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ మంత్రి అంజాద్ భాషా, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఇన్ చార్జ్ లు గా ఉన్నారు. పట్టణంలోనే నేతలు మకాం వేసినా, ర్యాలీలు చేసినా చివరకు ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాల వైపు రాలేదు.
ఆ తర్వాత తక్కువ శాతం పోలింగ్ మర్రిపాడు మండలంలో నమోదైంది. అక్కడ 59.8 శాతం పోలింగ్ జరిగింది. ఇది మేకపాటి సొంత మండలం కావడం మరో విశేషం. అయినా కూడా ఇక్కడ జనాలు పోలింగ్ స్టేషన్లకు రాలేదు. ఇక్కడ ఇన్ చార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ప్రచారం చేశారు. ఇన్ చార్జ్ గా ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. నామినేషన్ రోజు మినహా మిగతా టైమ్ లో ఇటువైపు చూడలేదు. సో.. ఇక్కడ ఓటర్లను పోలింగ్ కేంద్రాలవైపు తీసుకొచ్చేందుకు పెద్దగా ప్రయత్నం జరగలేదనే చెప్పాలి.
మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ ఇన్ చార్జ్ లుగా ఉన్న ఆత్మకూరు రూరల్ ప్రాంతం నుంచి పోలింగ్ బాగా జరిగింది. అక్కడ పోలింగ్ శాతం 68.4. ఇక రోజా ఇన్ చార్జ్ గా ఉన్న చేజర్ల మండలంలో కూడా పోలింగ్ బాగా జరిగింది. అక్కడ 68 శాతం పోలింగ్ నమోదైంది. ఇన్ చార్జ్ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని, ఇటువైపు చూడకపోయినా.. రోజా ఒక్కరే ప్రచారంలో పాల్గొన్నారు. నగరి నుంచి తన సొంత ప్రచార రథాన్ని తెప్పించుకుని మరీ ఆమె ప్రచారం చేశారు. తనకు సంబంధంలేని మండలాల్లో కూడా రోజా పర్యటించారు.
ఓవరాల్ గా వైసీపీ నేతల్లో చాలామంది ప్రచారం సందర్భంగా ప్రెస్ మీట్లకే పరిమితం అయ్యారు. తాము పిలుపిస్తే చాలు జనాలు వచ్చి ఓట్లు వేస్తారనే ఆలోచనలో ఉన్నారు. గ్రౌండ్ లెవల్లో ఎంత పని జరిగింది, అసలు మంత్రులు ఏం చేశారనేది మాత్రం రేపు రిజల్ట్ రోజు తేలిపోతుంది. పోలింగ్ పర్సంటేజీ పెంచడంలో మాత్రం నేతలు అంచనాలను అందుకోలేకపోయారనేది మాత్రం వాస్తవం.