Advertisement

Advertisement


Home > Politics - Opinion

అల్లూరి సీతారామ‌రాజు కోసం అవ‌స్థ‌లు

అల్లూరి సీతారామ‌రాజు కోసం అవ‌స్థ‌లు

4వ త‌ర‌గ‌తిలో అల్లూరి సీతారామ‌రాజు పాఠం వుండేది. ఆయ‌న రేఖా చిత్రం పిల్ల‌ల‌కి భ‌లే ఇష్టం. దేశ‌భ‌క్తి విప‌రీత‌మై, నెహ్రూ, గాంధీలు తెర‌మీద క‌నిపిస్తే చ‌ప్ప‌ట్లు కొట్టే రోజులు. సీతారామ‌రాజు తిరుగుబాటు ఉత్తేజ‌పూరితంగా వుండేది. స్కూల్ ఫంక్ష‌న్ల‌లో ఏక‌పాత్రాభిన‌యం చేసేవాళ్లు. యాక్టింగ్‌, డైలాగ్‌లు బోర్‌గా వున్నా, మాతో చ‌దువుకునే వాడు అంత పెద్ద గ‌డ్డంతో క‌న‌బ‌డ‌డం ఆశ్చ‌ర్యంగా వుండేది. పెద్ద‌య్యాక నేను కూడా పెద్ద గ‌డ్డాన్ని పెంచుదామ‌నుకున్నా కానీ, అంద‌రికీ గ‌డ్డం పెర‌గ‌ద‌ని అర్థ‌మైంది.

సీతారామ‌రాజుపైన ఆరాధ‌న కొన‌సాగుతూ వుండ‌గా ఎన్టీఆర్ సినిమా తీస్తాడ‌ని వార్త‌. ఆయ‌న్ని ఊహించుకుంటున్న‌ప్పుడు కృష్ణ తాను కూడా తీస్తాన‌ని ప్ర‌క‌టించాడు. షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు. విజ‌య‌చిత్ర, సినిమా రంగం ప‌త్రిక‌ల్లో ఫొటోలు వ‌చ్చేవి. 1974, మే నెల‌లో రిలీజ్ అయ్యింది. స‌మ్మ‌ర్ సెల‌వులు, కానీ ఆ సినిమా మా వూరు రాయ‌దుర్గానికి అంత సుల‌భంగా రాదు. ప్ర‌పంచ మంతా ఆడిన త‌ర్వాత రీళ్ల ముక్క‌లు అతికించుకుని దాన్ని 16 క‌ట్‌ల‌తో మాకు చూపించేవాళ్లు.

ఈ లోగా ఒక మిత్రుడు బ‌ళ్లారి వెళ్లి చూసొచ్చాడు. సినిమా స్కోప్, కృష్ణ యాక్టింగ్‌, ఫైటింగ్‌లు అన్నీ అద్భుత‌మ‌ని వారం రోజులు క‌థ చెప్పాడు. బ‌ళ్లారికి ఎవ‌రైనా తీసుకెళితే త‌ప్ప వెళ్ల‌లేని వ‌య‌సు. మా వూరి థియేట‌ర్ల‌ను తిట్టుకుంటూ రోజులు వెళ్ల‌దీస్తుండ‌గా, మా ప‌ల్లెకు వెళ్లాల్సి వ‌చ్చింది. 150 కిలోమీట‌ర్ల దూరం, మూడు బ‌స్సులు మారాలి. రాయ‌దుర్గం నుంచి అనంత‌పురం, తాడిప‌త్రి ఇలా అర‌రోజు జ‌ర్నీ.

అనంత‌పురం బ‌స్టాండ్‌లో దిగితే క‌ళ్లు చెదిరిపోయాయి. కృష్ణ‌, జ‌గ్గ‌య్య‌ల సింగిల్ క‌టౌట్స్‌. అప్ప‌టి వ‌ర‌కు థియేట‌ర్ల ముందు క‌టౌట్స్ పెట్టేవాళ్లు. అల్లూరి సీతారామ‌రాజుకి టౌన్‌లో అక్క‌డ‌క్క‌డ పెట్టారు. హీరోకి కాకుండా క్యారెక్ట‌ర్ యాక్ట‌ర్ల క‌టౌట్ చూడ‌డం అదే మొద‌లు. సినిమా చూపించ‌మ‌ని మా నాన్న‌ని న‌స పెట్టాను. కానీ సినిమా చూడాలంటే సాయంత్రం వ‌ర‌కూ అనంత‌పురంలోనే వుండాలి. ఖ‌ర్చు. మా నాన్న ఒప్పుకోలేదు. ఏడ్పు మొహంతో వెళ్లిపోయాను.

1974 జూలైలో బ‌ళ్లారికి ఒక పెళ్లికి వెళ్లాం. ఊరికి దూరంగా వున్న సెల‌క్ట్ టాకీస్‌లో సీతారామ‌రాజు ఆడుతోంద‌ని తెలిసి అర్ధ రూపాయి ఆటోకి ఇచ్చి ప‌రుగు తీశాం. మా ఫ్రెండ్స్‌, వాళ్ల అన్న‌య్య‌లు మాత్ర‌మే ఉన్నందువ‌ల్ల ఈ ప‌రుగు సాధ్య‌మైంది. తీరా వెళితే అదే రోజు సినిమా తీసేసి, ఏదో హిందీ సినిమా వేశారు. సీతారామ‌రాజుని చూసే యోగం లేదు. రాయ‌దుర్గానికి ఎప్పుడొస్తే అప్పుడు చూడ‌డ‌మే అని క‌ర్మ సిద్ధాంతానికి లోబ‌డి వుండిపోయాను.

ఎట్టకేల‌కు అజీజియా టాకీస్‌లో వ‌చ్చింది. ఈ సినిమా కోసం స్క్రీన్ వెడ‌ల్పు చేశారు. కానీ వీకెండ్‌లో కాకుండా స్కూల్ రోజుల్లో వ‌చ్చింది. సోమ‌వారం వ‌స్తే, దాన్ని చూడాలంటే ఆదివారం వ‌ర‌కూ ఎదురు చూడాలి (శుక్ర‌వారమే సినిమాలు మార్చే ప‌ద్ధ‌తి అప్ప‌టికి లేదు).

తెగించ‌డ‌మే త‌ప్ప వేరే దారి లేదు. మ‌ధ్యాహ్నం స్కూల్ ఎగ్గొట్టి సాయంత్రం డ్రిల్ క్లాస్ వుంద‌ని డూప్ చేయ‌డ‌మే దారి (హిందీ మ్యాట్నీల‌న్నీ ఇలాగే చూసేవాళ్లం). నేనూ ఇంకో మిత్రుడు ప్లాన్ చేసి స్కూల్ బ్యాగ్‌లు ఒక‌డికి అప్పచెప్పాం(నాలుగు బెల్లం బ‌ర్ఫీలు లంచంగా ఇచ్చి).

స్కూల్ ద‌గ్గ‌రి నుంచి థియేట‌ర్ బాగా దూరం. ఎండ‌లో గుర్రాల్లా ప‌రిగెత్తి 50 పైస‌ల క్లాస్‌లోకి దూరాం. అప్ప‌టికే సినిమా స్టార్ట్‌. టైటిల్స్ ప‌డుతున్నాయి. జ‌నాల కాళ్లు తొక్కుతూ, క‌ళ్లు క‌న‌బ‌డ‌క‌, ఏదో రకంగా బెంచ్ మీద కూచున్నాం. ఎదురుగా పెద్ద స్క్రీన్‌లో కృష్ణ‌. జీవితంలో ప‌ర‌మానందం క‌లిగిన క్ష‌ణాల్లో ఇదొక‌టి.

ఫ్యాన్ తిర‌గ‌క‌పోయినా, న‌ల్లులు పిర్ర‌ల్ని పీకుతున్నా, అటూఇటూ క‌దిలే స్పేస్ లేకపోయినా 3 గంట‌ల సేపు (అప్ప‌ట్లో చిన్న వూళ్ల‌లో ఇంట‌ర్వెల్స్ లేవు. పాట‌లొస్తే అదే ఇంట‌ర్వెల్‌. దానికి తోడు పాత రీళ్లు కాబ‌ట్టి క‌ట్ అవుతూ వుండేది). క‌ద‌ల‌కుండా చూశాను. ఆ త‌ర్వాత చాలాసార్లు చూసినా ఫ‌స్ట్ టైం థ్రిల్ వేరు.

త్వ‌ర‌లోనే సీతారామ‌రాజు 125వ జ‌యంతి. గ‌ర్వంగా చేసుకోవాల్సిన ఉత్స‌వం. సీతారామ‌రాజుని శాశ్వ‌తంగా క‌ళ్ల ముందు ఉంచిన కృష్ణ‌ని గౌర‌వించాల్సిన ఉత్స‌వం.

జీఆర్ మ‌హ‌ర్షి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?