2002 గుజరాత్ అల్లర్లతో నాటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, నేటి ప్రధాని నరేంద్రమోదీకి ఎలాంటి సంబంధం లేదని సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ క్లీన్‌చిట్ ఇచ్చింది. నరేంద్ర మోదీతో పాటు 63 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ… కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ చేసిన న్యాయపోరాటం చివరికి ఆమెకు నిరాశే మిగిల్చింది. జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేయడం గమనార్హం.
పిటిషనర్ జాఫ్రీ భర్త జాకియా జాఫ్రీ… 2002 గుజరాత్ అల్లర్ల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. నాడు అహ్మదాబాద్‌లోని గుల్బర్జా సొసైటీలో కాంగ్రెస్ ఎంపీ జాకియా జాఫ్రీ హత్యకు గురయ్యాడు. ఈ అల్లర్లపై అప్పట్లో దర్యాప్తునకు సిట్ ఏర్పాటైంది. 2012లో సిట్ నివేదిక మోదీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఈ నివేదికను సవాల్ చేస్తూ గుజరాత్ స్పెషల్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించగా అక్కడా నిరాశే ఎదురైంది. అనంతరం హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది.
జాకియా జాఫ్రీకి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ సేతల్వాద్ అండగా నిలిచారు. ఈమె మద్దతుతోనే చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆమె ఆశ్రయించారు. సుప్రీంకోర్టు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం తీర్పు వెలువరించింది. సిట్ నివేదికను సమర్థించింది. గతంలో ప్రత్యేక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జారీ చేసిన ఆదేశాలతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది.
అప్పట్లో సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తు బృందం పిటిషనర్ జాఫ్రీ ఆరోపణలపై విచారణ చేపట్టింది. 2010లో నాటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీని సిట్ దాదాపు 9 గంటలకు పైగా విచారణ జరిపింది. ఆ తర్వాత అల్లర్లతో మోదీకి ఎలాంటి సంబంధం లేదని సిట్ తుది నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై జాఫ్రీ అలుపెరగని పోరాటం చేసినప్పటికీ, చివరికి ఓడిపోయారామె. మోదీకి న్యాయస్థానం క్లీన్ చిట్ ఇవ్వడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.