సినిమా రివ్యూ: సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌

రివ్యూ: సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ రేటింగ్‌: 1/5 బ్యానర్‌: సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి. తారాగణం: సప్తగిరి, రోషిణి ప్రకాష్‌, షకలక శంకర్‌, పోసాని కృష్ణమురళి, సయాజీ షిండే, హేమ తదితరులు సంగీతం: బుల్గానిన్‌…

రివ్యూ: సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌
రేటింగ్‌: 1/5
బ్యానర్‌:
సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి.
తారాగణం: సప్తగిరి, రోషిణి ప్రకాష్‌, షకలక శంకర్‌, పోసాని కృష్ణమురళి, సయాజీ షిండే, హేమ తదితరులు
సంగీతం: బుల్గానిన్‌
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: సి. రామ్‌ ప్రసాద్‌
నిర్మాత: రవి కిరణ్‌
దర్శకత్వం: అరుణ్‌ పవార్‌
విడుదల తేదీ: డిసెంబరు 23, 2016

సప్తగిరి హీరో కనుక ఇది నాన్‌స్టాప్‌ ఫన్‌ ఎక్స్‌ప్రెస్‌ అని ఆశపడి వెళ్లినట్టయితే గాలి తీసేయడానికి సప్తగిరి ఎక్కువ టైమ్‌ తీసుకోడు. ఇప్పుడు కాకపోతే ఇంకాసేపటికి కామెడీ ఉంటుంది, ఇంటర్వెల్‌కీ కామెడీ లేకపోతే సెకండ్‌ హాఫ్‌లో అయినా కామెడీ ఉండే ఉంటుంది, లేదంటే సప్తగిరితో ఎందుకు తీస్తారు? అంటూ ఎదురు చూస్తూ కూర్చుంటే శుభం కార్డు పడిపోతుంది కానీ హాయిగా నవ్వించిన ఒక్క సీన్‌ కానీ, కనీసం ఒక్క జోక్‌ కానీ తారసపడదు. 'మనం బేసిగ్గా కమెడియన్‌ కనుక ఏం చేసినా నవ్వేస్తారు' అనే ధోరణిలోనే సినిమా అంతా సాగిపోయింది. 

కమెడియన్‌గా నటించడం వల్ల తనలోని అన్ని కోణాలు చూపించుకోలేకపోతున్నా అనుకున్నాడో ఏమో హీరోగా చేసిన ఈ సినిమాలోనే చాలా టాలెంట్స్‌ ప్రదర్శించేసాడు. పౌరాణిక డైలాగులు బాగా చెప్పగలనని చాటుకోవడానికి ఇందులో రెండు సీన్లు పెట్టుకున్నాడు. ఎమోషనల్‌ సీన్స్‌ అదరగొట్టేస్తానంటూ సెంటిమెంట్‌ సీన్లలో లీటర్ల కొద్దీ గ్లిజరిన్‌ పిండేసాడు. తనకి బాగా వచ్చిన కామెడీ వదిలేసి ఆది నుంచి అంతం వరకు నేల విడిచి సాము చేసాడు. తను కామెడీ అనుకుని చేసిందంతా భరించలేని టార్చర్‌గా మారి ఎప్పుడెప్పుడు థియేటర్‌లోంచి బయట పడిపోదామా అని ఎదురు చూసేట్టు చేసింది. 

ఇంతకీ కథేమిటంటే, సప్తగిరి ఒక కానిస్టేబుల్‌ కొడుకు. నటుడు కావాలని కలలు కంటుంటాడు. కానీ తన తండ్రి చనిపోవడంతో తనకి కానిస్టేబుల్‌ ఉద్యోగం వస్తుంది. ఇష్టం లేకపోయినా తండ్రి కోసం ఆ ఉద్యోగం చేస్తున్న సప్తగిరి ఒకానొక సందర్భంలో తన తండ్రి హత్యకి గురయ్యాడని తెలుస్తుంది. దాంతో తన తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకోవడానికి పథకం రచిస్తాడు. 

అతను విలన్లపై పగ తీర్చుకుంటున్నాడా, లేక సినిమాకొచ్చిన పాపానికి ప్రేక్షకులపై పగ తీర్చుకుంటున్నాడా అనిపించేట్టుగా ఆ సీన్లన్నీ భయభ్రాంతులకి లోను చేస్తాయి. నవ్విస్తారనే నమ్మకంతో టికెట్‌ కొనుక్కుని వచ్చిన వారికి, ఒక పాయింట్‌లో నవ్వుకుందామనే ఆశ చచ్చిపోయి, త్వరగా ముగించేస్తే అదే పది వేలు అనుకునే రీతిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ వేధిస్తుంది. సన్నివేశాలకి మధ్య సంబంధం లేకుండా మొదలైన ఎక్స్‌ప్రెస్‌ నెమ్మదిగా ట్రాక్‌ మీదకి వస్తుందిలే అని చూస్తే, ఆల్రెడీ పట్టాలు తప్పిన రైలుకి యాక్సిడెంట్‌ తప్ప తిరిగి ట్రాక్‌ మీదకి రావడం ఎలా సాధ్యపడుతుంది? 

చాలా సినిమాల్లో అయిదారు నిమిషాల పాటు కనిపించే కామెడీ క్యామియోలు చేసే సప్తగిరి, వాటితోనే పలుమార్లు ఫెయిలవుతుంటాడు. అయితే ఆ క్యామియోలు ఫెయిలైనా సినిమాకొచ్చే నష్టం ఉండదు. తనే పూర్తిస్థాయి హీరోగా చేసిన సినిమా విషయంలో ఆ లాటరీ పద్ధతి పనికి రాదు కదా? కమెడియన్‌ హీరోగా ఉన్నప్పుడు పకడ్బందీ కథ ఉన్నా, లేకపోయినా కడుపుబ్బ నవ్వించే కామెడీ కంపల్సరీ. ఫారిన్‌ లొకేషన్లలో పాటలు, ఆకర్షణీయమైన నిర్మాణ విలువలతో సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌పై ఖర్చు విషయంలో నిర్మాత కాంప్రమైజ్‌ కాలేదు. కానీ ఆ డబ్బులో కొంత వెచ్చించి ఒక మంచి రచయితని హైర్‌ చేసుకున్నట్టయితే పెట్టిన ఖర్చుకి ప్రతిఫలం దక్కేది. 

సప్తగిరి తనలోని చాలా కోణాలు చూపించాడు. చివరకు రచనలోను వేలు పెట్టాడు. కొన్ని సినిమాల విజయంలో తన కామెడీతో ముఖ్య పాత్ర పోషించిన సప్తగిరి తనే హీరోగా నటించిన సినిమాలో కామెడీ చేయలేకపోవడం బాధాకరం. తనకంటే తనకి సపోర్ట్‌గా ఉన్న షకలక శంకరే కాస్తయినా నవ్వించగలిగాడు. హీరోయిన్‌ రోషిణి జస్ట్‌ యావరేజ్‌. సపోర్టింగ్‌ కాస్ట్‌లో దాదాపుగా అందరూ ఓవరాక్ట్‌ చేసారు. బుల్గానిన్‌ మ్యూజిక్‌తో రిలీఫ్‌ ఏమీ దక్కలేదు. ఎక్స్‌పీరియన్స్‌ టెక్నీషియన్‌ రామ్‌ ప్రసాద్‌ వల్ల ఈ చిత్రం చాలా రిచ్‌గా కనిపించింది. ఆయన ఛాయాగ్రహణమే ఈ చిత్రానికి మేజర్‌ ప్లస్‌. ఈ స్క్రిప్ట్‌ చేతిలో పెట్టి సినిమా తీయమంటే ఎంతటి తల పండిన దర్శకుడైనా చేతులెత్తేస్తాడు. స్క్రిప్ట్‌ అంత అధ్వాన్నంగా ఉన్నపుడు దర్శకుడు అరుణ్‌ పవార్‌ని తప్పు పట్టడమూ తప్పే. 

టీవీ గేమ్‌ షోల్లో ఫలానా డేర్‌ చేయండి అంటూ కఠినమైన పరీక్షలు పెడుతుంటారు తెలుసుగా. అలాంటి షో నిర్వాహకులెవరైనా ఈ సినిమా రైట్స్‌ తీసేసుకోవాలి. ఎవరైతే ఈ చిత్రాన్ని చివరివరకు చూడగలరో వారికి కారో, విమానమో గిఫ్ట్‌గా ఇచ్చేయవచ్చు. ఒక కామెడీ సినిమాతో జనాలకి థర్డ్‌ డిగ్రీ టార్చర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంటుందో తెలియజెప్పవచ్చునని ఇంతకుముందు ఎవరైనా చెప్పి ఉంటే నమ్మి ఉండేవాడిని కాదేమో కానీ, సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ చూసాక అది పాజిబుల్‌ అని అర్థమైంది. ఈ కథకీ, టైటిల్‌కీ సంబంధం లేదు కానీ ఈ సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌కి డెస్టినేషన్‌ అంటూ ఉంటే, అది ఖచ్చితంగా 'అస్సాం' అయి ఉంటుంది.

బాటమ్‌ లైన్‌: సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌: బోల్తా కొట్టేసింది!

– గణేష్‌ రావూరి