శశికళ వర్సెస్‌ శశికళ…!

జయలలిత వెళ్లిపోయాక తమిళనాడులో పరిస్థితులు చిత్రవిచిత్రంగా మారుతున్నాయి. దశాబ్దాలపాటు ఒక నాయకురాలి చేతి మీదుగా నడిచిన అన్నాడీఎంకే రాజకీయాలు ఇప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతాయో అర్థం కాకుండా ఉంది. ఎవరు ఎవరి మీద పైచేయి…

జయలలిత వెళ్లిపోయాక తమిళనాడులో పరిస్థితులు చిత్రవిచిత్రంగా మారుతున్నాయి. దశాబ్దాలపాటు ఒక నాయకురాలి చేతి మీదుగా నడిచిన అన్నాడీఎంకే రాజకీయాలు ఇప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతాయో అర్థం కాకుండా ఉంది. ఎవరు ఎవరి మీద పైచేయి సాధిస్తారో తెలియడంలేదు.

జయలలిత దగ్గర పిల్లి మాదిరిగా ఉన్న ముఖ్యమంత్రి పన్నీరుశెల్వం పులిలా మారుతున్నారా? ఆయన పులిలా మారడానికి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ సహకరిస్తున్నాయా? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు ఐటీ దాడుల్లో దొరికిపోయి సస్పెండ్‌ కావడం, వెంటనే కొత్త సీఎస్‌ను నియమించుకోవడం జయ ప్రాణ సఖి శశికళ నటరాజన్‌కు పెద్ద దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. రామ్మోహన్‌ రావు జయకు, శశికళకు ఆప్తుడు. ఇదంతా కేంద్రమే చేయించిందని, పన్నీరుశెల్వం బీజేపీకి అనుకూలంగా ఉండటంతో ఆయనకు శశికళ పీడ వదిలించేందుకు కేంద్రం పావులు కదుపుతోందని భావిస్తున్నారు.

ఓ పక్క ఈ కథ ఇలా సాగుతుండగా మరోపక్క ఇద్దరు శశికళల మధ్య పోరాటం సాగుతోంది. ఇద్దరిలో ఒకరు పార్టీ ప్రధాన కార్యదర్శితోపాటు ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న జయ ఫ్రెండు శశికళ నటరాజన్‌, మరొకరు అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ శశికళ పుష్ప.

జయలలిత చనిపోగానే తానే సర్వంసహాధికారిని అన్నట్లుగా శశికళ మాట్లాడగానే జయలలితకు మరణానికి ఆమె కారణమంటూ శశికళ పుష్ప తెర మీదికి వచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందని, క్రమశిక్షణ ఉల్లంఘించిందనే ఆరోపణలపై జయలలిత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పను ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీన పార్టీ నుంచి బహిష్కరించారు. సాధారణంగా అయితే జయలలిత ఇంత తీవ్రమైన చర్య తీసుకున్నప్పుడు ఏ అన్నాడీఎంకే నాయకుడైనా, నాయకురాలైనా కాళ్ల మీద పడిపోయి క్షమాపణ కోరుకుంటారు. తప్పయిందని చెంపలేసుకుంటారు. కాని శశికళ పుష్ప ఆ పని చేయకుండా అధినేతకు ఎదురుతిరిగారు. 

జయలలిత వల్ల తన ప్రాణాలకు ముప్పుందని, తనకు రక్షణ కావాలని రాజ్యసభలోనే కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అలాంటి శశికళ పుష్ప జయ చనిపోగానే అపర భక్తురాలి అవతారమెత్తింది. శశికళ నటరాజన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. జయ మరణానికి ఆమె కారణమని, దీనిపై దర్యాప్తు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసింది.

శశికళ నటరాజన్‌ను ప్రధాన కార్యదర్శిగా కాని, ముఖ్యమంత్రిగా కాని కానివ్వకూడదని పోరాటం చేస్తోంది. శశికళను ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని మంత్రులు, ఇతర నాయకులు ప్రయత్నాలు చేస్తుండగా ఆ పదవికి తాను కూడా పోటీ చేస్తానని, సభ్యులెవరికైనా ఎవ్వరికైనా పోటీ చేసే హక్కుందని ఎంపీ శశికళ ప్రకటించింది.

శశికళ నటరాజన్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోకుండా అన్నాడీఎంకే జనరల్‌ కౌన్సిల్‌ను నిరోధించాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేసింది. తాను పోటీ చేసే విషయం హైకోర్టు తీర్పుపై ఆధారపడివుందని ఎంపీ తెలిపింది. ఆమె పిటిషన్‌ను కొట్టేయాలని, విచారణకు స్వీకరించొద్దని పార్టీలోని శశికళ నటరాజన్‌ మద్దతుదారులు కోర్టుకు విజ్ఞప్తి చేస్తూ మరో పిటిషన్‌ వేశారు.          

శశికళ నటరాజన్‌కు ఉన్నత పదవి కట్టబెట్టేందుకు 75 శాతం మంది కార్యకర్తలు, నాయకులు వ్యతిరేకంగా ఉన్నారని, గతంలో శశికళ కుట్రలు తెలుసుకున్న జయ ఆమెను పార్టీ నుంచి వెళ్లగొట్టారని పుష్ప చెప్పింది. రాజ్యసభ రికార్డుల్లో తాను ఇప్పటికీ అన్నాడీఎంకే ఎంపీగానే ఉన్నానంది. ఇంతకూ శశికళ పుష్ప ఎందుకు శిక్షకు గురైంది? గతంలో ఈమె డీఎంకేకు చెందిన రాజ్యసభ ఎంపీ తిరుచ్చి శివను లాగి చెంప మీద కొట్టింది. అది కూడా చాటుమాటుగా కాదు. పబ్లిగ్గా ఢిల్లీ విమానాశ్రయంలో గూబ గుయ్యిమనిపించింది. పైగా తన చర్యను సమర్ధించుకుంది. 

అందుకు ఆమె చెప్పిన కారణం…డీఎంకే ఎంపీ సెక్యూరిటీ సిబ్బంది దగ్గర జయలలిత గురించి, అన్నాడీఎంకే గురించి హేళనగా మాట్లాడాడు. ఈమెను చూసి మరింత రెచ్చిపోయాడు. అమ్మను, పార్టీని మాటలనడం ఈమె తట్టుకోలేకపోయింది. చెంప పగలగొట్టింది. మహిళా ఎంపీ పురుష ఎంపీని ఏ ఉద్దేశంతో కొట్టిందోగాని  అమ్మ మాత్రం దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణించింది.  

పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించారని జయలలిత ఫీలయ్యారు. తనపై దుష్ప్రచారం చేయడానికి డీఎంకేకు ఆయుధంగా ఉపయోగపడుతుందని భావించారు. దీంతో ఎంపీని పార్టీ నుంచి బహిష్కరించారు. జయ కన్నుమూశాక శశికళ పుష్ప విజృంభిస్తున్నారు. మరి ఆమెను ఎంతమంది సపోర్టు చేస్తారో చూడాలి….!