రంగంలోకి దిగుతున్న సోనియా గాంధీ…!

కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దురదృష్టమేమిటోగాని గాంధీ-నెహ్రూ కుటుంబంలో ఆయనపై 'విఫల నాయకుడు'గా ముద్ర పడిపోయింది. ఆయన ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ బలమైన నాయకుడు అనో, ప్రధాని మోదీకి సమవుజ్జీ అనో ఎవ్వరూ అనడంలేదు.…

కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దురదృష్టమేమిటోగాని గాంధీ-నెహ్రూ కుటుంబంలో ఆయనపై 'విఫల నాయకుడు'గా ముద్ర పడిపోయింది. ఆయన ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ బలమైన నాయకుడు అనో, ప్రధాని మోదీకి సమవుజ్జీ అనో ఎవ్వరూ అనడంలేదు.

తమ కుటుంబం నుంచి రాహుల్‌ను బలమైన నాయకుడిగా నిలబెట్టాలని తల్లి సోనియా గాంధీ ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా కాలం కలిసిరావడంలేదు. ఒకప్పటికంటే ఇప్పుడు రాహుల్‌ చాలా పరిణతి చెందిన నాయకుడిగా కనిపిస్తున్నారు. ప్రధాని మోదీని తన శక్తి మేరకు ఎదుర్కొంటున్నారు. బలంగా ఆరోపణలు చేస్తున్నారు. పార్లమెంటులో, బయట ధాటిగా మాట్లాడుతున్నారు. ఇదంతా చూస్తుంటే రాహుల్‌ బలమైన నాయకుడని అనిపిస్తుంది. అలా అనుకుంటూ ఉండగానే ఎక్కడో ఓ చోట తప్పు చేయడంతో ఆయన కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారి విమర్శలపాలు కావల్సివస్తోంది. దీంతో దాన్ని కవర్‌ చేయడానికి, మోదీకి గట్టిగా జవాబివ్వడానికి సోనియా గాంధీ రంగంలోకి దిగాల్సివస్తోంది.

వాస్తవానికి సోనియా గతంలో మాదిరిగా దూసుకుపోయే పరిస్థితి లేదు. కారణం ఆరోగ్యం బాగోలేకపోవడం. కొంతకాలంగా ఆమె ఎక్కువగా మాట్లాడటంలేదు. ఎక్కువగా తిరగడంలేదు కూడా. ఈ రెండు పనులూ రాహుల్‌ గాంధీయే చేస్తున్నారు.

కాని వ్యూహాత్మకంగా అడుగులు వేయలేకపోతున్నారని విశ్లేషకులే కాకుండా కాంగ్రెసు నాయకులూ భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాల్లో, బయటా మోదీపై రాహుల్‌ అనేక ఆరోపణలు చేశారు. తాను మాట్లాడితే భూకంపం వస్తుందన్నారు. ఇప్పటివరకు వ్యక్తిగతంగా అవినీతి మకిలి అంటని మోదీపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. ఆయనకు కోట్ల రూపాయల ముడుపులు అందాయన్నారు. అవి పాత ఆరోపణలే అయినా రాహుల్‌ చెప్పేసరికి జనాలకు కొత్తగా అనిపించింది.

ఇంత తీవ్రంగా ఢీకొట్టిన తరువాత పార్లమెంటు సమావేశాల చివరి రోజు మోదీతో సమావేశం కావడంతో అంతా తుస్సుమంది.  రైతుల సమస్యలపై మాట్లాడటానికి మోదీని కలిశానని రాహుల్‌ చెప్పారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా ఆగ్రహించాయి. పార్లమెంటులో ప్రతిపక్షాలను ప్రభుత్వం మాట్లాడనివ్వలేదని ఆరోపిస్తూ ఈ విషయమై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకొని మూకుమ్మడిగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. కాని రాహుల్‌ ప్రధానిని కలుసుకోవడంతో చాలా పార్టీలు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లే కార్యక్రమాన్ని బాయ్‌కాట్‌ చేశాయి. 

బీఎస్‌పి అధినేత  మాయావతి నాయకత్వంలో ప్రతిపక్షాలు రాహుల్‌ చర్యను తీవ్రంగా నిరసించాయి. వామపక్షాలు సహా అన్ని పార్టీలు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లడాన్ని మానుకున్నాయి. దీంతో సోనియా గాంధీ రంగంలోకి దిగుతున్నారు. ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తెచ్చి డీమానిటైజేషన్‌పై మోదీని కడిగిపారేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆమే చొరవ తీసుకున్నారు.

డిసెంబర్‌ 27న 16 ప్రతిపక్షాలు కలిసి తమ ఐక్యతను చాటబోతున్నాయి. ఇందుకు సోనియా నేతృత్వం వహిస్తారు. పదహారు పార్టీల అధినేతలు, కీలక నాయకులు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహిస్తారు. నోట్ల రద్దుపై పెద్ద యుద్ధమే చేస్తున్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా మీడియా సమావేశంలో పాల్గొంటారు. విధానాలు, రాజకీయ భావజాలం రీత్యా ఈ ప్రతిపక్షాల్లో ఒకరంటే మరొకరికి పడదు. కాని అందరి అజెండా ఒక్కటే. మోదీకి వ్యతిరేకంగా జట్టు కట్టడం. డీమానిటైజేషన్‌ను నిరసించడం.  సోనియా గాంధీ ఆరోగ్యం బాగాలేదనేది వాస్తవం.

ఆమె గర్భాశయ ముఖద్వార కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు అమెరికాలో ఆపరేషన్‌ జరిగింది. ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్న తరువాత ఒకప్పటిలా చురుగ్గా పనిచేయలేకపోతున్నారు. ఇంటి పక్కన భవనంలో కీలకమైన కాంగ్రెసు వర్కింగ్‌ కమిటీ సమావేశం జరుగుతుంటేనే వెళ్లలేకపోయారంటే ఆమె పూర్తి విశ్రాంతి తీసుకునే దశకు చేరుకున్నారని అర్థమవుతోంది. ఆమె రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించే అవకాశం లేదని మీడియా పండితులు చెబుతున్నారు. అంతా భుజాన వేసుకొని పనిచేయడం మానేయాలని  వైద్యులు సలహా ఇచ్చారు.

కొంతకాలం క్రితం యూపీలోని వారణాసిలో (ప్రధాని మోదీ నియోజకవర్గం) ఎన్నికల ప్రచారం చేస్తూ హఠాత్తుగా అనారోగ్యం పాలైన సోనియాలో యాక్టివ్‌నెస్‌ తగ్గిపోయింది. ఎక్కువగా  బయటకు రావడంలేదు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే ఉత్తరప్రదేశ్‌లో ఆమె ఎన్నికల ప్రచారం చేయకపోవచ్చని అనుకుంటున్నారు. రాహుల్‌కు ఎంత త్వరగా బాధ్యతలు అప్పగిస్తే అంత మంచిదని ఆమె భావిస్తున్నా  ఇప్పటివరకు ముందుకు పడలేదు.