రివ్యూ: పిట్టగోడ
రేటింగ్: 2.5/5
బ్యానర్: సన్‌షైన్ సినిమా, సురేష్ ప్రొడక్షన్స్
తారాగణం: విశ్వదేవ్ రాచకొండ, పునర్నవి భూపాలం తదితరులు
సంగీతం: 'ప్రాణం' కమలాకర్
ఛాయాగ్రహణం: ఉదయ్
కథనం, నిర్మాత: రామ్ మోహన్ పి.
మాటలు, దర్శకత్వం: అనుదీప్ కె.వి.
విడుదల తేదీ: డిసెంబరు 24, 2016
కొత్తవాళ్లతో తీసిన చిన్న సినిమాలో కాస్త కొత్తదనం ఉండి, వినోదం పండితే ఏ స్థాయి విజయం సాధించగలదనేది 'పెళ్లిచూపులు' చిత్రం నిరూపించింది. ఆ చిత్రానికి సపోర్ట్ ఇచ్చిన సురేష్ బాబు 'పిట్టగోడ' అనే మరో చిన్న చిత్రానికి కూడా అండగా నిలిస్తే, ఇది కూడా మరో పెళ్లి చూపులు లాంటి ఎంటర్‌టైనర్ అవుతుందనే అంచనాలు నెలకొన్నాయి. పబ్లిసిటీ ఆసక్తికరంగా చేస్తూ, ఆకట్టుకునే ప్రోమోలతో దిట్టంగానే కనిపించిన ఈ పిట్టగోడ నిజానికి అంత బలంగా ఏమీ లేదు. కథ, కథనాలు మరీ సాధారణంగా ఉండడంతో మొదట్లో సహజమైన పాత్రలతో, సన్నివేశాలతో కాసింత అలరించినా, అసలు కథలోకి వెళ్లేసరికి గోడ బీటలు వారింది.
పెళ్లి చూపులులో సహజత్వానికి తోడు బలమైన కథ, రిలేట్ చేసుకునే క్యారెక్టర్స్, సిట్యువేషన్స్ ఉన్నాయి. అందుకే ఆ చిత్రం అంతగా ఆదరణకి నోచుకుంది. చిన్న చిత్రాల విషయంలో కథ, కథనాల పరంగా ఏమాత్రం తేలికపాటి ధోరణి పనికి రాదు. స్టార్ వేల్యూ లేకుండా ఇలాంటి చిత్రాలు నిలదొక్కుకోవాలంటే అద్భుతం జరగాలి. పిట్టగోడకి కూడా మంచి వినోదాత్మక సెటప్ కుదిరింది. మంచి పాత్రలు కూడా సిద్ధమయ్యాయి. కానీ వాటిని నడిపించే కథ కొరవడింది. దాంతో ఇంటర్వెల్ వరకు గోడ మీది అల్లరి సరదాలతో సాఫీగా గడిచిపోయినా, ఇంటర్వెల్ నుంచి గోడ క్రాక్ ఇవ్వడం స్టార్ట్ అయింది.
కథలోకి వెళితే… నలుగురు కుర్రాళ్లు తమ ఊరిలోని పిట్టగోడ మీద కాలక్షేపం చేసేస్తూ ఉంటారు. సరిగ్గా చదవక, పరీక్షలు పాస్ అవడం లేదని తండ్రుల చేత చీవాట్లు తింటుంటారు. ఏదో ఒక పనికొచ్చే పని చేసి పేపర్లో పడాలని అనుకుని ఒక క్రికెట్ టోర్నీ నిర్వహిద్దామని అనుకుంటారు. ఆ క్రమంలో వారు ఇబ్బందుల్లో పడతారు. డబ్బులు వసూలు చేసి పోటీలు నిర్వహించలేకపోవడంతో వారిపై చీటింగ్ కేస్ కూడా నమోదవుతుంది. ఇదిలావుంటే తమ ఊరికి కొత్తగా వచ్చిన దివ్యతో (పునర్నవి) ప్రేమలో పడతాడు ఈ గ్యాంగ్‌లో మెయిన్ అయిన టిప్పు (విశ్వదేవ్). ఆమె కారణంగా అతని జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుంది? చివరకు ఆ గోడ మీది నలుగురి జీవితాలు ఏమవుతాయి?
కథాపరంగా చెప్పుకోతగ్గ విషయం లేకపోయినప్పటికీ ఈ కొత్త వాళ్లతోనే సరదా సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ టైమ్ పాస్ అయిపోతుంది. కుర్రాళ్ల మధ్య సంభాషణలు, తండ్రులతో వారు పడే పాట్లు నవ్విస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగా సెట్ అయింది. అయితే అటుపై ఆసక్తికరంగా నడిపించడానికి తగిన కాన్‌ఫ్లిక్ట్ కొరవడడంతో మెలోడ్రామా నిండిపోయి కథనం కుంటు పడింది. అక్కడ్నుంచీ అంతా కన్వీనియంట్‌గా, సినిమాటిక్‌గా మారిపోవడంతో అంతవరకు ఉన్న సహజత్వం కూడా మిస్ అయిపోయి పిట్టగోడ ఒక సగటు సినిమాగా మిగిలిపోయింది.
తనని ప్రేమిస్తున్నానని చెప్పడానికి టిప్పు వచ్చినప్పుడు అతడిని తిట్టిన దివ్య నెక్స్‌ట్ సీన్‌లోనే అతడిపై సాఫ్ట్ కార్నర్ చూపించడం స్టార్ట్ చేస్తుంది. ప్రేమ, ద్వేషం లాంటి వాటికి తాను దూరం అంటూనే కారణం లేకుండా అతనితో ప్రేమలో పడుతుంది. ఇక క్లయిమాక్స్ అయితే తమకి కావాల్సినట్టుగా కన్వీనియంట్‌గా పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. అప్పటికప్పుడు దొంగ నోట్ల వ్యవహారంతో విలన్స్‌కి చెక్ పెట్టడం, అంతవరకు ఇంటర్ కూడా పాస్ కాని కుర్రాళ్లకి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేయడం, అదే ఏజ్‌లో హీరోగారికి పెళ్లి కూడా అయిపోవడం చూస్తే మినిమం థాట్ పెట్టకుండా, ఏదో ముగించాలన్నట్టు ముగించేసిన భావన కలుగుతుంది.
హీరోయిన్ ఫ్లాష్‌బ్యాక్ కానీ, విలన్ మోటివ్ కానీ కన్విన్సింగ్‌గా లేకపోవడం, తనకొచ్చిన ఇబ్బందిని హీరో సింపుల్‌గా సాల్వ్ చేసేసుకుని హీరో అయిపోవడం పిట్టగోడని మరింత వీక్ చేసేసాయి. అలాగే హీరో తండ్రి ప్రవర్తన కూడా విచిత్రంగా అనిపిస్తుంది. కొడుకుపై కనీస ప్రేమాభిమానాలు చూపించని ఆ తండ్రి ఒక్కో సీన్‌లో అతని కోసం తపించిపోతూ ఉంటాడు. సెంటిమెంట్ పండించడం కోసం ఈ క్యారెక్టర్‌ని తమకి కావాల్సిన టైమ్‌లో కఠినంగా, మరో టైమ్‌లో ఉదాత్తంగా చూపించారు. తెలంగాణా విలేజ్ సెటప్‌లో ఒక చక్కని వినోదాత్మక చిత్రం కావడానికి తగ్గ సరంజామా ఉన్నప్పటికీ దానిని ఒక పకడ్బందీ స్క్రిప్ట్‌లో వేయలేకపోవడంతో అదంతా వృధా అయిపోయింది.
లీడ్ పెయిర్ పాత్రలకి తగినట్టున్నారు. తమ పరిధుల్లో బాగానే చేసారు. హీరో స్నేహితుల పాత్రధారులు కూడా నవ్వించారు. కానీ మిగతా పాత్రధారులు మాత్రం అవసరానికి మించిన నటనతో బాగా ఇబ్బంది పెట్టారు. కమలాకర్ సంగీతంతో పాటు ఉదయ్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. లో బడ్జెట్‌లో తీసినా క్వాలిటీ పరంగా ఎలాంటి లోటు లేదు. దర్శకుడు కామెడీ సీన్ల వరకు బాగా హ్యాండిల్ చేసినా కానీ డ్రామా పండించలేకపోయాడు. స్క్రిప్ట్ పరంగా జరిగిన పొరపాట్ల ఎఫెక్ట్ అతని అవుట్‌పుట్‌పై రిఫ్లెక్ట్ అయింది.
ఫస్ట్ హాఫ్ వరకు వినోదాత్మక సన్నివేశాలు, పాత్రలతో కాలక్షేపాన్నిచ్చిన పిట్టగోడ ద్వితీయార్థంలో కంప్లీట్‌గా ఆఫ్ ట్రాక్ వెళ్లిపోయి, క్లయిమాక్స్‌లో టోటల్‌గా కొలాప్స్ అయిపోయింది. చిన్న సినిమా నుంచి ఇంతకుమించి ఆశించరనే తేలికపాటి ధోరణి ద్వితీయార్థంలో బాగా కనిపించింది. స్టార్ల సినిమాల్లో పొరపాట్లున్నా అవి ఆయా హీరోల స్టార్‌డమ్ వల్ల, వారి స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల, ఇతరత్రా కమర్షియల్ హంగుల వల్ల పాస్ అయిపోతుంటాయి. కానీ చిన్న సినిమాల విషయంలో ఎక్కడా పట్టు విడవడానికి ఆస్కారముండదు. సర్‌ప్రైజ్ విన్నర్లు కావాలంటే అందుకు తగ్గ స్ట్రెంగ్త్ స్క్రిప్ట్‌లో ఉండి తీరాల్సిందే. కలర్‌ఫుల్ బిల్డింగుల మధ్య ఇలాంటి పిట్టగోడల వైపు దృష్టి మరలించాలంటే అందుకు తగినంత ఆకర్షణలు సమకూర్చుకుంటే తప్ప గోడ నిలబడదు మరి.
బాటమ్ లైన్: పిట్టగోడ: బలంగా లేదు!
గణేష్ రావూరి