Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: నారప్ప

మూవీ రివ్యూ: నారప్ప

చిత్రం: నారప్ప
రేటింగ్: 2.5/5
తారాగణం:
వెంకటేష్, ప్రియమణి, శ్రీ తేజ్, కార్తిక్ రత్నం, నాజర్, రావు రమేష్, రాఖీ తదితరులు
సంగీతం: మణి శర్మ
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్ 
కెమెరా: శ్యాం కే నాయుడు 
నిర్మాతలు: సురేష్ బాబు, కలైపులి థాణు 
దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
విడుదల తెదీ: 20 జూలై 2021
ఓటీటీ: అమెజాన్ ప్రైం వీడియో 

వెట్రిమారన్ దర్శకత్వంలో రెండేళ్ళ క్రితం అరవంలో వచ్చిన "అసురన్" కి తెలుగు రీమేక్ ఈ "నారప్ప".  కాసేపు 1980ల్లోనూ, కాసేపు 1950ల్లోనూ సాగే పగలు ప్రతీకారాల కథ ఇది. 

రక్తపాతం లేకుండా ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు అంటూ సకుటుంబ సపరివార చిత్రాలు తీసే శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రం తెలుగులోకి చేయడం కాస్త వింత. అయితే తమిళంలో ఉన్నదున్నట్టుగా తెరకెక్కించడం జరిగింది కనుక ఈ తరహా సినిమాలు కూడా చేయడానికి దీన్నొక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నట్టుంది శ్రీకాంత్ అడ్డాల. 

అనంతపురం జిల్లాలో ఒక పేద రైతు నారప్ప (వెంకటేష్). అతనికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు. తన చిన్నకొడుకు సిన్నప్పని తీసుకుని అడవుల్లో పడి తప్పించుకుంటుంటాడు. మరో పక్కన అతని భార్య (ప్రియమణి) కూతురుని వెంటపెట్టుకుని తన అన్నయ్య (రాజీవ్ కనకాల) సాయంతో మరో దిక్కున తప్పించుకు పారిపోతుంటుంది. వీళ్ళని పోలీసులు, ఒక గ్యాంగ్ తరుముతుంటారు. వాళ్లకి జరింగేందేంటి? వాళ్లని ఎవరు ఎందుకు తరుముతున్నారు? ఈ ప్రశ్నలకి సమాధానంగా నారప్ప మనోగతం రూపంలో కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. 

భూస్వాములు, బానిసలు అనే తేడాలతో నడిచే సమాజం ఉన్న రోజుల్లో నారప్ప బానిస కుటుంబానికి చెందినవాడు. అతని పెద్ద కొడుకు అన్యాయంపై నోరు తెరిస్తే గొడవవుతుంది. అది చిలికి చిలికి గాలివానై అతని ప్రాణం తీస్తుంది. దానికి ప్రతీకారంగా సిన్నప్ప మరొక హత్య చేస్తాడు. అక్కడితో మళ్లీ కథ వర్తమానానికి వస్తుంది. తర్వాత ఏం జరిగిందనేది బుల్లితెరపై చూడాలి. 

కథ పరంగా చూసుకుంటే రంగస్థలం కంటే గొప్పదేం కాదు. కథనం పరంగా చూసుకున్నా ఇంతకంటే బలమైన కథనాలు చాలానే వచ్చాయి గతంలో. 

మరి ఈ సినిమా తమిళంలో ఎందుకు సూపర్ హిట్ అయ్యిందంటే సమాధానం ఒక్కటే...యంగ్ హీరో ధనుష్ వయసుడిగిన పాత్రలో నటించి మెప్పించడం. 

కానీ ఇక్కడ వెంకటేష్ ఆ పాత్ర చేసాడు. అది తన ప్రస్తుత వయసుకు సరిపోయే పాత్ర. అందువల్ల పెద్దగా స్టన్నింగ్ ఫ్యాక్టర్ కనపడదు. పోనీ ఫ్లాష్ బ్యాక్ లో యంగ్ నారప్ప విషయంలో స్పార్క్ ఉందా అంటే అక్కడ తన వయసు దాచలేకపోయాడు. పైగా పాత్రకు తగ్గట్టు కాకుండా హ్యాండ్సం గా కలర్ఫుల్ బట్టలేసుకుని క్లీన్ షేవ్ లో తెల్లగా మెరిసిపోతూ కమెర్షియల్ హీరోలాగ కనిపించాడు. దానికి తోడు అతని పక్కన అభిరామి చిన్నపిల్లలా ఉంది. కనుక ఎలా చూసుకున్నా వాచకం, అభినయం పర్ఫెక్ట్ గా ఉన్నా ఆహార్యం విషయంలో వెంకటేష్ మెరుపులు మెరిపించలేకపోయాడు. అదొక పెద్ద మైనస్. 

"దృశ్యం"లో శిక్ష పడకుండా తన కుటుంబాన్ని కాపాడుకునే పాత్రలో కనిపించిన వెంకటేష్ మళ్లీ ఇందులో కూడా అలాంటి పాత్రలోనే కనిపించాడు. కనుక ఆ విషయంలో కూడా రిపిటిటివ్ నెస్ కనపడింది. 

ఇక ప్రియమణి నటనని మాత్రం మెచ్చుకుని తీరాలి. చాలా పవర్ఫుల్ గా ఉంది. అలాగే బాల నటుడికి ఎక్కువ, పెద్ద నటుడికి తక్కువ అన్నట్టుగా ఉన్న సిన్నప్ప పాత్రధారి (రాఖీ) బాగా చేసాడు. దాదాపు సినిమా మొత్తం అతని చుట్టూనే తిరుగుతుంది. అసలీ పగలకి, ప్రతీకారాలకి ఈ సిన్నప్ప అమాయకత్వమే కారణం.

పెద్ద కొడుకుగా చేసిన కార్తిక్ రత్నం, రంగబాబుగా కనిపించిన శ్రీతేజ్ కూడా మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. రావు రమేష్ లాయర్ పాత్రలో కాసేపైనా మెప్పించాడు. మిగతా నటీనటులంతా కొత్త మొహాలే అయినా పాత్రకు తగ్గట్టుగా ఉన్నారు. 

చూసి కాపీ రాసేటప్పుడు మ్యాటర్ మక్కీకి మక్కీ దించేసినా రైటింగ్ బాగోకపోయినా, కొట్టివేతలున్నా ఫుల్ మార్క్స్ వెయ్యాలనిపించదు. ఇక్కడ నిజానికి ఇల్లు, వాకిలి, గొడ్డు, గోదా, మట్టి, చెట్టు అన్నీ కాపీ కొట్టారు. మాటలు కూడా అవే... భాష మారిందంతే. అయినా ఎక్కడో ఒరిజినల్లో ఉన్న బిగువు మిస్సయ్యింది. 

ఫస్టాఫ్ గ్రిప్పింగ్ గా ఉన్నా సెకండాఫ్ లో కథ చివరకికొచ్చేకొద్దీ ప్రేక్షకులు సహనపరీక్ష రాయాల్సుంటుంది. క్లైమాక్స్ ప్రెడిక్టిబుల్గా ఉండడంతో పాటు ఒంటిచేత్తో వెంకటేష్ చేసే కమెర్షియల్ తరహా క్లైమాక్స్ ఫైటింగ్ అంతవరకూ చూస్తున్న మూడ్ ని దెబ్బతీస్తుంది. తండ్రీకొడుకులు పొట్టల్లో అంత లావు బరిసెలు దిగిపోయినా వాళ్ళు బతికి బట్టకట్టడం ఇప్పటికీ మన సినిమాల్లో కనిపించడం నవ్వొస్తుంది. ఇలాంటి చిన్న చిన్న తప్పులే సినిమాకి తిప్పలు తెచ్చిపెడతాయి. 

ఈ సినిమా హాల్లో రాలేదు కాబట్టి సరిపోయింది..తీరిగ్గా ఇంట్లో కూర్చుని చూసేదే కాబట్టి ప్రేక్షకుల నుంచి పెద్దగా కంప్లైంట్ ఉండదు. ఇదే సినిమా థియేటర్స్ లో రిలీజయ్యుంటే ప్రేక్షకులు డిజపాయింట్ అయ్యుండేవారు. 

బాటం లైన్: ఒరిజినల్ చూడకుండా చూడండప్పా

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా