ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నారు. వివాదాలు, కేసులు లేకపోతే ఆయనకు నిద్రపట్టేలా లేదు. ఈ దఫా ఆయన అశ్లీల చిత్రాల కేసులో అందగత్తె భర్త అరెస్ట్ కావడం సంచలనం రేకెత్తిస్తోంది. జేఎల్ స్ట్రీమ్ యాప్ యజమాని అయిన రాజ్ కుంద్రా ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టీం రాజస్థాన్ రాయల్స్‌కు సహ యజ మాని.
2013లో సంచలనం సృష్టించిన ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ కేసులో రాజ్‌కుంద్రా పేరు ప్రముఖంగా వినిపించింది. అప్పట్లో ఆయన్ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అలాగే బిట్ కాయిన్ కేసులో ఈడీ అధికారులు రాజ్‌కుంద్రాను విచారించారు. సుమారు రూ. రెండువేల కోట్ల విలువైన బిట్ కాయిన్ కుంభకోణంపై ఈడీ అధికారులు రాజ్‌కుంద్రా పాత్రపై దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు అశ్లీల చిత్రాల చిత్రీకరణతో పాటు వాటి డిస్ట్రిబ్యూషన్లో రాజ్‌కుంద్రా పాత్ర ఉందని ముంబయి పోలీసులు పక్కా ఆధారా లతో ఆయన్ని అరెస్ట్ చేశారు. అశ్లీల చిత్రాలను నిర్మించి పలు యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేయడంపై ఫిబ్రవరిలో ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శిల్పాశెట్టి భర్తపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన కుట్రదారుగా రాజ్‌కుంద్రా అనేం దుకు పక్కా ఆధారాలు తమ దగ్గరున్నాయని ముంబయి పోలీస్ కమిషనర్ తెలిపారు.
నటీ నటులను బలవంతపెట్టి నగ్న చిత్రాలను చిత్రీకరించి, వాటిని పెయిడ్ మొబైల్ యాప్స్‌కు అమ్మే ముఠాకు సంబంధించి 9 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు ముంబయి పోలీస్ కమిషనర్ వెల్లడించారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని రాజ్‌కుంద్రా చెప్పడం గమనార్హం. బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నాడు.