సినిమా రివ్యూ: జయసూర్య

రివ్యూ: జయసూర్య రేటింగ్‌: 2.75/5 బ్యానర్‌: సాయిచంద్ర ఫిలింస్‌ తారాగణం: విశాల్‌, కాజల్‌ అగర్వాల్‌, సముద్రఖని, మురళి శర్మ, సూరి, జయప్రకాష్‌, ఆనంద్‌రాజ్‌ నిఖిత తదితరులు సంగీతం: డి. ఇమ్మాన్‌ కూర్పు: ఆంటోనీ ఛాయాగ్రహణం:…

రివ్యూ: జయసూర్య
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌:
సాయిచంద్ర ఫిలింస్‌
తారాగణం: విశాల్‌, కాజల్‌ అగర్వాల్‌, సముద్రఖని, మురళి శర్మ, సూరి, జయప్రకాష్‌, ఆనంద్‌రాజ్‌ నిఖిత తదితరులు
సంగీతం: డి. ఇమ్మాన్‌
కూర్పు: ఆంటోనీ
ఛాయాగ్రహణం: వేల్‌ రాజ్‌
నిర్మాతలు: జి. నాగేశ్వరరెడ్డి, ఎస్‌. నరసింహప్రసాద్‌
కథ, కథనం,దర్శకత్వం: సుశీంద్రన్‌
విడుదల తేదీ: సెప్టెంబర్‌ 4, 2015

ఈతరం తమిళ దర్శకుల్లో 'వెన్నెల కబడ్డీ కుళు', 'నాన్‌ మహాన్‌ అల్ల', 'పాండియనాడు' తదితర చిత్రాలని రూపొందించి తనదైన ముద్ర వేసిన సుశీంద్రన్‌ చిత్రాల్లో 'నా పేరు శివ' తెలుగు ప్రేక్షకులని కూడా బాగా ఆకట్టుకుంది. విశాల్‌తో అతను తీసిన 'పాయమ్‌ పులి' తెలుగులోకి 'జయసూర్య' పేరుతో అనువాదమైంది. సీరియల్‌ మర్డర్స్‌ చేస్తున్న ముఠా గుట్టు చేధించే పోలీస్‌ ఆఫీసర్‌ కథ ఇది. 

ఒక ఊరిలో వ్యాపారస్తులని బెదిరించి వారి నుంచి డబ్బులు డిమాండ్‌ చేసే ఒక ముఠా.. తమ మాటని లెక్క చేయని వారిని చంపేసి ఒక వంతెన కింద పడేస్తుంటుంది. దాంతో భయపడిన మిగిలిన వ్యాపారస్తులు వారు అడిగినట్టు చేస్తారు. ఈ క్రమంలో ఒకసారి ఆ ముఠాపై పోలీసులు ఎటాక్‌ చేస్తే దానికి ప్రతీకారంగా ఒక ఎస్‌ఐని చంపేస్తారు. అండర్‌ కవర్‌లో వచ్చిన ఎసిపి జయసూర్య (విశాల్‌) ఆ ముఠాని మొత్తం ఏరి పారేస్తాడు. కానీ హత్యలు ఆగవు. అందర్నీ మట్టుబెట్టామని అనుకున్న జయసూర్యకి, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కి షాక్‌ తగులుతుంది. తన ఆచూకీ ఏంటనేది అస్సలు తెలీకుండా ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నదెవరు?

సుశీంద్రన్‌ ముద్ర ఈ చిత్రం ద్వితీయార్థంలో కనిపిస్తుంది. ఇంటర్వెల్‌ బ్లాక్‌ చాలా బాగుంది. అక్కడ్నుంచి కథని రసవత్తరంగా నడిపించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. హీరో, విలన్‌ పక్కపక్కనే వుండి ఆపరేట్‌ చేస్తుండడం థ్రిల్లింగా వుంటుంది. మామూలుగా తన చిత్రాల్లో కమర్షియల్‌ అంశాల గురించి పట్టించుకోకుండా వీలయినంత సహజంగా చూపించడానికి ప్రయత్నించే సుశీంద్రన్‌ ఈ చిత్రంలో ఓవర్‌గా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ మీద ఆధారపడ్డాడు. 

ఫలితంగా సీరియస్‌ టోన్‌లో సాగుతున్న సినిమాలో అవసరం లేని పాటలు వచ్చి ఇబ్బంది పెడతాయి. పూజ సినిమాలో విశాల్‌ పక్కనే వుండి కామెడీ చేసి విసిగించిన సూరి ఇందులో కూడా తన 'అతివాగుడు' హాస్యంతో ఇరిటేట్‌ చేస్తాడు. ఫస్ట్‌ హాఫ్‌ అయితే పూర్తిగా ఎయిమ్‌లెస్‌గా సాగిపోతుంది. సన్నివేశాలని సాగదీస్తూ, అసలు కథపై ఫోకస్‌ పెట్టకుండా కాలక్షేపం చేయడంతో 'జయసూర్య' తొలి గంట బాగా ఇబ్బంది పెడుతుంది. విశాల్‌, కాజల్‌పై తీసిన రొమాంటిక్‌ ట్రాక్‌ ఏమాత్రం క్లిక్‌ అవలేదు. అలాగే వ్యాపారస్తులని బెదిరించే సన్నివేశాలు, వారిని విశాల్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తూ పోయే దృశ్యాలు కూడా ఆకట్టుకోలేకపోయాయి. విలన్‌ ఎవరనేది రివీల్‌ అయిన తర్వాతే లైఫ్‌ వస్తుంది. డ్రామా బాగానే పండినా కానీ విలన్‌, హీరో మధ్య మరింత రసవత్తరమైన సన్నివేశాలు పెట్టడానికి వీలున్నా సుశీంద్రన్‌ ఆ దిశగా దృష్టి పెట్టలేదనిపిస్తుంది. సుశీంద్రన్‌ టాప్‌ ఫామ్‌లో ఉన్నట్టయితే ఈ చిత్రం ఇంపాక్ట్‌ మరోలా ఉండేది.

విశాల్‌ పోలీస్‌ పాత్రలో బాగున్నాడు. పతాక సన్నివేశాల్లో విశాల్‌ నటన ఆకట్టుకుంటుంది. కాజల్‌ అగర్వాల్‌ది టిపికల్‌ అమాయక హీరోయిన్‌ క్యారెక్టర్‌. తన వరకు బాగానే చేసింది కానీ దురదృష్టవశాత్తూ ఈ చిత్రంలో తను నటించిన సన్నివేశాలే బోరింగ్‌ పార్ట్‌. సూరి యధావిధిగా కామెడీ పేరుతో విసిగిస్తాడు. సముద్రఖని బాగా చేసాడు. జయప్రకాష్‌, ఆనంద్‌ రాజ్‌ తదితరులు తమ వంతు బాధ్యత నిర్వర్తించారు. 'సంబరం' ఫేమ్‌ నిఖిత ఒక ఐటెమ్‌ సాంగ్‌లో మెరిసింది. 

సుశీంద్రన్‌ అన్ని చిత్రాల్లానే టెక్నికల్‌గా జయసూర్య టాప్‌క్లాస్‌ అనిపిస్తుంది. డి. ఇమ్మాన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకే హైలైట్‌. సౌండ్‌ డిజైన్‌ అద్భుతంగా వుంది. పాటలు ఆకట్టుకోకపోగా అవసరానికి మించి వున్నాయి. ఎడిటింగ్‌ సూపర్బ్‌. ఆ ఫాస్ట్‌ కట్స్‌తో ఆంటోని తన ప్రత్యేకత చాటుకున్నాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా మూడ్‌కి తగ్గ విధంగా లైటింగ్స్‌, టోన్‌, ఫ్రేమింగ్స్‌ అన్నీ పర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. దర్శకుడిగా సుశీంద్రన్‌నుంచి బెస్ట్‌ వర్క్‌ కాదు కానీ మధ్యమధ్యలో తన బ్రిలియన్స్‌ తాలూకు ఫ్లాషెస్‌ కనిపిస్తూనే వుంటాయి. ద్వితీయార్థాన్ని బాగా డీల్‌ చేశాడు. క్లయిమాక్స్‌ ఎమోషనల్‌గా, రియలిస్టిక్‌గా తీశాడు. ఇలాంటి సినిమాలకి కీలకమైన గ్రిప్పింగ్‌ నెరేషన్‌ లేకపోవడంతో జయసూర్య ముఖ్యంగా ప్రథమార్థంలో బోర్‌ ఫెస్ట్‌గా మారింది. 

క్రైమ్‌ డ్రామాలు ఇష్టపడేవాళ్లని ద్వితీయార్థం ఆకట్టుకుంటుంది. కమర్షియల్‌ అంశాల పేరిట సోకాల్డ్‌ కామెడీ, రొమాన్స్‌, సాంగ్స్‌ ఎక్కువైపోయాయి కానీ సెకండ్‌ హాఫ్‌లో మెయింటైన్‌ చేసిన మూడ్‌లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్‌ ఫస్ట్‌ హాఫ్‌లో ఉండి వున్నా 'జయసూర్య' గుర్తుండిపోయే సినిమా అయ్యేది. 

బోటమ్‌ లైన్‌:: ఫస్ట్‌ హాఫ్‌ అపజయం.. సెకండ్‌ హాఫ్‌లోనే సూర్యోదయం!

గణేష్‌ రావూరి