Advertisement

Advertisement


Home > Movies - Reviews

Tillu Square Review: మూవీ రివ్యూ: టిల్లు స్క్వేర్

Tillu Square Review: మూవీ రివ్యూ: టిల్లు స్క్వేర్

చిత్రం: టిల్లు స్క్వేర్ 
రేటింగ్: 2.75/5
నటీనటులు:
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, నేహా శెట్టి, మురళిశర్మ, మురళిధర్ గౌడ్, ప్రిన్స్, అనీష్ కురువిల్ల తదితరులు
సంగీతం: అచ్చు రాజమణి, భీంస్
ఎడిటింగ్: నవీన్ నూలి 
కెమెరా: సాయిప్రకాష్ ఉమ్మడిసింగు 
నిర్మాత: నాగ వంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం: మల్లిక్ రాం
విడుదల: 29 మార్చి 2024

సాధారణంగా సీక్వెల్ అంటే మొదటి భాగానికి కొనసాగింపుగా ఉంటుంది. కానీ గత కొన్నాళ్లుగా సీక్వెల్ పేరుతో పూర్తిగా వేరే కథని చెప్పడం కూడా జరుగుతోంది. కేవలం టైటిల్ ఫ్రాంచైజ్ ని నడిపించడమే ఉద్దేశమే తప్ప మొదటి భాగంలో కథని కొనసాగించడం ఆ చిత్రాల ఉద్దేశం కాదు. ఈ టిల్లు స్క్వేర్ ఆ బాపతు కాదు. ఇది మొదటి భాగానికి కొనసాగింపు కథ. విషయంలోకి వెళ్దాం.

ఒక పార్టీలో టిల్లుకి తప్ప తాగి వాంతిచేసుకుంటూ ఒకమ్మాయి పరిచయమవుతుంది. ఆమె పేరు లిల్లి (అనుపమ). కలిసిన కాసేపట్లోనే ఫ్లర్టింగ్ చేసుకుని మందు మత్తులో ఆ రాత్రి కలిసి గడుపుతారు. కానీ తెల్లారే ముందే అతనికి గుడ్బై నోట్ రాసి వెళ్లిపోతుంది లిల్లి.

లిల్లి కోసం టిల్లు చాలానాళ్లు వెతుకుతాడు.

కొన్ని వారాల తర్వాత ఆమె గర్భవతినయ్యానంటూ ఎదురవుతుంది. జీవితంలో పెళ్లి చేసుకోకూడదనుకున్న టిల్లు.. తప్పేది లేక ఇరు కుటుంబాల ఒత్తిడికి, ఆమె ఏడుపుకి లొంగి పెళ్లికి ఒప్పుకుంటాడు.

ఒక రోజు టిల్లుని ఒక ఫ్లాట్ కి రమ్మని పిలుస్తుంది లిల్లి. ఆమె రోహిత్ (కిరీటి దామరాజు)కి చెల్లెలిని అని చెబుతుంది (ఈ రోహిత్ ఎవరో కాదు.. డీజే టిల్లులో రాధిక చంపేస్తే టిల్లు చేతుల మీదుగా పాతిపెట్టబడిన వాడు).

అక్కడి నుంచి కథ మలుపు తీసుకుంటుంది. ఇంతకీ లిల్లి ఉద్దేశమేంటి? టిల్లు జీవితంలోకి ఎందుకొచ్చింది? వీటి సమాధానాలే తక్కిన కథనమంతా.

ఇక్కడ కథగా చెప్పుకోవాలంటే ఇదే. కానీ నడిపించిన విధానం గురించి మాత్రం చాలా చెప్పుకోవాలి.

సినిమా అంటే రెండు-రెండున్నర గంటల పాటు ప్రేక్షకుల్ని కట్టిపారేయడమే. కథేంటి, పాత్రలేంటి, వాటి ఔచిత్యాలేంటి.. అనేవి చెప్పుకోవడానికి వీల్లేకుండా కేవలం వినోదమే ప్రధానంగా నడిపే కథనాలుంటాయి. డీజే టిల్లు అలాగే సాగింది. ఇది కూడా అంతే.

జానర్ ప్రకారం ఇది క్రైం కామెడీ. క్రైం కదా అని ఎక్కడో అక్కడ సీరియస్నెస్, సెంటిమెంట్ ఉంటాయనుకుంటే పొరపాటే.

అదే సమయంలో హీరో పాత్ర ఎదుర్కునే సమస్యలు, సవాళ్లు..తన జాతకాన్ని తానే తిట్టుకునే విధానం అన్నీ నవ్విస్తాయి, కనెక్ట్ అయ్యేలా చేస్తాయి.

అన్నిటికీ మించి సిద్ధు పాత్రలోని విలక్షణమైన డైలాగ్ డెలివెరీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఎంత స్టైల్ ని అడాప్ట్ చేసుకున్నా ఒక దశలో బోర్ కొట్టడం సహజం. అలా కొట్టకుండా ఉందంటే ఈ స్టైల్ ని సిద్ధు ఎంతెలా ఓన్ చేసుకున్నాడో అర్ధమవుతుంది.

స్క్రిప్ట్ విషయానికొస్తే నిజానికి ఇలా రాసుకోవడం చాలా కష్టం. చాలా డైలాగులు సెట్లో ఇంప్రొవైజ్ చేసారా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ తరహా డైలాగ్స్ స్క్రిప్ట్ రాసుకుని తెరకెక్కించడం అంత సులభం కాదు. పూర్తిగా నటుల టైమింగ్ సెన్స్ ని, డైలాగ్ డెలివరీ స్టైల్ ని దృష్టిలో పెట్టుకుని మలచుకోవాలి. ఆ విషయంలో రైటింగ్ టీం ని మెచ్చుకోవాలి.

కథ చెప్పడం కన్నా నవ్వించడం మీదే ఫోకస్ పెట్టడం, దాని కోసం పూర్తిగా సిద్ధు పర్ఫామెన్స్ మీదే ఆధారపడడం జరిగింది.

యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన ఈ చిత్రంలో అక్కడక్కడ కొన్ని ఆకట్టుకునే మొమెంట్స్ ఉన్నాయి.

ఉదాహరణకి లిల్లి పాత్ర తన అసలు రూపాన్ని రివీల్ చేస్తున్నప్పుడు ప్లే చేసిన చంద్రముఖి మ్యూజిక్ ట్రాక్ వినోదభరితంగా ఉంది.

అలాగే సాగరసంగమం ట్రాక్ వినిపించే సీన్ మొత్తం నవ్విస్తుంది.

కొన్ని చోట్ల ఒక వన్ లైనర్ కి నవ్వడం పూర్తవకుండానే ఇంకో వన్ లైనర్ పేల్చడం వల్ల నవ్వుల మధ్య అది వినపడకుండా అయింది. అలా నాన్ స్టాప్ హ్యూమర్ అందించేందుకు చాలా కష్టపడ్డారు.

ఇలా పాజిటివ్స్ ఎన్ని చెప్పుకున్నా నెగటివ్స్ కూడా లేకపోలేదు. అవేంటంటే ప్రధానంగా మొనోటనీ. డీజే టిల్లు వచ్చినప్పుడు ఆ తరహా నెరేషన్ పూర్తిగా ఫ్రెష్. కానీ అది చూసేసాక మేకింగ్ స్టైల్లో ఫ్రెష్నెస్ ఫీలయ్యే అవకాశం ఉండదు కదా!

మరో విషయం ఏంటంటే "డీజే టిల్లు" లో ఉన్న హీరోయిన్, కథ ఇక్కడ మారాయి తప్ప ఇంటర్వెల్ వరకు టెంప్లేట్ మాత్రం పూరిగా అదే.

యూత్ సినిమా అంటే మనసుకి హత్తుకునే లవ్ ట్రాక్ ఉండాలని కొందరు కోరుకోవచ్చు. అలా కోరుకునే వాళ్లకి మాత్రం నిరాశ ఎదురవ్వచ్చు. కామం, కామం వెనుక మోసం తప్ప ఇందులో లవ్ ట్రాక్ అనేది లేదు.

టెక్నికల్ గా సినిమా పాసయ్యింది. పాటలు సందర్భోచితంగా వస్తూ ఎనెర్జీ నింపాయి. వినడానికి బాగున్నాయి. నేపథ్య సంగీతం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. ఎక్కడా డల్ మొమెంట్స్ లేవు. కెమెరా, ఎడిటింగ్ అన్నీ బాగున్నాయి. నిడివి 2 గంటల 16 నిమిషాలే కాబట్టి మొనోటనీ ఉన్నా మరీ భారంగా అనిపించదు.

డైలాగ్స్ పరంగా కొన్ని ఆకట్టుకుంటాయి:

- అమ్మ అస్మంటి అమ్మాయిలు లేరు బయట... అమ్మేసే అమ్మాయిలున్నారు

- నా నొప్పి దాచుకోవడానికి నేను నవ్వుతున్నాను.. నీ తప్పు దాచుకోవడానికి నువ్వు ఏడుస్తున్నావ్

- అమాంతం మింగి అస్తిపంజరాన్ని ఊసేస్తుంది.

- ఈ హరాస్మెంట్ నుంచి సిక్ లీవ్ కావాలి.

..వంటివి సందర్భోచితంగా సిద్ధు టైమింగులో వినడానికి బాగున్నాయి.

ఈ సినిమాకి షో రన్నర్ సిద్ధూయే. తన వన్ లైనర్స్ తో అదరగొట్టేసాడు. పూర్తిగా నమ్మి అతని మీద డిపెండ్ అయిపోయినందుకు సినిమాని నిలబెట్టాడు.

అనుపమ పరమేశ్వరన్ తన రొటీన్ ఇమేజ్ కి విరుద్ధంగా కాస్త గీత జరుపుకుని నటించింది. మూతిముద్దుల్లో జీవించినంత పని చేసింది. ఆమె క్యారెక్టర్ కి గ్రాఫ్ ఉన్నా ఈ పాత్ర ఆమె కెరీర్ కి ఎంతవరకు పనికొస్తుందనేది అనుమానమే. 

నేహాశెట్టి చివర్లో కాసేపు కనిపించి చప్పట్లు కొట్టించుకుంది.

మురళిశర్మది రెండు మూడు సన్నివేశాల్లో కనిపించే గెస్ట్ రోల్ లాంటిది. టిల్లు తండ్రిగా చేసిన మురళిధర్ గౌడ్ కనిపించినంత సేపూ నవ్వించాడు. ప్రిన్స్ పాత్ర ఒక్కటీ లౌడ్ గాను, వీక్ గానూ ఉంది. ఒకే ఒక్క షాట్ లో మాత్రం బ్రహ్మాజి కనిపించాడు. 

"డీజే టిల్లు" హిట్టవడంతో ఆ ఫ్రాంచైజ్ ని క్యాష్ చేసుకునే ఉద్దేశంతో తీసుకున్న సీక్వెల్ ఇది. టార్గెట్ ఆడియన్స్ లో అధికశాతం మందిని ఇది నిరాశపరచదు. డైలాగుల్లోను, సీన్స్ లోనూ కాస్తంత అడల్ట్ కంటెంట్ ఉన్నా ఈ టార్గెట్ ఆడియన్స్ కి అది యాక్సెప్టెబుల్ లిమిట్లోనే ఉందనుకోవాలి. వన్ లైనర్ డైలాగ్స్ ని ఎంజాయ్ చేయడానికి, ఒక చిన్నపాటి క్రైం కహానీని కామెడీ ఫ్లావర్ తో చూడ్డానికి బాగానే ఉంటుంది. సినిమా పూర్తయ్యాక గుర్తున్న అంశాలు రెండు చెప్పమంటే "అనుపమ ముద్దు", "నటనతో ఆకట్టుకున్న సిద్ధు" అని చెప్పొచ్చు.

బాటం లైన్: అనుపమ ముద్దు- అకట్టుకున్న సిద్ధు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?