చిరంజీవి-కొరటాల శివ సినిమా మేటర్ ఇది. ఈ మూవీని సరిగ్గా వంద రోజుల్లో కంప్లీట్ చేసేలా కొరటాల నుంచి మాట తీసుకున్నారు చిరంజీవి. అది కూడా ఆఫ్ ది రికార్డ్ కాదు. నిండు సభలో ప్రేక్షకులు, స్టార్స్ అందరి ముందు ఈ వాగ్దానం తీసుకున్నాడు. అలా కొరటాలను చిరంజీవి లాక్ చేయగలిగారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఈ సినిమా 100 రోజుల్లో పూర్తవుతుందా అనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు అభిమానులు.
ఎందుకంటే, చిరంజీవి-కొరటాల సినిమాలోకి కొత్తగా మహేష్ వచ్చి చేరాడు. ఓ కీలక పాత్ర కోసం మహేష్ ను ఒప్పించగలిగారు మేకర్స్. మహేష్ రాకతో మూవీ బడ్జెట్ బాగా పెరిగింది. ఈ సంగతి పక్కనపెడితే.. మహేష్ రాక సందర్భంగా అప్పటి వాగ్దానాన్ని మరోసారి తెరపైకి తీసుకొస్తున్నారు మెగా ఫ్యాన్స్. సినిమా వంద రోజుల్లో పూర్తవుతుందా అని ప్రశ్నిస్తున్నారు.
నిజానికి వంద రోజుల వాగ్దానానికి, మహేష్ ఎంట్రీకి సంబంధం లేదు. మహేష్ కేవలం 20-25 రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోతుంది. ఇదే పాత్రను రామ్ చరణ్ తో చేయించినా దాదాపు ఇన్నే కాల్షీట్లు అవుతాయి. కాబట్టి వంద రోజుల వాగ్దానాన్ని మహేష్ డిస్టర్బ్ చేయడు. తన పార్ట్ పూర్తిచేసి ఎంచక్కా తప్పుకుంటాడు. ఎటొచ్చి మిగిలిన రోజుల్లో చిరంజీవితో కొరటాల సినిమాను పూర్తిచేయగలడా లేదా అనేది క్వశ్చన్ మార్క్.
చెప్పుకోవడానికి చాన్నాళ్లు టైమ్ ఉన్నట్టు అనిపించినా వంద రోజుల గడువులో ఆల్రెడీ 50 రోజులు పూర్తయిపోయాయి. మహేష్ రాకముందే సగం రోజులు అయిపోయాయి. ఇప్పుడు మహేష్, చిరంజీవితో కలుపుకొని మిగిలిన ఈ 50 రోజుల్లో సినిమాను పూర్తిచేయాలి. నిజంగా వంద రోజుల టార్గెట్ ను కొరటాల సీరియస్ గా తీసుకుంటే, అతడికి ఇది రిస్క్ టాస్కే అవుతుంది.