ఇప్పటికే రాజ్యసభకు ఎన్నికైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వీళ్ల రాజీనామాలను మండలి చైర్మన్ వెంటనే ఆమోదించేశారు కూడా. ఈ క్రమంలో వారి రాజీనామాల వల్ల రెండు సీట్లు ఖాళీ అయినట్టుగా కూడా ప్రకటించేశారు. అంటే.. త్వరలో వీటి భర్తీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉండవచ్చు! మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్.. ఇద్దరూ ఏపీ శాసనసభ కోటాలో ఎమ్మెల్సీ పదవులు పొందిన వారే. ఈ నేపథ్యంలో ఆ రెండు సీట్లూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సొంతం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే వాటి భర్తీ కూడా ఉండవచ్చని స్పష్టం అవుతోంది.
మండలి రద్దు అంశం ఢిల్లీలో పెండింగ్ లో ఉన్నట్టే, అయితే మండలి రద్దు విషయంలో జగన్ ప్రభుత్వం పునరాలోచనలో ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఇప్పటికిప్పుడు ఏదీ జరిగేలా లేదు. ఈ క్రమంలో ఆ రెండు ఎమ్మెల్సీ పదవుల భర్తీ కూడా ఉండవచ్చు.
రెండు మంత్రి పదవులు ఖాళీ అవుతున్నాయి, రెండు ఎమ్మెల్సీ పదవులూ ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవి ఎవరికి లభిస్తాయనేది ఆసక్తిదాయకమైన అంశం. బీసీ కోటాలో, జగన్ విధేయ కోటాలో సుభాష్ చంద్రబోస్, మోపిదేవిలు ఈ పదవులను సొంతం చేసుకున్నారు. వారికి రాజ్యసభ సభ్యత్వం ద్వారా జగన్ మరింత ప్రాధాన్యతను ఇచ్చినట్టుగా అయ్యింది. బీసీ కోటా, జగన్ విధేయ కోటాకు అలా లోటేమీ జరగలేదు.
ఇక ఇప్పుడు మంత్రి పదవుల విషయంలో జగన్ ప్రాధాన్యతలు ఫ్రెష్ గా ఉన్నట్టే. ఏడాది పాలనలో తన పార్టీ లో మంత్రి పదవులు దక్కని ఆశావహులపై, ఉత్సాహవంతుల విషయంలో ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. అలాగే ఎమ్మెల్సీ పదవుల విషయంలో కూడా ఆశావహులపై జగన్ కు మించి క్లారిటీ మరెవరికీ ఉండకపోవచ్చు. ఇంతకీ ఆ పదవులు ఎవరికి అనేదే ఆసక్తిని రేపుతున్న అంశం.