తొలిదఫా అధికారంలోకి వచ్చాక నోట్ల రద్దుతో సంచలనం సృష్టించిన మోదీ సర్కారు రెండో దఫా ప్రైవేటీకరణలతో విజృంభిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి వ్యవహారాలు ఇప్పటికే ఏపీలో మంటలు రేపుతుండగా.. ఇలాంటివన్నీ మాకు మామూలే అన్నట్టుగా ముందుకెళ్తున్నారు మోదీ. ఇక బ్యాంకింగ్ రంగంలో మోదీ దూకుడు చూస్తుంటే ఉద్యోగులు బిక్కచచ్చిపోతున్నారు.
ప్రభుత్వరంగ బ్యాంకుల్ని వరుసబెట్టి ప్రైవేటుపరం చేస్తూ విలీనాలకు సిద్ధపడుతూ మోదీ ప్రభుత్వం పలు కీలక, సంచలన నిర్ణయాల్ని ఇప్పటికే తీసుకుంది, అమలులో పెట్టింది. తాజాగా మరో రెండు బ్యాంకుల్ని ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమవుతోంది.
బ్యాంకుల్ని ప్రైవేటీకరిస్తే ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడటమే కాదు, బ్యాంకింగ్ వ్యవహారాలన్నీ వినియోగదారులకు భారంగా మారడం ఖాయం. అయితే ఎన్డీఏ సర్కారు మాత్రం సంస్కరణల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటోంది. తాజాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల్ని ప్రైవేటీకరించేందుకు రంగం సిద్ధమైంది.
ఈ ప్రైవేటీకరణ వ్యవహారానికి అడ్డులేకుండా వచ్చే వర్షాకాల సమావేశాల్లో 'బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ అండ్ బ్యాంకింగ్ లా' చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేయాలని భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే రెండు బ్యాంకుల్ని ప్రైవేటీకరించాలనుకుంటున్నట్టు గత బడ్జెట్ సమావేశాల్లో పేర్కొన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా కొత్త ప్రభుత్వ రంగ సంస్థల విలీనం విషయంలో నీతి ఆయోగ్ సిఫార్సులు చేయాల్సి ఉంటుంది. ఈసారి మాత్రం ప్రభుత్వమే వీటిని ప్రైవేటీకరించేలా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
నోట్ల రద్దు వ్యవహారంతో ఇప్పటికే అప్రతిష్ట మూటగట్టుకున్నారు మోదీ. అయితే సరిగ్గా 2019 ఎన్నికలనాటికి జరిగిన అనేక పరిణామాలు మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా మారాయి. ఈ దఫా ప్రభుత్వ రంగ బ్యాంకులతో చేస్తున్న ప్రయోగాలు 2024నాటికి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెంచే ప్రమాదం ఉందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా కట్టడి వైఫల్యాలకు.. ఈ ప్రైవేటీకరణ కూడా తోడైతే మోదీకి వచ్చే ఎన్నికల్లో కష్టమే.