మన పాలకులకు, రాజకీయ నాయకులకు కొంచమైనా సోయి ఉండదు. ముందు చూపు అసలే ఉండదు. ముందు చూపు పూర్తిగా ఉండదని కాదు. తప్పనిసరిగా ఉంటుంది. అది ఓట్లు దండుకోవడానికి ఎలాంటి ప్లాన్స్ వేయాలనే విషయంలో ఉంటుంది. ఏం మాయమాటలు చెప్పి ప్రజలను ఆకట్టుకోవాలనే విషయంలో ఉంటుంది. ఎలాంటి తాయిలాలు ఇస్తే ప్రజలు బానిసలుగా పడి ఉంటారనే విషయంలో తప్పకుండా మూడు చూపు ఉంటుంది. కానీ ప్రజల ఆరోగ్యం విషయంలో ముందు చూపు నిల్.
సెకండ్ వేవ్ కరోనాలో (ఇంకా కొనసాగుతూనే ఉందనుకోండి ) ప్రభుత్వాలు ఎంత గందరగోళం సృష్టించాయో చూసాం. కోర్టులు నానా చీవాట్లు పెట్టాయి. బెడ్లు దొరక్క, ఆక్సిజన్ దొరక్క, వ్యాక్సిన్లు దొరక్క జనం అనేక ఇబ్బందులు పడ్డారు. సాధారణంగానే కరోనా విషయంలో ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. పదిమంది కరోనా అంటించుకున్నా అది లక్షమందికి వ్యాప్తి చెందడం పెద్ద కష్టం కాదు. తెలంగాణలో నిన్న ఆదివారం లాక్ డౌన్ ఎత్తేసిన సంగతి తెలిసిందే కదా. మొత్తం నిబంధనలు ఎత్తేసి, అన్నింటిని తెరిచేసి స్వేచ్ఛగా బతుకు పోండి అన్నాడు కేసీఆర్.
కానీ జాగ్రత్తగా ఉండాలన్నారు. మాస్కులు పెట్టుకోవాలన్నారు, శానిటైజర్ వాడాలన్నారు. భౌతిక దూరం పాటించాలన్నారు. ఇలాంటి జాగ్రత్తలన్నీ చెప్పారు. బాగానే ఉంది. లాక్ డౌన్ ఎత్తేస్తే కరోనా పోయినట్లు కాదు కదా. ప్రజలకు ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చింది గానీ కరోనా ఇవ్వలేదు. అంటే జాగ్రత్తగా ఉండాలని అర్ధం కదా. కానీ కేసీఆర్ చెప్పిన ఒక విషయం ప్రజలకు తప్పుడు సందేశం ఇచ్చింది. భారీగా ఏవైనా కార్యక్రమాలు అంటే ఫంక్షన్లు చేసుకోండి అన్నట్లుగా ఉంది.
సోయి ఉండి మాట్లాడుతున్నావా అనడం కేసీఆర్ ఊతపదం. ఇప్పుడు ఇదే ఆయనకూ వర్తిస్తుంది. ఇంతకూ అసలు విషయమేమిటంటే …కేసీఆర్ రేపు అంటే 22 న వాసాలమర్రి అనే ఊరికి వెళుతున్నాడు. ఇది ఆయన దత్తత గ్రామమట. ఆ ఊరి సర్పంచుతో రెండు రోజుల కిందట ఫోన్ లో మాట్లాడారు కేసీఆర్.
0ఆయన ఏమన్నారు ? ఆరోజు ఊరంతటికి నేనే భోజనం పెడతా. జనాలతో కలిసి నేనూ తింటా అన్నారు. ఊరి జనాభా ఎంత ఉంటుందని కేసీఆర్ అడగ్గా 2600 అని సర్పంచ్ చెప్పాడు. 3000 మందికి వండితే సరిపోతుంది కదా అనే కేసీఆర్ అడిగారు. సరిపోతుందని సర్పంచ్ చెప్పాడు. వంట వాళ్ళు కూడా కేసీఆర్ వెంటే వస్తారట. సో … ఆ ఊళ్ళో 3 వేల మందికి భోజనాలు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దీని అర్ధం ఏమిటి ?
జనం కూడా భారీగా ఫంక్షన్లు చేసుకోవడానికి, ఆ ఫంక్షన్లకు భారీగా జనం రావడానికి అనుమతించినట్లే కదా. పెళ్ళికి 50 మందే రావాలని, అంత్యక్రియలకు 20 మందికి మించకూడదని పెట్టిన నిబంధన ఏమైంది? లాక్ డౌన్ తో దాన్ని కూడా ఎత్తేసినట్లేనా ? లాక్ డౌన్ తో కరోనా పోయిందని జనం అర్ధం చేసుకోవాలా? సినిమాహాళ్లు తెరిచారు. పబ్బులు తెరిచారు. క్లబ్బులు తెరిచారు. మందు షాపులు తెరిచారు. మాల్స్ తెరిచారు.
వీటికి పోటెత్తే జనం నిబంధనలు కచ్చితంగా పాటిస్తారా ? ఇప్పుడు ఫంక్షన్లు కూడా భారీగా చేసుకోండి ఏం పర్వాలేదు అంటే కరోనా మళ్ళీ విజృంభించదనే గ్యారంటీ ఉందా ? జనాలకు ఎలాగూ సోయి ఉండదు. కేసీఆర్ కూ సోయి లేకపోతే ఎలా ? కేసీఆరే భారీగా ఫంక్షన్ చేస్తున్నప్పుడు జనం చేయకుండా ఎందుకుంటారు ? వారిని వద్దని చెప్పే హక్కు పాలకులకు ఎక్కడ ఉంటుంది ?