బీజేపీ అని షార్ట్ ఫార్మ్ లో అంటారు. కానీ అసలు పేరు భారతీయ జనతా పార్టీ అని అందరికీ తెలిసిందే. దానికి ఆంధ్రా మేధావుల ఫోరం ప్రెసిడెంట్ చలసాని శ్రీనివాస్ ఆ పార్టీకి కొత్త పేరు పెట్టారు. ఉత్తర భారతీయ జనతా పార్టీ అని చాలా ముద్దుగానే పిలుస్తున్నారు.
తెలుగు వారికి కేంద్ర బీజేపీ పెద్దలు అన్యాయం చేస్తున్నారు అని చలసాని మండిపడ్డారు. ఒకనాడు దేశంలోని ఎనిమిది రాష్ట్రాలను తెలుగు వారు పాలించారని, ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క కేంద్ర మంత్రి కూడా క్యాబినెట్ లో లేడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో మంత్రిగా పనిచేయడానికి తెలుగువారు తగరా మోడీజీ అంటూ గట్టిగానే మాట్లాడారు.
అంతే కాదు, దేశంలోని పలు రాష్ట్రాలలో వంద ఆక్సిజన్ ప్లాంట్లను కేంద్రం పెడుతోందని, రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఒక్కటంటే ఒక్క ప్లాంట్ కూడా ఎందుకు పెట్టరని ఆయన నిలదీశారు. అన్నీ గుజరాత్ కే అన్నట్లుగా కేంద్రం అభివృద్ధిని తీసుకుపోతోందని ఆయన ఫైర్ అయ్యారు.
ఏపీలో విజయవాడ, విశాఖపట్నాలకు ఎందుకు మెట్రో రైళ్ళు ఇవ్వరని చలసాని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో తాము కచ్చితంగా కేంద్రం మీద యుద్ధం చేస్తామని ఆయన ప్రకటించారు.
ఏపీకి అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోమని అంటున్న చలసాని ఏపీలోని అధికార విపక్షాలు కూడా కలసికట్టుగా ఉత్తర భారతీయ జనతా పార్టీ వివక్ష మీద పోరాడాలని కోరుతున్నారు.