21 రోజులు కర్ఫ్యూ-మరో కోణం

కరోనా రక్కసిని అరికట్టడానికి మరో మార్గం లేదు. విస్తరించకుండా నివారించడం ఒక్కటే మార్గం. సువిశాలమైన, వంద కోట్ల జనాభా వున్న ఈ భారత దేశంలో అలా నివారించడం అంటే కఠిన చర్యలకు ఒడిగట్టడం ఒక్కటే…

కరోనా రక్కసిని అరికట్టడానికి మరో మార్గం లేదు. విస్తరించకుండా నివారించడం ఒక్కటే మార్గం. సువిశాలమైన, వంద కోట్ల జనాభా వున్న ఈ భారత దేశంలో అలా నివారించడం అంటే కఠిన చర్యలకు ఒడిగట్టడం ఒక్కటే మార్గం. కాస్త చనువిస్తే చంకనెక్కి కూర్చుంటారు జనం. చదువుకున్నవారు, విదేశాల నుంచి వచ్చిన తరువాత కొన్ని రోజలు ఒంటరిగా వుండాలి అన్నఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించి, దేశంలో ఈ పరిస్థితి తీసుకువచ్చారు. అందుకే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలకు ఉపక్రమించాయి. 

ఇదంతా కరోనా కర్ఫ్యూ నాణానికి ఒకవైపు.

ఇక మరో వైపు చూద్దాం. మనదేశంలో సంపదం అంతా కొద్ది మంది దగ్గరే పోగుపడింది. వంద కోట్ల జనాభాలో రెక్కాడితే కానీ డొక్కాడని వారే అధికం. నో వర్క్ నో పే అని సింపుల్ అనేసే బిజినెస్ వర్గం వున్నదేశం ఇది. లేదూ అంటే కరోనా తగ్గిన తరువాత రండి, పనిలోంచి తీసేసాం అనేయగల అవకాశం వున్నదేశం ఇది.

పట్టుమని పది రోజులు ఇసుక లభ్యం కాకుంటే, మీడియాలో నానా రభస జరిగిపోయింది. ఆత్మహత్యలు పతాక శీర్షికల్లో కనిపించాయి. రోజు వారీ కార్మికుల కష్టాలు ఇన్నీ అన్నీ కాదు. మరి ఇప్పుడు దాదాపు మూడు వారాల పాటు నిర్మాణ కార్యక్రమాలు అన్నీ బంద్ అయిపోతాయి. రోజుకు మేస్త్రీ 700 వందలు, మగ కూలీ 400 వందలు, ఆడ కూలీ 200 వందలు తెచ్చుకుంటారు ఆంధ్ర రాష్ట్రంలో. 21 రోజులకు గాను 1000 రూపాయిలు ఇచ్చి, బియ్యం ఇస్తే ఏం చేసుకోవాలి? అసలు సరుకులే దొరకడం లేదు. రేట్లు ఆకాశానికి అంటుకున్నాయి. ప్రభుత్వాలు ఈ విషయంలో వార్నింగ్ లు ఇస్తున్నాయి తప్ప, రేట్ల పెంపును అదుపు చేయడం లేదు. మరి ఇలాంటి తరుణంలో రోజు వారీ కార్మికులు ఎలా బతకాలి మూడు వారాల పాటు.

చాలా దుకాణాలు, థియేటర్ల యజమానులు సగం జీతం ఇస్తామని, లేదా అస్సలు ఇప్పుడు అసలు పనివారే అవసరం లేదని చెప్పేస్తున్నారు. లాడ్జీలు మూత పడ్డాయి. హోటళ్లు మూత పడ్డాయి. వీటిల్లో పని చేసే సిబ్బంది రోడ్డున పడ్డట్లే. వీరే కాదు హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, రైతు కూలీలు, థియేటర్ల వర్కర్లు ఇలా ఒకరేమిటి?

కరోనా నివారణకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది. కానీ అదే సమయంలో మన దగ్గర వెంటిలేటర్లు లేవు, సరిపడా పడకలు లేవు, టెస్టింగ్ కిట్ లు లేవు. ఇవన్నీ లేవు కనుక, కరోనా వ్యాపిస్తే మనం కంట్రోలు చేసే పరిస్థితి లేదు. అందువల్ల ఈ కఠిన చర్యలు తప్ప మరో మార్గం లేదు. అన్నది ప్రభుత్వ ఆలోచన కావచ్చు. 

కానీ 21 రోజులు కామన్ మాన్ బందీగా ఇంటిలో వుండిపోతే పరిస్థితులు ఎలా వుంటాయన్నది కూడా ఆలోచించాలి. ఫస్ట్ తారీఖు వస్తే అద్దె ఇవ్వాలి. అంతెందుకు కరెంటు బిల్లులు మినహాయింపు ఇస్తుందా ప్రభుత్వం? వాటి గురించి మాత్రం మాట్లాడరు. 

ఏప్రియల్ 15తో ఇధి ముగుస్తుందని అనుకోవడానికి లేదు. అలా ముగియకపోతే, దేశంలో అన్ని విధాలా ఎమర్జన్సీ విధించాల్సిన పరిస్థితి వస్తుందేమో?

ఆర్మీని తెచ్చి.. షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇస్తాం

రోజా దంపతుల రుద్రాభిషేకం