కో వ్యాగ్జిన్ వాళ్లు పిల్లల కోసమంటూ ప్రత్యేక వ్యాక్సిన్ డోసును తయారు చేశారు. ప్రస్తుతం ఇది క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. ప్రయోగాత్మకంగా కొందరు పిల్లలపై దీన్ని వేసి.. ఫలితాలను గమనించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ట్రయల్స్ వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఈ క్రమంలో మైసూర్ లోని ఒక పాఠశాలను ట్రయల్స్ కోసం ఎంపిక చేసుకున్నారు.
పాఠశాలలోని పిల్లలందరికీ వ్యాక్సిన్ వేయడానికి కాదు. ముందుగా.. వివిధ తరగతులు- వయసుల్లోని రెండు వందల మంది పిల్లలను ఎంపిక చేసుకున్నారు. వారిలో అన్ని రకాల సమ్మతీ పొంది ఏ ఒకరిద్దరి మీదో ప్రయోగాలు చేయాలనేది వారి ఉద్దేశం కావొచ్చు. అయితే ముందుగా 200 మంది విద్యార్థులనూ పరిగణనలోకి తీసుకున్నారు. వారందరికీ ఉమ్మడిగా ఒక టెస్టును నిర్వహించారు.
అదే.. యాంటీ బాడీస్ టెస్ట్. వాళ్లలో ఎవరికైనా కరోనా వచ్చి – వెళ్లిపోయిందా అనే అంశం గురించి తెలుసుకోవానికి యాంటీ బాడీస్ టెస్టు చేశారు. అక్కడే ఒక షాకింగ్ ఫ్యాక్ట్ బయటపడింది. రెండు వందలమంది వివిధ వయసుల పిల్లలకు యాంటీ బాడీస్ టెస్టు నిర్వహిస్తే.. వారిలో ఏకంగా 112 మందికి కరోనా యాంటీ బాడీస్ టెస్టులో పాజిటివ్ రిజల్ట్ వచ్చిందట!
వారందరీలోనూ కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలు ఉన్నాయని ఈ అధ్యయనం చెబుతోంది! అంటే వారందరికీ ఇప్పటికే కరోనా వచ్చి -వెళ్లిపోయింది! కరోనా వైరస్ వారికి సోకడం వల్లనే యాంటీ బాడీలు ఏర్పడతాయని వేరే చెప్పనక్కర్లేదు. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. వారిలో సింప్టమాటిక్ గా కరోనా బయటపడిన వారి సంఖ్య చాలా తక్కువట! యాంటీ బాడీస్ టెస్టు పాజిటివ్ గా తేలిన పిల్లల తల్లిదండ్రులను ఈ విషయంలో వాకబు చేయగా.. తమ పిల్లలకు ఎలాంటి సిప్టమ్స్ లేవని చాలా మంది స్పష్టం చేశారట.
అంటే ఎలాంటి సింప్టమ్స్ లేకుండానే చాలా మంది పిల్లలకు కరోనా వచ్చి వెళ్లిపోయిందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన రాష్ట్రాల్లో ఒకటి కర్ణాటక. అలాంటి చోట ఒక నగరంలో.. ర్యాండమ్ గా 200 మంది పిల్లలకు యాంటీ బాడీస్ టెస్టు చేస్తే.. ఏకంగా 112 మంది పాజిటివ్ గా తేలడం ఆసక్తిదాయకమైన అంశమే.
దాదాపు 50 శాతం మందికి పైగా పిల్లల్లో కరోనాను ఎదుర్కొన గల యాంటీబాడీలు తయారయ్యాయని ఇలా ఒకింత స్పష్టత వస్తోంది. ఇది ర్యాండమ్ గా జరిగిన అధ్యయనం కాబట్టి.. దేశం మొత్తానికీ కూడా దీన్ని అన్వయించడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. ఈ అంశం గురించి మరిన్ని టెస్టులు జరిగితే.. పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరో విషయం ఏమిటంటే.. యాంటీ బాడీస్ టెస్టులో పాజిటివ్ గా తేలిన పిల్లలకు ఎలాంటి వ్యాక్సిన్ అవసరం లేదని కూడా పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. పెద్దల్లో ఆల్రెడీ ఒక సారికి కరోనా సోకిన వారికి కూడా వ్యాక్సిన్లను సజెస్ట్ చేస్తున్నారు కానీ, యాంటీ బాడీస్ టెస్టులో పాజిటివ్ గా వచ్చిన పిల్లలకు మరే వ్యాక్సిన్ అవసరం లేదని కొందరు పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
ఇక పీడియాట్రిక్ వ్యాక్సిన్ ట్రయల్స్ విషయంలో కూడా యాంటీ బాడీస్ టెస్టులో పాజిటివ్ గా తేలిన పిల్లలపై ప్రయోగాలు నిర్వహించకూడదని కో వ్యాగ్జిన్ నిర్ణయించిందట.