గుంటూరులో నిన్న నడిరోడ్డుపై బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకు గురి కావడంపై సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంది. ఇదే సమయంలో రమ్య మృతిపై విపక్షాలు నడిరోడ్డుపై నిస్సిగ్గుగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడడం విమర్శలకు దారి తీసింది. ప్రేమోన్మాది పాశవిక చర్యలను ఏ ప్రభుత్వమైనా సమర్థిస్తుందా? అలాంటి ఘటనలపై ఉదాసీనంగా వ్యవహరిస్తుందా? అధికారం లో ఏ పార్టీ ఉన్నా సీరియస్‌గా స్పందిస్తుందనేది జగమెరిగిన సత్యం.
రమ్య హత్యను జగన్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇదే సందర్భంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచింది. నిందితులకు కఠిన శిక్ష పడేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. తెలంగాణలో మాదిరిగా నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితను బాధితురాలి తల్లిదండ్రులు కోరారు.
రమ్య కుటుంబ సభ్యులను జీజీహెచ్‌లో కలిసిన ఆమె ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చెక్కు అందజేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో జీజీహెచ్ నుంచి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు.
ఈ ఘటన నుంచి రాజకీయ ప్రయోజనాలను పొందే క్రమంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ డ్రామాకు తెరలేపింది. తమ కూతురి శవాన్ని ఇంటికి తీసుకెళుతున్న కుటుంబ సభ్యులను టీడీపీ నేతృత్వంలో కొన్ని ప్రజా, దళిత సంఘాలు అడ్డుకోవడం గమనార్హం.
ఎక్కడైనా బాధితులు ఏదైనా డిమాండ్‌తో మృతదేహాన్ని తరలించేది లేదని భీష్మిస్తే, దానికి మద్దతు తెలిపితే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ బాధితులు ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుని కూతురి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు సిద్ధమైన నేపథ్యంలో ప్రతిపక్షాల ఆందోళన ఏంటో ఎవరికీ అర్థం కాదు.
ఇదంతా పొలిటికల్ స్టంట్ అనే విమర్శలు లేకపోలేదు. రమ్యను చంపిన యువకుడిని కఠినంగా శిక్షించాలని విపక్షాల నేతలు డిమాండ్ చేశారు. అధికార పార్టీ కూడా అదే డిమాండ్ చేస్తున్నప్పుడు, ఇక సమస్య ఎక్కడ? చివరికి ఆందోళనకారులను చెదరగొట్టి పరమయ్యగుంటలోని రమ్య నివాసానికి మృతదేహాన్ని తరలించారు. జీజీహెచ్ వద్ద అధికార, ప్రతిపక్ష పార్టీలు తలప డడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం చెప్పుకోవచ్చు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే యువకుల మనస్తత్వంలో మార్పు తీసుకురావాలి. వారిలోని ఆటవిక లక్షణాలను చంపేయాల్సిన అవసరం ఉంది. నేరాల కట్టడికి వ్యక్తుల హత్య ఎప్పటికీ పరిష్కారం కాదని అనేక సంఘటనలు మనకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. మళ్లీ అదే డిమాండ్‌తో ఆందోళనలు చేపట్టడం కేవలం రాజకీయ ప్రయోజనాలకే తప్ప మరొకటి కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.