వైఎస్ కుటుంబ పెద్దాయ‌న్ను విచారిస్తున్న సీబీఐ

మాజీ మంత్రి, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సీబీఐ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. 71వ రోజు విచార‌ణ సాగిస్తోంది. ఈ క్ర‌మంలో వైఎస్ కుటుంబంలో పెద్దాయ‌న‌గా పేరున్న‌, అలాగే ప్ర‌స్తుత…

మాజీ మంత్రి, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సీబీఐ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. 71వ రోజు విచార‌ణ సాగిస్తోంది. ఈ క్ర‌మంలో వైఎస్ కుటుంబంలో పెద్దాయ‌న‌గా పేరున్న‌, అలాగే ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ పెద‌నాన్న వైఎస్ ప్ర‌కాశ్‌రెడ్డిని మొట్ట‌మొద‌టి సారిగా సీబీఐ విచార‌ణ‌కు పిల‌వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

పులివెందుల ఆర్అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో సోమ‌వారం సీబీఐ విచార‌ణ‌కు ప్ర‌కాశ్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. వైఎస్ కుటుంబంలో అంద‌రి కంటే పెద్ద వ‌య‌స్కుడు వైఎస్ ప్ర‌కాశ్‌రెడ్డి. వృత్తిరీత్యా వ్యాపారి. ఆయ‌న మాట‌కు వైఎస్ కుటుంబంలో ప్ర‌తి ఒక్క‌రూ గౌర‌వం ఇస్తారు. 

వైఎస్ కుటుంబంలో అంత‌ర్గ‌తంగా స‌మ‌స్య‌లేవైనా వ‌స్తే… ఆయ‌నే ప‌రిష్క‌రిస్తార‌ని స‌మాచారం. వైఎస్ జ‌గ‌న్ పులివెందుల‌కు ఎప్పుడెళ్లినా… ప్ర‌కాశ్‌రెడ్డి ఇంటికి త‌ప్ప‌క వెళ్తారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌కాశ్‌రెడ్డిని సీబీఐ విచారిస్తున్న నేప‌థ్యంలో ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి. 

వైఎస్ కుటుంబంలోని అన్న‌ద‌మ్ముల మ‌ధ్య విభేదాలున్నాయా? ముఖ్యంగా హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కుటుంబంలోని ప్ర‌ముఖుల‌తో వైఎస్ వివేకాకు ఆస్తి త‌గాదాలు, రాజ‌కీయ విభేదాలు, చంపుకునేంత వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు ఉన్నాయా? అనే కోణంలో విచారిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

వివేకాతో కుటుంబ స‌భ్యుల మ‌ధ్య గొడ‌వ‌లు, వాటి ప‌రిష్కారం గురించి ప్ర‌కాశ్‌రెడ్డిని గుచ్చిగుచ్చి అడిగిన‌ట్టు స‌మాచారం. మొత్తానికి వైఎస్ ప్ర‌కాశ్‌రెడ్డి ఏం చెప్పార‌నేది ఉత్కంఠ‌కు దారి తీసింది.