టీడీపీ, జనసేన భవిష్యత్ ని తేల్చేది హుజూరాబాదే

అదేంటి.. హుజూరాబాద్ తో టీడీపీ, జనసేనకు లింకేంటి అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నాం. హుజూరాబాద్ లో హోరాహోరీ పోరాటం టీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య అనే విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడయ్యాక.. కాంగ్రెస్…

అదేంటి.. హుజూరాబాద్ తో టీడీపీ, జనసేనకు లింకేంటి అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నాం. హుజూరాబాద్ లో హోరాహోరీ పోరాటం టీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య అనే విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడయ్యాక.. కాంగ్రెస్ హడావిడి ఎక్కువైంది. పోనీ గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లను బేరీజు వేసుకుని ఆ పార్టీని కూడా పోటీదారుగా భావిద్దాం. 

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల, తన పార్టీ పోటీలో ఉండదని ముందే చెప్పేశారు. కోదండరాం ఎవరికైనా మద్దతిస్తారా లేక తెలంగాణ జనసమితి తరపున అభ్యర్థిని పెడతారా అనేది ఎవరికీ పెద్దగా అవసరం లేని సబ్జెక్ట్. వామపక్షాలు లిస్ట్ లో లేవు. ఇక టీడీపీ, జనసేన భవిష్యత్ కార్యాచరణ హుజూరాబాద్ నుంచే మొదలు కావాల్సి ఉంది.

టీడీపీ పోటీ చేస్తుందా..? బీజేపీతో ప్యాచప్ కి రెడీ అంటుందా..?

ప్రస్తుతం టీడీపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇబ్బందుల్లో ఉంది. ఏపీలో కాస్తో కూస్తో ఆలోచించే పరిస్థితి ఉంది కానీ, తెలంగాణలో దాదాపుగా చచ్చిపోయింది.. టీడీపీ తరపున భవిష్యత్తులో ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేలుగా గెలుస్తారంటే అతిశయోక్తే అవుతుంది. 

సాక్షాత్తూ పార్టీ అధ్యక్ష పదవికే వంద మందిని బతిమిలాడుకుంటే ఒక్కరు తలూపారు. ఈ దశలో హుజూరాబాద్ లో ఆ పార్టీ పోటీకి దిగలేదు. మరి ఎవరికి మద్దతిస్తుంది. ఇంకా పార్టీకి విధేయుడిగానే ఉన్న రేవంత్ రెడ్డికి లోపాయికారీగా సాయపడుతుందా..? బీజేపీతో స్నేహం కోరుకుంటుంది కాబట్టి ఈటలకు మద్దతిచ్చి ఊరుకుంటుందా..?

గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి పోటీ చేసిన టీడీపీ ఆ తర్వాత కూటమి నుంచి బయటకొచ్చింది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ, ఇతర బైపోల్స్ లో ఒంటరిగా బరిలో దిగి పరువు పోగొట్టుకుంది. సో.. హుజూరాబాద్ లో ఏనుగుల కొట్లాటలో చీమలా చితికిపోకుండా కనీసం ఏదో ఒక ఏనుగుకి సపోర్ట్ ఇవ్వాలనుకుంటోంది. మరి చంద్రబాబు ఆదేశాలతో టీటీడీపీ కొత్త అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

జనసేన పూర్తిగా జెండా ఎత్తేసినట్టేనా..?

బీజేపీతో జతకట్టిన తర్వాత జనసేన పూర్తిగా ఎన్నికలకు దూరమైంది. ఓ దశలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసైనికులు తిరుగుబాటు చేసినంత పని చేశారు. కానీ జనసేనాని మాత్రం కట్టప్పలా తన విధేయత చాటుకున్నారు. బీఫారంలు ఇచ్చి కూడా వెనక్కి తీసుకుని బీజేపీ కోసం ఓట్లు, సీట్లు త్యాగం చేశారు. తెలంగాణలో పార్టీ నడపడం నా వల్లకాదు అంటూ ఈమధ్య పవన్ కల్యాణ్ బయటపడ్డారు కూడా.

సో.. తెలంగాణలో జనసేన జెండా ఎత్తేసినట్టే. పోనీ పోటీ చేద్దామనుకున్నా అక్కడ గాజుగ్లాసు గుర్తు కూడా ఆ పార్టీకి లేదు. సైలెంట్ గా బీజేపీకి సపోర్ట్ ఇచ్చి జనసైనికులు కేవలం సైనికులే అని మరోసారి చాటి చెబుతారు పవన్ కల్యాణ్.

హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రక్రియ మొదలైతే.. అటు టీడీపీ, ఇటు జనసేన భవిష్యత్ పై పూర్తి క్లారిటీ వస్తుంది. అప్పటివరకూ పోటీ విషయాన్ని దాటవేస్తూ వచ్చినా ఎన్నికల సమయంలో మాత్రం ఏదో ఒకటి తేల్చక తప్పదు. సొంతగా పోటీకి దిగలేని పరిస్థితి టీడీపీది, కుర్రాళ్లు ఉత్సాహంగా ఉన్నా, వారిపై నీళ్లు చల్లి పడుకోబెట్టే తత్వం జనసేనది.