బాబు క‌లను నెర‌వేర్చిన జ‌గ‌న్!

త‌న పుత్ర ర‌త్నం నారా లోకేశ్‌ను లీడ‌ర్‌గా తీర్చిదిద్దాల‌ని టీడీపీ అధినేత‌, యువ కిశోరం తండ్రి నారా చంద్ర‌బాబునాయుడు ఎంత‌గానో క‌ల క‌న్నారు. కానీ లోకేశ్‌ను లీడ‌ర్ చేయ‌లేక‌పోయారాయ‌న‌. త‌న‌కు అధికారం పోవ‌డం కంటే…

త‌న పుత్ర ర‌త్నం నారా లోకేశ్‌ను లీడ‌ర్‌గా తీర్చిదిద్దాల‌ని టీడీపీ అధినేత‌, యువ కిశోరం తండ్రి నారా చంద్ర‌బాబునాయుడు ఎంత‌గానో క‌ల క‌న్నారు. కానీ లోకేశ్‌ను లీడ‌ర్ చేయ‌లేక‌పోయారాయ‌న‌. త‌న‌కు అధికారం పోవ‌డం కంటే త‌న కుమారుడిని నాయ‌కుడిగా తీర్చిదిద్ద‌లేక‌పోయాన‌నే ఆవేద‌న బాబులో ఉంది. అలాంటిది చంద్ర‌బాబు క‌ల‌ను ఆయ‌న ప్ర‌త్య‌ర్థి, ఏపీ ముఖ్య మంత్రి వైఎస్ జ‌గ‌న్ నెర‌వేర్చ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

త‌న పొలిటిక‌ల్ కెరీర్‌లో నారా లోకేశ్ మొద‌టిసారి సోమ‌వారం అరెస్ట్ అయ్యారు. పొలిటీషియ‌న్ అన్న‌వాడు పోలీసుస్టేష‌న్‌, జైలు ముఖాలు చూడ‌క‌పోతే ఎప్ప‌టికీ లీడ‌ర్ కార‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం. ఈ నేప‌థ్యంలో మొట్ట‌మొద‌టిసారిగా పోలీస్ స్టేష‌న్ ముఖం చూసిన లోకేశ్‌ లీడ‌ర్ అనిపించుకున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ఈ క్రెడిట్ అంతా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి వెళుతుంద‌ని చెబుతున్నారు. గుంటూరులో ప్రేమోన్మాది చేతిలో బీటెక్ విద్యార్థిని ర‌మ్య హ‌త్య‌కు గురి కావ‌డం తీవ్ర రాజ‌కీయ దుమారం రేపుతోంది. జ‌గ‌న్ పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేదంటూ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ విమ‌ర్శ‌ల దాడి చేస్తోంది.

ఈ నేప‌థ్యంలో గుంటూరులోని ప‌ర‌మ‌య్య‌గుండ వ‌ద్ద ర‌మ్య మృత‌దేహాన్ని చూడ‌డంతో పాటు ఆమె కుటుంబాన్ని లోకేశ్ ప‌రామర్శించారు. ర‌మ్య హ‌త్య రాజ‌కీయ రంగు పులుముకుంది. ఈ నేప‌థ్యంలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు అక్క‌డ మోహ‌రించ‌డంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కున్నాయి. దీంతో ఇరు పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు బాహాబాహీకి తెగ‌బ‌డ్డాయి. 

ఈ క్ర‌మంలో ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లోకేశ్‌తో పాటు మాజీ మంత్రులు న‌క్కా ఆనంద‌బాబు, ప్ర‌త్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే ధూళి పాళ్ల న‌రేంద్ర‌ను అరెస్ట్ చేశారు. లోకేశ్‌ను ప్ర‌త్తిపాడు పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. కేవ‌లం సోష‌ల్ మీడియాకు, ప్ర‌క‌ట‌న‌ల‌కు ప‌రిమిత‌మైన లోకేశ్‌… ఒక్క‌సారిగా నేల మీద‌కి వ‌చ్చి రాజ‌కీయాలు చేయ‌డం, అరెస్ట్ కావడం టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపింది. 

లోకేశ్‌ను అరెస్ట్ చేయ‌క‌పోతే అస‌లు ఆయ‌న గురించి చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. లోకేశ్ కోరుకున్న‌దే పోలీసులు చేశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. లోకేశ్‌ను అరెస్ట్ చేశార‌ని తెలియ‌గానే, ఆయ‌న తండ్రి నారా చంద్ర‌బాబునాయుడు రంకెలేస్తూ ఖండించ‌డం గ‌మ‌నార్హం. కొడుకుని లీడ‌ర్‌ని చేయాల‌ని తాను ఎంత‌గా ప్ర‌యత్నించినా సాధ్యం కాలేద‌ని, ఆ ప‌ని చేసిన జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు కృత‌జ్ఞ‌త‌లు చెప్పాల‌ని నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్స్ పెట్ట‌డం విశేషం.