కరోనా పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ కుంటుబాటు.. వంటి మాటలైతే తరచూ వింటున్నాం కానీ, భారతీయుల ఆర్థిక శక్తి మాత్రం ఒక్కోసారి ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. కరోనా ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ పూర్తైన దగ్గర నుంచి ఇండియాలో వ్యక్తిగత వాహనాల కొనుగోలు బాగా పెరిగింది, పోస్ట్ కరోనా పరిస్థితుల్లో.. బాగా డిమాండ్ పెరిగిన వాటిలో మాస్కులు, శానిటైజర్లతో పాటు కార్లున్నాయి!
గత ఏడాదిన్నరలో కొత్త కార్లను కొనుగోలు చేసిన వారిని పక్కన పెడితే, ఇప్పుడు దేశంలోని కార్ల కంపెనీల వద్ద వాహనాలను బుక్ చేసుకుని, వెయిటింగ్ చేస్తున్న వారి సంఖ్య అక్షరాలా ఏడు లక్షల పైనేనట! సుమారు ఏడు లక్షల బుకింగ్ లకు కార్లను ఇంకా అందించాల్సి ఉందట ప్రముఖ కంపెనీలు. సెమీ కండక్టర్ల షార్టేజీ, విపరీతమైన డిమాండ్, కొత్త మోడళ్ల పై ప్రజల దృష్టి..ఈ పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు డిమాండ్ కు తగ్గట్టుగా కొత్త కార్లను అందించలేకపోతున్నట్టుగా సమాచారం!
మహీంద్రా ఎక్స్యూవీ 700, మారుతీ సీఎన్జీ వేరియెంట్స్, ఎస్యూవీ తరహా మోడల్ కార్లు, హ్యూండాయ్ క్రెటా, కియా సెల్టస్, ఎంజీ ఆస్టర్, టాటా పంచ్, మెర్సిడెస్ జీఎల్ఎస్, ఆడీ ఇట్రాన్…. వీటి కోసమే ఎక్కువ మంది కస్టమర్లు వేచి ఉన్నారట. ఆల్రెడీ ఈ మేరకు కార్లను బుక్ చేసుకున్న వారు డెలివరీ కోసం పక్షాలు, నెలల రోజులుగా వెయిటింగ్ లో ఉన్నారట ఏడు లక్షల మంది!
కంపెనీల వారీగా చూస్తే మారుతి రెండున్నర లక్షలు, హ్యుండాయ్ లక్ష, టాటా మోటర్స్ లక్ష, మహీంద్రా లక్ష, కియా మోటర్స్ డెబ్బై ఐదు వేలు, ఎంజీ నలభై ఆరు వేలు, ఫోక్స్ వేగన్, ష్కోడా, టయోటా, రెనాల్ట్, ఆడీలు కలిపి డెబ్బై ఐదు వేలు, మెర్సిడెస్ 28 వేల బుకింగ్ లకు డెలివరీని పెండింగ్ లో కలిగి ఉన్నాయట.
ఈ పరిస్థితి ఇండియాలో కొత్తేమీ కాదు. అయితే గతంలో ఏదైనా డిమాండ్ ఉన్న మోడల్ కు మాత్రమే ఇలాంటి వెయిటింగ్ పిరియడ్ ఉండేది. మారుతి బలేనో సూపర్ సక్సెస్ తర్వాత దాన్ని కొనాలని చూసిన కస్టమర్లు కొందరు ఐదారు నెలల పాటు కూడా వేచి ఉండే వారు. ఇలాంటి హైపర్ డిమాండ్ ఇప్పుడు కూడా కొన్ని మోడళ్లకు ఉంది. అయితే దానికి తోడు.. ప్రజలు వ్యక్తిగత వాహనాల కొనుగోలుకు అమితాసక్తి చూపుతూ ఉండటం, కార్లను మార్చే వాళ్లూ ఉత్సాహంతో ఉండటం, ప్రొడక్షన్ కాస్త లేటవుతూ ఉండటంలో భారీ ఎత్తున బుకింగ్ లకు డెలివరీలు పెండింగ్ లో పడిపోయినట్టుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.