తమ ప్రభుత్వం చేయగల రుణపరిమితిని పెంచుకుంది బైడెన్ సర్కారు. దేశ రుణపరిమితి.. నిర్దేశిత స్థాయిని చేరిపోవడంతో, అదనంగా రుణాలను తెచ్చుకోవడానికి అమెరికన్ ప్రభుత్వం పరిమితి స్థాయిని పెంచుకుంది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. దీంతో బైడెన్ సర్కారు ఊపిరి పీల్చుకోగలుగుతోంది.
కరోనా పరిస్థితులు, భారీ ఎత్తున సహాయక ప్యాకేజ్ ల నేపథ్యంలో.. భారీగా అప్పు పరిమితి పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. దాదాపు ఇప్పటికే పరిమితి దాటి అమెరికన్ గవర్నమెంట్ అప్పు తెచ్చుకున్నట్టుగా అక్కడి ప్రతిపక్షం ఆరోపిస్తోంది. అయితే అదనంగా మరో రెండున్నర ట్రిలియన్ డాలర్ల అప్పు పరిమితిని పెంచుకుంది బైడెన్ గవర్నమెంట్.
ఇది వరకే అమెరికా ప్రభుత్వం అప్పు భారం సుమారు 29 ట్రిలియన్ డాలర్లు. ఇప్పుడు మరో రెండున్నర ట్రిలియన్ డాలర్ల అప్పుకు ప్రభుత్వం పరిమితిని పెంచుకుంది.
ఒక ట్రిలియన్ డాలర్ అంటే.. ఒక లక్ష కోట్ల డాలర్లు. ఇప్పటి వరకూ అమెరికాకు ఉన్న అప్పు 29 లక్షల కోట్ల డాలర్లు కాగా, ఇప్పుడు బైడెన్ సర్కారు మరో రెండు న్నర లక్షల కోట్ల డాలర్ల అప్పుకు పరిమితిని పెంచుకుంది.
ఒకవైపు భారత ప్రభుత్వం భారీ ఎత్తున అప్పులు చేసిన వైనం చర్చలో ఉంది. తాము అధికారంలోకి రావడానికి ముందున్న దేశం ఖాతాలో ఉన్న అప్పుకు సమానమైన రీతిలో మోడీ ప్రభుత్వం గత ఏడేళ్లలో అప్పులు చేసింది. ఒకవైపు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వేల కోట్ల రూపాయాలను పోగేసుకుంటూ కూడా అప్పులు చేయడంలో పాత ప్రభుత్వాల రికార్డులను తలదన్నే రీతిలో మోడీ ప్రభుత్వం సాగుతోంది. అత్యంత ధనిక దేశం అమెరికా కూడా ఇప్పుడు అప్పుల పరిమితిని పెంచుకోవడం గమనార్హం.