తన మాటలు, చేష్టలు ఎదుటి వాళ్లకు కోపం తెప్పించేలా, కొడతామనిపించేలా ఉన్నాయనే స్పృహలోనే రఘురామకృష్ణరాజు ఉన్నారు. ఆ జ్ఞానం ఆయనలో ఉన్నందుకు తప్పకుండా అభినందించాలి. ఎవరైనా అజ్ఞానంతో మాట్లాడ్డం చూశాం. కానీ రఘురామకృష్ణంరాజు ఎంతో ఆలోచించి, తెలివిగా మాట్లాడుతుంటారు.
కాకపోతే ఆయన మాటల్లో అహంకారం పుష్కలంగా కనిపిస్తుంటుందనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. రఘురామకృష్ణంరాజుకు డబ్బు, కేంద్రంలోనూ, మీడియాలో పలుకుబడికి కొదవలేదు. అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అనే చందంగా తయారైంది ఆయన పరిస్థితి. తనకు తానే స్వీయ నిర్బంధం విధించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టడానికి ఎందుకో ఆయన బాగా భయపడుతున్నారు. అది సీఐడీ వాళ్లు పెట్టిన భయమో, మరే కారణమో తెలియదు కానీ….ఆంధ్రాలో అడుగు పెట్టడం అంటూ జరిగితే తప్పకుండా దెబ్బలు తినాల్సి వస్తుందని ఆయన భయపడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మరోసారి బయట పెట్టుకున్నారు. ఏంటి సార్ ఈ ఖర్మ?
కేంద్రహోంమంత్రి అమిత్‌షా ఆయనకు మిత్రుడైనప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టడానికి భయపడుతున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి. అమరావతి రాజధాని, దాని కోసం పోరాడుతున్న వారన్నా సార్‌కు అనంతమైన లవ్. ఈ నెల 17న అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ తిరుపతిలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు.
ఆ సభకు వెళ్లాలని సార్‌కు మనసులో బలమైన కోరిక. రావద్దని ఎవరూ చెప్పలేదు. వస్తే ఏదైనా చేస్తామని కూడా ఎవరూ హెచ్చరించలేదు. కానీ మనసులో ఎక్కడో అలజడి. వెళితే తంతారనే బలమైన నమ్మకం, విశ్వాసం…అది కూడా తన చేష్టలే కలిగిస్తున్నాయని అర్థం చేసుకోవాలేమో!
అది కూడా తన పార్టీ ప్రోద్బలంతోనే జరుగుతుందనేది సార్ ఆరోపణ. ‘అమరావతి రైతులు ఈ నెల 17న తిరుపతిలో నిర్వహించనున్న బహిరంగ సభకు వెళ్లాలని అనుకుంటున్నా. అయితే అక్కడకు వెళ్తే నాపై దాడి జరిగే అవకాశం ఉంది’ అని అమిత్‌షాకు రఘురామ ఫిర్యాదు చేయడం గమనార్హం.
పులి కంటే గిలి అంటేనే భయమని చెబుతారు. ఎంత కాలమని మనం పుట్టిన గడ్డకు వెళ్లకుండా ఉంటాం రఘురామ సార్. ఆంధ్రాకు వెళితే పోయేదేం లేదు…కొడితే రెండు దెబ్బలే కదా. ఆ తర్వాత మీ మాటలతో ఎటూ అంతకు రెట్టింపు దెబ్బలు కొట్టే శక్తిసామర్థ్యాలు మీ సొంతం. పదండి సార్ తిరుపతి సభకు.