రేపటితో ముసుగులు తొలగిపోతాయా? అసలు రంగులు బయటపడతాయా? ఆకుపచ్చ కండువాలు కప్పుకుని సాగుతున్న ఉద్యమం మొత్తం పసుపుపచ్చ కండువాల ప్రేరేపితమే అనే సంగతి రేపటితో బయటపడబోతోందా? రాజకీయ వర్గాలు మాత్రం అవుననే విశ్లేషిస్తున్నాయి.
తిరుపతి దాకా పాదయాత్ర చేసిన అమరావతి ఉద్యమకారులు శుక్రవారం బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. చాలా పెద్ద హైడ్రామా తర్వాత.. హైకోర్టు అనుమతులు తెచ్చుకుని మరీ వారు సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రావడం ఖరారైంది.
ఇతర పార్టీల నుంచి ఎవరెవరు వస్తారో ఇంకా తేలలేదు. కాకపోతే.. అమరావతి వారి తిరుపతి బహిరంగ సభలో చంద్రబాబునాయుడు ఎంత అతిచేస్తే.. అమరావతి డిమాండ్ కే అంత నష్టం అని పలువురు విశ్లేషిస్తున్నారు.
అమరావతి లో మాత్రమే ఏకైక రాజధాని ఉండాలనే డిమాండ్ తో సాగుతున్న పోరాటం.. ఉద్యమాలు ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రేరేపిత, స్పాన్సర్డ్ కార్యక్రమాలే అనే వాదన తొలినుంచి ఉంది. తెలుగుదేశం వాళ్లు ఆ ఉద్యమానికి బహిరంగంగా తమ పార్టీ పచ్చ రంగు పులమడానికి ఇష్టపడలేదు. కానీ ఉద్యమాకారులంతా తామందరూ రైతులే అని బిల్డప్ ఇవ్వడానికి ఆకుపచ్చ కండువాలతో దీక్షలు చేసేవారు.
కానీ వాళ్లు ఓ పెద్ద కార్యక్రమంగా సుదీర్ఘమైన అమరావతి టూ తిరుపతి పాదయాత్ర ప్రారంబించిన తరువాత.. అసలు రంగులు బయటపడ్డాయి. దారిపొడవునా ప్రతిచోటా.. తెలుగుదేశం నాయకులే వారికి సకల ఏర్పాట్లు చేశారు. అన్ని హంగులు సమకూర్చారు. విందులు, ఆలయాల్లో దర్శనాలు ఏర్పాటుచేశారు.
ఇది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అని స్పష్టంగా బయటపడింది. మధ్యలో అమిత్ షా గట్టిగా అదిలించడంతో కొంతమేరకు బీజేపీ శ్రేణులు, మనమొక్కరమూ ఐసొలేట్ అయిపోతామేమో అనే భయంతో జనసేన వర్గాలు.. మొక్కుబడిగా అడుగుపెట్టాయి.
ఇప్పుడు బహిరంగ సభ వంతు వచ్చింది. ఈ సభలో చంద్రబాబునాయుడు అమరావతి నా డ్రీమ్ ప్రాజెక్టు. నా ఘనత.. నేను రాష్ట్రానికి ఇచ్చిన కానుక.. లాంటి ప్రగల్భాలు పలికితే మాత్రం.. అసలే చంద్రబాబునాయుడు ముద్ర అనేది రాష్ట్రంలోనే లేకుండా చేయాలనిచూస్తున్న జగన్మోహన రెడ్డికి మరింతగా కాలుతుంది.
ఇప్పుడేతో శాసన రాజధాని అని ఒక పదం కేటాయించి.. అమరావతికి కొంత విలువ ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సభలో.. అమరావతి మొత్తం తన ఘనతే అని చాటుకునేలా చంద్రబాబు అతిచేస్తే మాత్రం.. జగన్మోహన రెడ్డి.. మరింతగా ఆ ముద్రను చెరపివేసే ప్రయత్నమే చేస్తారు. ఆ రకంగా.. చంద్రబాబునాయుడు వల్ల అమరావతి ప్రాంతవాసుల కోరికకు మేలు కంటే కీడే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.
ఈ విషయం తనకు క్లారిటీ ఉన్నప్పటికీ.. చంద్రబాబు ఏమైనా స్వోత్కర్షలకు పోకుండా.. వాస్తవమైన డిమాండ్ ను వినిపిస్తారని అనుకోవడానికి కూడా వీల్లేదు. చంద్రబాబుకు ఎఫ్పుడూ కూడా ప్రయోజనం నెరవేరడం కంటె.. రాజకీయ స్వార్థమే ఎక్కువగా ఉంటుంది.
అమరావతిలో రాజధాని ఉండడంకూడా ఆయనకు అక్కర ఉండదు. కానీ.. అమరావతికి ద్రోహం చేస్తున్నాడు అని మాటలు రువ్వు.. జగన్మోహనరెడ్డిని ఓడించాలనే దుగ్ద ఒక్కటే ఉంటుంది. ఇలాంటి సంకుచిత ఆలోచనలతో మాట్లాడకుండా.. విశాలదృక్పథంతో 17నాటి తిరుపతి బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడితే.. అమరావతి వారికే లాభం. అందుకు వాళ్లు జాగ్రత్తపడడం మంచిది.