ఊహించినట్టే జరిగింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ అందుబాటులోకి వస్తే మరిన్ని పాజిటివ్ కేసులు వెలుగుచూసే ప్రమాదముందని అధికారులు ముందే ఊహించారు. ఇప్పుడదే జరిగింది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో అమాంతం 75 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 722కు చేరింది.
తాజాగా నమోదైన ఫలితాల్లో చిత్తూరు, గుంటూరు, కర్నూల్ నుంచి అత్యథికంగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. చిత్తూరులో 25, గుంటూరులో 20, కర్నూలులో 16 కేసులు బయటపడ్డాయి. అటు అనంతపురం నుంచి 4, ఈస్ట్ గోదావరి నుంచి 2, కడప నుంచి 3, కృష్ణా నుంచి 5 కేసులు బయటపడ్డాయి.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా కారణంగా ముగ్గురు మృతిచెందారు. అనంతపురం, కృష్ణా, కర్నూలు జిల్లాల నుంచి చెరొకరు మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 20కు చేరింది. మరోవైపు కోలుకున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈరోజు ఉదయం 9 గంటల నాటికి రాష్ట్రవ్యాప్తంగా 92 మంది కోలుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 610 మందికి చికిత్స కొనసాగుతోంది.
మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్, ముస్లిం మత పెద్దలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని విజ్ఞప్తిచేసిన సీఎం.. ఉగాది, శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వేడుకల్ని ఇళ్లలోనే జరుపుకున్న విషయాన్ని గుర్తుచేశారు.