కరోనా విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదిలో చేసిన ప్రకటనలకు, ఇచ్చిన ఆదేశాలకూ అన్ని రాష్ట్రాలూ విలువను ఇచ్చాయి. జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ ల విషయంలో పూర్తిగా మోడీ ఆదేశాలనుసారమే రాష్ట్రాలు నడుచుకున్నాయి. వేర్వేరు రాజకీయ పార్టీలు, మోడీతో వైరుధ్యభావాలున్న పార్టీల ఆధ్వర్యంలోని రాష్ట్రాల్లో కూడా మోడీ చెప్పిందల్లా జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగానే కష్టపడ్డాయి.
ఏప్రిల్ 19వ తేదీ వరకూ ఇదంతా బాగానే నడిచింది కానీ, ఏప్రిల్ 20 నుంచి మాత్రం కథ మారుతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు నుంచి షరతులతో కూడిన లాక్ డౌన్ మినహాయింపు ఉంటుందని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ షరతుల గురించి సామాన్య ప్రజలకు ఇంకా అవగాహన లేదు, వాళ్లు మే 3 వరకూ లాక్ డౌన్ కు ప్రిపేర్ అయ్యారు. అయితే ఇప్పుడు రాష్ట్రాలు రకరకాల నిర్ణయాలను అమలు చేస్తూ ఉన్నాయి.
కేరళ సర్కారేమో చాలా రకాలుగా లాక్ డౌన్ ను మినహాయించింది. రెస్టారెంట్లు, హోటళ్లకు పర్మిషన్ ఇచ్చింది. తెలంగాణ సర్కారేమో మరో రకంగా వ్యవహరిస్తోంది. మినహాయింపుల సమస్యే లేదన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో మోడీ కన్నా మరో అడుగు ముందుకు వేసి తమ రాష్ట్రంలో మే 7 వరకూ లాక్ డౌన్ అని ఆయన మరో ప్రకటన చేశారు. మోడీ తో నిమిత్తం లేకుండా ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ కొనసాగుతుందని కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. మోడీ ఆ లాక్డౌన్ మే 3 వరకూ పొడిగించగా, కేసీఆర్ దాన్ని మే 7 వరకూ అంటూ ప్రకటించారు. ఇంకా వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా కనిపిస్తోంది పరిస్థితి. పశ్చిమ బెంగాల్ లాక్ డౌన్ విషయంలో తమ మాట వినడం లేదని కేంద్రం మొదటి నుంచి భావిస్తోంది.
అయితే రాష్ట్రాల నుంచి ఒక కంప్లైంట్ ఉంది. అది మోడీ మాటల మనిషే కానీ చేతల మనిషి కాదని అవి అంటున్నాయి. కేంద్రం పిసినారిగా వ్యవహరిస్తూ ఉందని, పన్నుల్లో వాటాను పట్టుకెళ్లే కేంద్రం ఈ కష్ట కాలంలో రాష్ట్రాలను అందుకునేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని, ఇది వరకూ చేసిన లక్షా 70 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటనతో రాష్ట్రాలకు దక్కేది ఏమీ లేదని అవి తేలుస్తున్నాయి. మోడీ ఏమో నీళ్లు తాగినంత సులువుగా లాక్ డౌన్ పొడిగింపు ప్రకటనలు చేసి వెళ్లిపోతున్నారు. ప్రకటించడంలో గొప్పే ముంది? పరిస్థితులను అర్థం చేసుకోవద్దా? అని రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి!