పెద్ద కొట్లాట ముగిసింది… ఇప్పుడు చిన్న కొట్లాట

హోరాహోరీగా సాగుతుందనుకున్న సంక్రాంతి చప్పగా మారింది. ఆర్ఆర్ఆర్ వాయిదా పడడం, అంతకంటే ముందే భీమ్లానాయక్, సర్కారువారి పాట పోస్ట్ పోన్ అవ్వడం, ఈ లిస్ట్ లోకి రాధేశ్యామ్ కూడా అనధికారికంగా చేరడంతో సంక్రాంతి బాక్సాఫీస్…

హోరాహోరీగా సాగుతుందనుకున్న సంక్రాంతి చప్పగా మారింది. ఆర్ఆర్ఆర్ వాయిదా పడడం, అంతకంటే ముందే భీమ్లానాయక్, సర్కారువారి పాట పోస్ట్ పోన్ అవ్వడం, ఈ లిస్ట్ లోకి రాధేశ్యామ్ కూడా అనధికారికంగా చేరడంతో సంక్రాంతి బాక్సాఫీస్ చిన్నబోయింది. బంగార్రాజుపై కూడా అనుమానాలు ముసురుకోవడంతో, ఈ సంక్రాంతికి చిన్న సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి. దీంతో మొన్నటివరకు పెద్ద సినిమాల మధ్య ఉన్న పోటీ కాస్తా, ఇప్పుడు చిన్న సినిమాల కొట్లాటగా మారింది.

ఆర్ఆర్ఆర్ రావాల్సిన జనవరి 7 తేదీ కోసం చాలా పోటీ నడుస్తోంది. ఆ తేదీకి ఇప్పటికే రానా నటించిన 1945 సినిమాను సిద్ధం చేశారు. దీంతో పాటు ఆది సాయికుమార్ నటించిన అతిథి దేవోభవ, ఆర్జీవీ మిస్సింగ్ అనే మరో 2 సినిమాలు కూడా షెడ్యూల్ అయి ఉన్నాయి. ఈ తేదీకి ఇంకో 2 సినిమాలు వచ్చేలా ఉన్నాయి. వీటిలో అజిత్ నటించిన డబ్బింగ్ మూవీ కూడా ఉంది.

ఇక అసలైన తేదీ జనవరి 14కు వచ్చేసరికి పోటీ మరింత పెరిగింది. ఈ తేదీకి ఇప్పటికే 5 సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. వీటిలో దిల్ రాజుకు చెందిన రౌడీ బాయ్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగవంశీకి చెందిన డీజే టిల్లూ రావడం పక్కా అని తేలిపోయింది. వీటితో పాటు తేదీలు ప్రకటించిన సూపర్ మచ్చి, 6 నైట్స్ 7 డేస్, హీరో సినిమాలు కూడా వచ్చేలా ఉన్నాయి. ఇవి కాకుండా 14వ తేదీకి మరో 3 సినిమాలు వస్తాయంటున్నారు.

ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా కూడా వాయిదా పడడం వల్లనే చిన్న సినిమాలన్నీ ఇలా క్యూ కట్టాయనే విషయం అర్థమౌతూనే ఉంది. కాకపోతే రాధేశ్యామ్ పోస్ట్ పోన్ అయిన విషయాన్ని ఇంకా బయటపెట్టలేదు. ప్రచారాన్ని మాత్రం ఆపేశారు. 7వ తేదీన వాయిదా విషయాన్ని బయటపెడతారంట.

ఇక సంక్రాంతికి వస్తుందనుకుంటున్న బంగార్రాజు సినిమాపై కూడా ఇప్పుడు అనుమానాలు పెరిగాయి. తమ సినిమా సంక్రాంతికే వస్తుందంటూ రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేసి మరీ ఎనౌన్స్ చేశాడు నాగార్జున. ఇది పాన్ ఇండియా సినిమా కాదు కాబట్టి, ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ పరిస్థితుల ప్రభావం ఈ సినిమాపై పడదు. కానీ ఏపీలో టికెట్ రేట్లు అంశం ఈ సినిమాను కలవరపెడుతోంది. పైగా సంక్రాంతి నాటికి ఫస్ట్ కాపీ రెడీ అవ్వదనే టాక్ కూడా వినిపిస్తోంది.