సోషల్ మీడియాలో అగంతకులు ఛీత్కరించుకునే పనికి తెగబడ్డారు. ఒక సామాజిక వర్గం మహిళల ఫొటోలను సోషల్ మీడియా నుంచి సేకరించి, వేలం జాబితాలో చేర్చడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఒక మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళల టార్గెట్‌గా ఈ చర్య ఉండడం గమనార్హం. దీనిపై దేశ వ్యాప్తంగా మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు, పలు రాజకీయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఓ ఆగంతుకుడు ‘బుల్లీబాయ్’ పేరుతో రూపొందించిన బ్లాగ్/యాప్ లో మైనార్టీ మహిళల ఫొటోలను అమ్మకానికి పెట్టాడు. ఇలా వందల సంఖ్యలో అందమైన మహిళల ఫొటోలు ఆ యాప్‌లో దర్శనమిచ్చాయి. ‘బుల్లీబాయ్ ఆఫ్ ది డే’ పేరుతో రోజుకొక మహిళ ఫొటోను వేలం జాబితాలో ప్రముఖంగా పెట్టాడు.
సోషల్ మీడియాలో వికృత పోకడలను గుర్తించిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని ట్విటర్లో పేర్కొంటూ.. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వినీవైష్ణవ్‌కు ట్యాగ్ చేశారు. మరోవైపు ఇదే విషయమై ఢిల్లీకి చెందిన ఓ మహిళా జర్నలిస్టు తాను కూడా బాధితురాలినే అంటూ పోలీసులను ఆశ్రయించారు. తన ఫొటోను బుల్లీబాయ్ యాప్‌లో అమ్మకానికి పెట్టారంటూ ఫిర్యాదు చేశారు.
ఈమె ఫిర్యాదుపై ఢిల్లీ సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ అంశంపై జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు సీరియస్ అయ్యారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. ఈ యాప్‌పై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి అశ్వినీవైష్ణవ్ భారత సైబర్ సెక్యూరిటీ సంస్థ(సెర్ట్-ఇండియా)ను ఆదేశించారు. సెర్ట్ ఇండియా వెంటనే యాప్ హోస్టింగ్ సంస్థ గిట్‌హబ్‌ను సంప్రదించి.. ఆ యూజర్‌ను బ్లాక్ చేయించింది.
దీనిపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. ఓ వర్గం మహిళలను అవమానించే ఇలాంటి దుశ్చర్యలను అడ్డుకోవాలంటే మనమంతా ఒక్కటై పోరాడాలని ఆయన ట్విటర్ వేదికగా పిలుపు నిచ్చారు. నేరస్తులకు శిక్షలు పడకపోవడం వల్లే వారు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.