భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం హుజూర్ నగర్ నియోజకవర్గానికి కొత్త కాదని పాత గణాంకాలు చెబుతూ ఉన్నాయి. గత ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఈ నియోజకవర్గంలో 86 శాతానికి మించి ఓటింగ్ నమోదు అయ్యింది. దాంతో పోలిస్తే ఇప్పుడు 84 శాతం పోలింగ్ నమోదు కావడం కాస్త తక్కువే. అయినప్పటికీ 84 శాతం పోలింగ్ అంటే మాటలు కాదు. అది కూడా ఎలాంటి ప్రభావం చూపలేని ఉప ఎన్నికకు ఇంత శాతం ఓటింగ్ అంటే గొప్ప సంగతే!
ఇక పోలింగ్ సరళిపై రాజకీయ పార్టీలు గట్టిగా మాట్లాడటం లేదు. టీఆర్ఎస్ వాళ్లు మాత్రం తామే విజయం సాధిస్తామని ప్రకటించుకుంటూ ఉన్నారు. భారీ మెజారిటీతో గెలుస్తామంటూ కేటీఆర్ ప్రకటించుకున్నారు. అదే జరిగితే టీఆర్ఎస్ కు పట్టపగ్గాలు ఉండవు కాబోలు.
ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కు ఈ ఉప ఎన్నికల్లో భార్య ఓడిపోతే అంతకన్నా అవమానం ఉండదు. తను ఎంపీగా గెలిచింది కూడా నిరార్ధకమే అవుతుంది. కాంగ్రెస్ కు ఈ బై పోల్ లో అంత సానుకూలత లేదనే విశ్లేషణా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు తెలుగుదేశం సపోర్ట్ తో కొన్ని ఓట్లు పెరిగాయని, ఇప్పుడు అవి తగ్గిపోయే అవకాశం ఉందనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.
ఇక అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఈ నియోజకవర్గంలో కేవలం 1500 ఓట్లు పొందింది బీజేపీ. ఇప్పుడు ఆ పార్టీ ఎవరి ఓట్లను చీల్చి ఉండవచ్చనేది కూడా ఆసక్తిదాయకమైన అంశమే. ఈ సందేహాలన్నింటికీ ఈ నెల 24న ఫలితాల రూపంలో సమాధానాలు దొరకబోతూ ఉన్నాయి.