చంద్రబాబు వృథా ప్రయాస

పాడిందే పాడరా.. అన్నట్టు జిల్లాల పర్యటనలకు వెళ్లిన చంద్రబాబు అన్నిచోట్లా ఒకటే క్యాసెట్ రిపీట్ వేస్తున్నారు. వైసీపీ పథకాలన్నిటినీ విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని శోకాలు పెడుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ, చంద్రబాబు…

పాడిందే పాడరా.. అన్నట్టు జిల్లాల పర్యటనలకు వెళ్లిన చంద్రబాబు అన్నిచోట్లా ఒకటే క్యాసెట్ రిపీట్ వేస్తున్నారు. వైసీపీ పథకాలన్నిటినీ విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని శోకాలు పెడుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ, చంద్రబాబు టార్గెట్ ఆడియన్స్ ఎవరనేది మర్చిపోతున్నారు. ఆయన ముందున్నవారు, చప్పట్లు కొడుతున్నవారు అందరూ టీడీపీ కార్యకర్తలే. బాబు పెట్టిందే టీడీపీ కార్యకర్తల సమావేశం, అలాంటిది బాబు ప్రసంగాలకు వారంతా పూనకంతో ఊగిపోక ఇంకేం చేస్తారు. అందుకే వారి స్పందన చూసి చంద్రబాబు కూడా అలాగే సంబరపడిపోతున్నారు.

జగన్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అనుకుంటున్నారు. అసలు ఓ ప్రతిపక్షనేత ఇంత తొందరగా జనాల్లోకి వచ్చి సాధించేదేముంది. నాలుగు నెలల్లోనే ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తుంటే చూసే జనానికి అది ఎలా అనిపిస్తుంది. నలభయ్యేళ్ల రాజకీయ జీవితం, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా గడించిన అనుభవం ఉండచ్చుగాక, కానీ ఈసారెందుకో చంద్రబాబు తొందరపడి ముందే కూస్తున్న కోయిలలా మారిపోయారు. పూర్తిగా రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నారు.

దారుణ పరాజయం తర్వాత సరైన అవకాశం కోసం వేచిచూడాలి, ప్రభుత్వానికి తప్పులు చేసే అవకాశం, సమయం రెండూ ఇవ్వాలి. ఆ తర్వాతే రంగంలోకి దిగాలి. వ్యూహాత్మక ప్రతిపక్షాలేవైనా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతాయి. కానీ చంద్రబాబు మాత్రం రెండు నెలలు తిరక్కుండానే బైటకొచ్చారు. నాలుగు నెలలు గడిచేలోపే సగం జిల్లాల్ని కవర్ చేస్తున్నారు. ఇక నాలుగున్నరేళ్లలో బాబు ఏంచేస్తారు. అంత ఓపిక చంద్రబాబు దగ్గర ఉందా?

ఓవైపు పార్టీ నేతలు ఒక్కొక్కరే చేజారిపోతున్నారు, మరోవైపు గ్రౌండ్ లెవల్లో టీడీపీ వీరాభిమానులు కూడా జగన్ పథకాల పట్ల ఆకర్షితులవుతున్నారు. తమపై కక్షసాధింపులుంటాయని అనుకున్నవాళ్లు కూడా సమన్యాయం జరుగుతుండే సరికి జగన్ రాకతో సంబరపడుతున్నారు. ఇలాంటి దశలో చంద్రబాబు వేచి చూడాల్సింది పోయి, ముందే తొందరపడి వైసీపీ ప్రభుత్వానికి తప్పులు చేసే అవకాశం కూడా ఇవ్వడంలేదు.

ఎన్నికల సమయంలో చేయాల్సిన హడావిడి అంతా నాలుగున్నరేళ్ల ముందే పూర్తి చేస్తున్న చంద్రబాబు వృథా ప్రయాస పడుతున్నారు. దీనికితోడు ప్రజలు మళ్లీ తననే సీఎం కావాలని కోరుకుంటున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం ఆయన మూర్ఖత్వాని, భ్రమల్లో బతుకుతున్న ఆయన ప్రవర్తనకు నిదర్శనంగా మారింది.

పంచాయతీలలో చంద్రబాబు నిష్ణాతుడే