2012లో ఢిల్లీలో మొదలైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రస్థానం… కాలం గడిచేకొద్ది దేశ ప్రజల మనసు చూరగొంటోంది. రాజకీయ విలువలు దిగజారుతున్న క్రమంలో మిణుకుమిణుకుమంటూ కొత్త ఆశల్ని ఆప్ చిగురింపజేస్తోంది. పంజాబ్‌లో వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలతో పాటు తనకెదురే లేదని విరవీగుతున్న బీజేపీని సైతం మట్టికరిపించి శభాష్ అనిపించుకుంది. పంజాబ్ విజయం దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ధైర్యాన్ని, భరోసాను ఇచ్చింది.
ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆప్ విస్తరించేందుకు శరవేగంగా కదులుతోంది. ఆప్ సీనియర్ నాయకుడు సోమనాథ్ భారతి మీడియాతో అన్న మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దక్షిణ భారతం నుంచి ఊహించనంత స్పందన వస్తోందని ఆయన అన్నారు. ప్రజల స్పందన చూశామని, దక్షిణాది రాష్ట్రాల్లో దానిని తమ బృందాలు పరిగణలోకి తీసుకుని, ఆ ప్రాంతాల్లో తక్షణం సభ్యత్వం చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆప్ ప్రవేశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కుల, మత, ప్రాంత, విద్వేష రాజకీయాలతో జనం విసిగిపోయారు. వీటికి తోడు మీడియా పైత్యం జనాలకు విసుగు తెప్పిస్తోంది. అసలు రాజకీయ వ్యవస్థపైనే ఏపీ సమాజం విసిగివేసారి పోతోంది. ఈ నేపథ్యంలో ఇంతకంటే భిన్నమైన రాజకీయ పార్టీని, పాలనను ప్రజానీకం కోరుకుంటోంది.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఢిల్లీలో కేజ్రీవాల్ పాలన సాగుతోందనే ప్రచారం ఆసక్తి కలిగిస్తోంది. మనకూ ఒక ఆప్ లాంటి పార్టీ వుంటే, ఎంత బాగుంటుందో అనే ఆలోచన, ఆశ ప్రతి మనిషిలో ఏదో మూలన కలుగుతోంది.
ఇందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆప్ విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీగా సభ్యత్వ నమోదు చేయించేందుకు పాదయాత్ర చేపట్టాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించడం విశేషం. అయితే ఆప్ రాకను ఆషామాషీగా తీసుకుంటే మాత్రం ప్రధాన పార్టీలు బొక్కబోర్లా పడక తప్పదు.
ఎందుకంటే ప్రస్తుతం మనుగడలో ఉన్న వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేనలపై జనం విసుగు చెంది ఉండడం, ప్రత్యామ్నాయ రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ వైపు సామాన్యులు , విద్యావంతులు, మేథావులు, తటస్థులు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఓటు బ్యాంకుపై ఆశలు పెట్టుకున్న వాళ్లకు మాత్రం తీవ్ర నిరాశ ఎదురు కాక తప్పదు.