ఈ నెల 14న జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీగా నిర్వహించేందుకు పవన్‌కల్యాణ్ గట్టి పట్టుదలతో ఉన్నారు. రానున్న ఎన్నికలకు ఈ సభా వేదికపై నుంచి పవన్ శంఖారావం పూరించనున్నారు. అందుకే ఈ సభకు జనసేనతో పాటు వైసీపీ, టీడీపీ, బీజేపీ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఎవరు ఔనన్నా, కాదన్నా ఏపీ రాజకీయాల్లో జనసేనాని పవన్‌కల్యాణ్‌ది క్రియాశీలక పాత్ర.
జనసేనాని పవన్‌కల్యాణ్ 2014లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. 2019లో వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు కుదుర్చుకుని ఎన్నికల బరిలో నిలిచారు. తాను రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయారు. పవన్ పార్టీ కేవలం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీన్ని ఆధారం చేసుకుని పవన్‌కు అంత సీన్ లేదని, రాజకీయంగా జీరో అని వైసీపీ పదేపదే అవహేళన చేస్తుంటుంది. ఇదే టీడీపీ అధినేత చంద్రబాబు విషయానికి వస్తే… ఎంతో తెలివిగా వ్యవహరించడాన్ని గమనించొచ్చు. పవన్‌ను విమర్శించే వాళ్లు గుర్తించుకోవాల్సిన అంశం ఒకటుంది.
జీరో స్వతంత్రంగా ఉంటే ఏ విలువా లేకపోవడం నిజమే. సున్నాను కనుక్కుంది మన దేశస్తులే. ఇదే సున్నా ఏదైనా అంకెకు కుడి వైపు వుంటే విలువ పెరుగుతుంది. ఎడమ వైపు వుంటే ఏ విలువా వుండదు. అంటే సున్నాను కనుక్కోవడంలో ఉద్దేశం, ఆశయం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఏపీలో జనసేనాని పాత్ర కూడా సున్నా లాంటిదే. ఆ పార్టీని కలుపుకుంటే ఎన్నికల్లో సీట్లు పెరుగుతాయనే సత్యాన్ని గ్రహించడం వల్లే పవన్‌కు చంద్రబాబు విలువ ఇస్తున్నట్టు నటిస్తారు.
జనసేనాని పవన్‌పై చంద్రబాబు ప్రేమ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్టు నటనే కావచ్చు. రాజకీయాల్లో సంబంధాలు లాభనష్టాలపై ఆధారపడి వుంటాయి. లాభం వస్తుందంటేనే ఎవరితోనైనా కలుస్తారు, లేదంటే విడిపోతారు. గత సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ విడిపోవడానికి కారణం, బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని, ఆ పార్టీతో కొనసాగితే నష్టపోతామని భావించే చంద్రబాబు విడాకులు ఇచ్చారు. మోదీ హవా కొనసాగుతోందని గ్రహించి ఇప్పుడు నోర్మూసుకున్నారు.
పవన్‌కల్యాణ్ విషయంలో వైసీపీ దూకుడు ఆ పార్టీకి నష్టం తెచ్చేదే. టీడీపీతో జనసేనాని కలవనంత వరకూ వైసీపీ వ్యూహం సక్సెస్ అవుతుంది. వైసీపీ ఓటమే లక్ష్యంగా పెట్టుకుంటే మాత్రం, టీడీపీతో పవన్ కలిసేందుకు వెనుకాడరు. అసలు పవన్ మనసులో ఏముందో సోమవారం జరిగే జనసేన ఆవిర్భావ సభ వెల్లడించే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఒక రాజకీయ పార్టీతో వ్యక్తిగత వైరం ఎప్పటికీ, ఎవరికీ మంచిది కాదు. ఈ విషయంలో వైసీపీ కాస్త పునరాలోచిస్తే మంచిది.