జగన్ ప్రభుత్వం ఏవైనా నిర్ణయాలు తీసుకోవడమే ఆలస్యం. వెంటనే వాటిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడం పరిపాటైంది. అందుకే జగన్ ప్రభుత్వ నిర్ణయాలు ఏవైనా ….ఓయబ్బా అమలు అయినప్పుడు చూడొచ్చులే అనే నిట్టూర్పులు వినిపిస్తు న్నాయి. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ప్రభుత్వం తెరపైకి తేవడం, ఆ బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్టు న్యాయస్థానానికి తెలిపినా, చివరికి తీర్పు ఏంటో అందరికీ తెలిసిందే.
ఎన్నికల హామీ మేరకు జగన్ ప్రభుత్వం జిల్లాల పునర్వ్యస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా 13 జిల్లాలను 26కి పెంచడం తెలిసిందే. జిల్లాల పునర్వ్యస్థీకరణ రాష్ట్రపతి ఆదేశాలకు విరుద్ధమంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడం చర్చనీయాంశమైంది. ఇంకా పిల్ దాఖలు కాలేదని ఆలోచిస్తున్న వాళ్లకు, ఆ నిరుత్సాహం మిగలకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్ సమాజ విస్తృత ప్రయోజనాల గురించి ఆలోచించిన దొంతినేని విజయకుమార్ (గంటూరు), బెజ్జి సిద్ధార్థ (శ్రీకాకుళం), జాగర్లమూడి రామారావు (ప్రకాశం) ఈ పిల్ దాఖలు చేశారు.
కొత్త జిల్లాల ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. ఈ ఏడాది జనవరి 25న ప్రభుత్వం తీసుకొచ్చిన ముసాయిదా నోటిఫికేషన్, అనంతరం జారీ చేసిన జీవోలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీకి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం గుర్తించిన జిల్లాల భౌగోళిక స్వరూపాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రానికి ఉందంటూనే, రాష్ట్రపతి ఉత్తర్వులు(ప్రెసిడెన్షియల్ ఆర్డర్) మార్చకుండా జిల్లాల విభజన చేసేందుకు వీల్లేదని మెలిక పెట్టడం గమనార్హం. ఈ పిల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరపనుంది.
ఇప్పటికే రాజధాని మార్చే అధికారం శానస వ్యవస్థకు లేదని హైకోర్టు తీర్పు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు శాసన వ్యవస్థ అధికారాలు, హక్కులు, బాధ్యతలు ఏంటనే విషయమై చర్చించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఒక రోజు ఆ చర్చకు కేటాయించాలని ప్రభుత్వం అనుకుంటున్న తరుణంలో …ఎన్నికల హామీకి సంబంధించిన అంశంపై హైకోర్టులో పిల్ దాఖలు కావడం విశేషం.
ఉగాది నాడు కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభించాలని భావిస్తున్న తరుణంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకుంది.