యూపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నట్టుగా ప్రకటించారు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. 2022లో జరగనున్న యూపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ పోటీలో ఉంటుందని ఆయన ప్రకటించారు.
మంచి ప్రమాణాలతో కూడిన స్కూళ్లు, హాస్పిటళ్లు, ఉచితంగా కరెంటే యూపీలో అజెండాగా చేసుకోనున్నారట అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ సీఎం హోదాలో ఉన్న ఆప్ కన్వీనర్ యూపీలో తాము బరిలోకి దిగనున్నట్టుగా ఇలా ప్రకటించారు.
ఇది వరకూ కూడా అరవింద్ కేజ్రీవాల్ యూపీలో బరిలోకి దిగారు. అది వారణాసి నుంచి మోడీపై పోటీ. 2014 సార్వత్రిక ఎన్నికలప్పుడు వారణాసి నుంచి మోడీ పోటీ చేయగా, అక్కడ నుంచినే కేజ్రీవాల్ కూడా పోటీ చేశారు. మంచి స్థాయిలో ఓట్లను కూడా పొందాడు ఆప్ కన్వీనర్. అయితే ఆ తర్వాత వ్యూహాలు మార్చి పూర్తిగా స్థానిక అంశాలకే పరిమితం అవుతూ వస్తోంది.
ఢిల్లీలో వరసగా రెండు పర్యాయాలు సంచలన విజయాలు సాధించింది. హర్యానా, పంజాబ్ లలో చెప్పుకోదగిన ఓటు బ్యాంకును సంపాదించింది. పంజాబ్ లో ఒక దశలో ఊపు మీద కనిపించినా ఆ తర్వాత వెనుకబడిపోయింది.
అయితే పంజాబ్, హర్యానాల్లో ఆప్ కు కొంత శాతం ఓటు బ్యాంకు కచ్చితంగా ఉందని స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు యూపీలో పోటీ అంటున్నారు ఆప్ కన్వీనర్.
మరి కుల, మత రాజకీయాలు మాత్రమే చెల్లుబాటులో ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఆప్ ఏమైనా ప్రభావం చూపగలదా? బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చడం కాకుండా, ఆప్ తనకంటూ యూపీలో కొంత ఓట్ల శాతాన్ని సంపాదించినా అది గొప్ప సంగతే అవుతుంది.